ఇంతకూ గ్రహాంతర వాసులు ఉన్నట్టా ? లేనట్టా ?

Sharing is Caring...

గ్రహాంతర వాసుల గురించి మీడియాలో వస్తోన్న కథనాలను నమ్మాలా ? వద్దా ? అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా ?లేరా ? ఈ మిస్టరీ ఏమిటి అనే అంశంపై కన్ఫ్యూజన్ నెలకొంది.  అయితే కొందరు శాస్త్రవేత్తలు చెప్పే విషయాలను బట్టి చూస్తే నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారనిపిస్తుంది.

అంతుపట్టని రేడియో సిగ్నల్స్‌వ్యవహారం .. ఖగోళ మేధావి స్టీఫెన్‌ హాకింగ్‌ లాంటి మేధావుల హెచ్చరికలు..  మరోవైపు నాసా మౌనం  ఇవన్నీ గ్రహాంతర వాసుల పట్ల  విపరీతమైన ఆసక్తి ని పెంచుతున్నాయి.  

ఎన్నోఏళ్లుగా గ్రహాంతరవాసుల గురించి చర్చలు జరుగుతున్నాయి. భూమిని పోలిన గ్రహాలు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు మానవుల్లాంటి జీవులు అక్కడ ఉండొచ్చుకదా అన్న సందేహాలు కలగడం ఎవరికైనా సహజం.  

కొద్దిరోజుల క్రితం  గ్రహాంతర వాసుల గురించి ఇజ్రాయెల్‌ అంతరిక్ష భద్రత విభాగం మాజీ జనరల్ హైమ్ ఎషెడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గ్రహాంతరవాసుల ఉనికి నిజమేనని బల్ల గుద్ది వాదిస్తున్నారు.  

అంతేకాదు, ప్రజల్లోనే కలిసిపోయి తిరుగుతున్నారని కూడా ఎషెడ్ వ్యాఖ్యానించారు.  అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో కలసి గ్రహాంతర వాసులు ఎన్నో ఏళ్లుగా  పనిచేస్తున్నారని ఆయన అంటున్నారు. భూమిపై ప్రయోగాల నిర్వహణకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని ఆయన చెబుతున్నారు. 

మానవులు, అంతరిక్షజీవుల మధ్య ఒప్పంద వేదికగా గాలాక్టిక్ ఫెడరేషన్ ఏర్పాటయ్యిందని, అంగారక గ్రహంలో ఓ అండర్ గ్రౌండ్ స్థావరం కూడా ఉందని  ఎషెడ్ అంటున్నారు. అందులో అమెరికన్ వ్యోమగాములు, ఏలియన్ ప్రతినిధులు ఉన్నారని ఎషెడ్ వెల్లడించారు. పైగా ఈ సంగతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా తెలుసు అంటున్నారు. ‌

ఒక దశలో ట్రంప్  ఈ వివరాలను బహిర్గతం చేయడానికి ఉత్సుకత చూపగా గాలాక్టిక్ ఫెడరేషన్ ఆయనను వారించిందట.  ఎషెడ్ మాటలు వింటుంటే కాసేపు ఇది కల్పిత కథ అనిపిస్తుంది. మరో పక్క నిజమేమో అన్న భావన కలుగుతుంది. కానీ తాను చెప్పిన విషయాలన్ని నూరు శాతం నిజాలని ఆయన వాదిస్తున్నారు.

ఇవే విషయాలను తాను ఐదేళ్ల కిందట చెప్పి ఉంటే తీసుకెళ్లి తనను పిచ్చాసుపత్రిలో పడేసేవాళ్లని కూడా చెబుతున్నారు.  ఇప్పుడు తాను పనిచేస్తున్న విద్యాసంస్థలోనూ.. తనను మతి భ్రమించినవాడిలా చూస్తున్నారని ఆయన వాపోతున్నారు. గతంలో హైమ్ ఎషెడ్ ఇజ్రాయెల్ స్సేస్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌కు మూడు దశాబ్దాల పాటు అధిపతిగా పనిచేశారు.

కాగా ఈయన కంటే ముందు 2018 లో  నాసా మాజీ శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ కెవిన్‌ నూథ్  కూడా దాదాపుగా ఇవే మాటలు చెప్పారు. గ్రహాంతర వాసుల మనుగడ గురించి తెలిసి కూడా నాసా  గోప్యత  ప్రదర్శిస్తోందంటూ ఆయన ఆరోపణలు చేశారు. 2002 నాసా కాంటాక్ట్‌ కాన్ఫరెన్స్‌లో గ్రహంతరవాసుల అంశంపైనే శాస్త్రవేత్తలు  చర్చించారు. ఏలియన్ల మనుగడ నిజమన్న భావనను కొందరు వ్యక్తపరిచారు. మరికొందరు అలాంటివేమీ లేవు అని కొట్టేపారేశారు.

కొందరం సభ్యులు తటస్థంగా ఉన్నారు. కానీ అందరిలో ఏకాభిప్రాయం ఒక్కటే. ప్రజల్లో ఆసక్తి, అనాసక్తి అన్న అంశాలను పక్కనపెడితే వాటి మనుగడపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం నాసాకు ఉంది. ఆకాశంలో కనిపించి.. అదృశ్యమయ్యే యూఎఫ్ఓల మాటేంటి? అవి గ్రహాంతర వాసుల నౌకలా? కాదా? అక్కడక్కడ భూ మైదానాల్లో ఏర్పడే మిస్టరీ ముద్రలేంటి? ఈ రహస్యాలకు నాసా దగ్గర సమాధానాలు ఉన్నాయి. కానీ  ఎందుకు దాస్తున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు’ అని  నూథ్ అప్పట్లో ఆరోపించారు.

ఈ శాస్త్రవేత్తల ప్రశ్నలకు .. ఆరోపణలకు  నాసా స్పందించినట్టు లేదు.  భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాశులు ఉన్నట్టు అయితే సాక్ష్యాధారాలతో సహా చూపిస్తామని నాసా ఇది వరకే ప్రకటించింది. నాసా తాను చేసిన పరిశోధనలను  అత్యంత గోప్యంగా ఉంచింది. 

కాగా గ్రహాంతర వాసుల  అన్వేషణ కు సంబంధించిన విషయాలు అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి. టెలిస్కోప్‌, ఉపగ్రహాల సాయంతో భూమిలాంటి కొన్ని గ్రహాలను గుర్తించినా, మనుషుల్లాంటి గ్రహాంతర జీవులను మాత్రం గుర్తించలేకపోయారు.

అంతమాత్రాన గ్రహాంతరవాసుల ఉనికిని కొట్టిపారేయడానికి వీల్లేదని  శాస్త్రవేత్తలు  అభిప్రాయపడుతున్నారు. భూమి మీద తప్ప మరెక్కడా తెలివైన మనుషుల్లాంటి జీవులు ఉండే అవకాశమే లేదంటూ  ‘నాసా’ కొన్నేళ్ల కిందట కొట్టిపారేసింది. ఆ వాదనకు భిన్నమైన కథనాలు ఇటీవల వస్తున్నాయి. దీంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. 

—————– KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!