ఇవాళ ఆకాశంలో ఓ అద్భుతం జరగబోతోంది. సాయంత్రం 6 గంటలకు ఆకాశంలో పశ్చిమ దిక్కున బృహస్పతి, శని గ్రహాలు చేరువ కానున్నాయి. కొన్ని గంటలపాటు ఈ గ్రహాలు కలిసే ఉంటాయి. అతి ప్రకాశవంతమైన బృహస్పతి, శని గ్రహాలు రెండూ 0.1 డిగ్రీల దూరంలో ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తాయి. క్రీస్తు శకం 1623లో బృహస్పతి, శని గ్రహాలు రెండూ ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చినప్పటికీ సూర్యునికి దగ్గరగా ఉండటం వల్ల ఆ దృశ్యం కనిపించలేదు.ఇవాళ ఈ గ్రహాల కలయికను నేరుగా చూడవచ్చు. ఉత్తరార్థగోళంలో జరిగే గ్రహ సంయోగాన్ని‘స్టార్ ఆఫ్ బెత్లెహేమ్’గా లేదా ‘క్రిస్మస్ స్టార్’ అని అభివర్ణిస్తారు.
ఈ సంయోగం మళ్లీ 2080 మార్చి15న జరుగుతుంది. అంటే శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోకి వస్తాయన్న మాట. ఈ గ్రహాల కలయిక అత్యంత అరుదుగా జరిగే సంఘటన. ఇలాంటి ఘట్టం దాదాపు 400 ఏళ్ల తర్వాత చోటు చేసుకోబోతోందని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. శని, బృహస్పతి దగ్గరగా, ఒకే వరుసలోకి వచ్చే సంఘటన రాత్రి పూట జరిగి దాదాపు 800 ఏళ్లు అయిందని చెబుతున్నారు. గెలీలియో టెలీస్కోప్‌ను కనిపెట్టిన 13 ఏళ్ల తర్వాత 1623లో ‘క్రిస్మస్ స్టార్’ ఆవిష్కృతం అయిందని అంటున్నారు. దీనికి ముందు 1226 లో, అంతకుముందు 794 సంవత్సరాల క్రితం ఈ గ్రహాలు దగ్గర అయ్యాయి. సెప్టెంబర్ నుంచే ఈ గ్రహాల కదలికలను నాసా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
ఇవాళ బృహస్పతి,శని గ్రహాలు ప్రకాశవంతంగా ఉంటాయి కాబట్టి వాటిని చాలా నగరాల నుండి చూడవచ్చు.సూర్యాస్తమయం తరువాత ఒక గంట నైరుతి ఆకాశం వైపు చూడండి. బృహస్పతి ప్రకాశవంతమైన నక్షత్రంలా కనిపిస్తుంది. శని కొద్దిగా మందంగా ఉంటుంది బృహస్పతికి కొద్దిగా పైన ఎడమ వైపున కనిపిస్తుంది. బైనాక్యులర్లు లేదా చిన్న టెలిస్కోప్ ఉంటే ఈ గ్రహాల సంయోగాన్ని చూడవచ్చు అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు .