కేసులు తేలేదెన్నటికో ? విడుదల ఎప్పటికో ?

Sharing is Caring...

Govardhan Gande………………………………………..

సమిష్టి వ్యవస్థ లో….బాధ్యతలు/అధికారాల విభజన/పంపిణీ సమతుల్యoగా ఉండాలి. అలా ఉండగలిగితేనే ఆ వ్యవస్థ సక్రమంగా,సమర్థంగా పనిచేయగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ఏర్పాటు అనివార్యం. భారత రాజ్యాంగం ఈ విధానాన్నే నిర్దేశిస్తున్నది. అలా నిర్మించిన మూడు స్థంభాలు సరిగ్గా పని చేయగలిగితేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. 

అలాంటి మూడు స్థంభాలలో ఒకటైన న్యాయ వ్యవస్థను బలహీన పరిస్తే మొత్తం ప్రజాస్వామ్య సౌధ పునాదులు దెబ్బ తింటాయి. అలా జరగకుండా చూడవలసిన కర్తవ్యం ప్రభుత్వానిది. ప్రభుత్వ వ్యవస్థ ఆ బాధ్యతను నిర్వర్తించాలి. అప్పుడే మొత్తం వ్యవస్థ సజావుగా నడిచి ప్రజాస్వామ్య లక్ష్యం నేర వేరుతుంది.అప్పుడే కదా వ్యవస్థ పట్ల సమాజానికి విశ్వాసం కలిగేది,నిలబడేది,మనుగడ సాగించేది.

అందుకు వీలుగా నిర్మించిన న్యాయవ్యవస్థ బలహీనంగా ఉండాలని పాలకవర్గం కోరుకుంటున్నదేమో అనే అనుమానం కలుగుతున్నది. దానికి ఈ కారణాలను ఉదహరించవచ్చునేమో చూద్దాం.. కోర్టుల్లో కోట్ల సంఖ్యలో కేసులు పేరుకుపోవడం, న్యాయం కోసం ఏళ్ళ తరబడి (కొన్ని కేసుల్లో తరాలు కూడా మారిన సందర్భాలున్నాయి) కోర్టుల చుట్టూ తిరగడం దీన్నే సూచిస్తున్నది.

కొత్త కోర్టుల ఏర్పాటు జరగదు. ఉన్న కోర్టుల్లో న్యాయాధికారుల కొరత ఉంటుంది. సకాలంలో న్యాయాధికారుల నియామకాలు జరగవు. ఫలితంగా ముద్దాయిల విచారణ ప్రక్రియలో ఏళ్ళ తరబడి జాప్యం జరుగుతూ లక్షల సంఖ్యలో విచారణ ఖైదీలుగా (under trial prisoners) జైళ్ల లో మగ్గిపోవడం చూస్తూనే ఉన్నాం.

నేరారోపణ కు గురైన వ్యక్తి  నేరం నిరూపణ కాకుండానే  జైళ్లలో ఏళ్ళ తరబడి మగ్గిపోవడం ఎలాంటి న్యాయం అనుకోవాలి ? నేర నిరూపణ జరిగిన తరువాత శిక్ష విధించడం,అది అమలు కావడం న్యాయ వ్యవస్థ లక్ష్యం. నేర ఆరోపిత వ్యక్తి నిర్దోషి అని తేలితే అప్పటి వరకు ఆ వ్యక్తి విచారణ ఖైదీ గా అనుభవించిన శిక్షను /కోల్పోయిన జీవిత కాలంలో కనీసం ఒక క్షణ సమయాన్నైనా ఈ వ్యవస్థ తిరిగి ఇవ్వగలదా?

చేయని నేరానికి అనుభవించిన శిక్ష, మానసిక క్షోభలకు పరిహారం ఇవ్వగలరా? ఇలాంటి స్థితిగతుల మధ్య న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఎలా కలుగుతుంది? ఇలా అవిశ్వాసం పెరిగే విధంగా, కోర్టుల వెలుపల పరిష్కారాలు చూసుకోండి,చేసుకోండి అనే విధంగా ప్రభుత్వ వ్యవస్థ తీరు కనిపిస్తున్నదనేది భారత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ (06- 09- 2021 న) వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ధర్మాగ్రహం కనిపిస్తున్నది.

అంటే న్యాయ వ్యవస్థ బలహీనంగా ఉండాలి అని పాలక వ్యవస్థ కోరుకుంటున్నదని భావించవలసి వస్తున్నది.ఈ వ్యవస్థ బలహీనంగా ఉంటేనే తమ ఆటలు సాగుతాయని,తమ అధికారం పది కాలాల పాటు కొనసాగించవచ్చుననే దుర్బుద్ధితో పాలక వ్యవస్థ ఇలా ప్రవర్తిస్తున్నదని, అనుమానించవలసి వస్తున్నది. ఇలాంటి దైన్యంలో మన జనస్వామ్యం ఉన్నది అని అనుకోవాలా?

ఈ కారణంగానే న్యాయ వ్యవస్థను బలహీన పరిచి,పాలక వ్యవస్థ పై ఆధార పడేలా, అస్వతంత్రంగా ఉండేట్లు పాలక వ్యవస్థ ధోరణి ఉన్నదని ప్రధాన న్యాయ మూర్తి ఆగ్రహం,అసహనం,వ్యాఖ్యలను అర్ధం చేసుకోవలసి వస్తున్నది. న్యాయాధికారుల నియామకాలు చేపట్టి,కొత్త కోర్టుల ఏర్పాటు చేయగలిగితే వ్యాజ్యాల పరిష్కారం వేగంగా జరిగి న్యాయ వ్యవస్థ క్రియాశీలంగా మారిపోతుంది.

అప్పుడు ఆ వ్యవస్థ పట్ల ప్రజా విశ్వాసం బలపడుతుంది.అప్పుడు అమలులో ఉన్న “నాయక స్వామ్యం” ప్రజాస్వామ్యంగా నిలదొక్కుకుంటుంది.అదే జరిగితే తమ ఇష్టారాజ్యానికి కాలం చెల్లిపోతుందనే భయం పాలక వ్యవస్థ అనుసరిస్తున్న ఈ ధోరణికి కారణాలుగా అర్ధం చేసుకోవచ్చునేమో అందరూ ఆలోచించాలి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!