Bharadwaja Rangavajhala ………………………………….
రాజ్ సీతారామ్ అసలు నామము రాజ్ సీతారామన్ . స్వగ్రామం తమిళనాడు తిరునల్వేలి. అతను క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఆ తర్వాతే సినిమాల్లోకి ప్రవేశించాడు. కే.వి.నటరాజ భాగవతార్ దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసించి .. పదహారేళ్ల వయసులో జేసుదాస్ బృందంలో చేరి వేదికల మీద పాటలు పాడడం ప్రారంబిచారు.
ఆ తర్వాత బాలు ట్రూపులో కూడా కొంత కాలం పాటలు పాడాడు. అదే బాలుకు పోటీగా పాడాల్సి వస్తుందని అప్పటికి ఆ కుర్రాడికి తెలియకపోవచ్చు.తర్వాత తనే శృతిలయ పేరుతో తనే సొంతంగా ఓ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకుని సంగీత కచ్చేరీలు చేసేవాడు. చెన్నై వివేకానంద కాలేజీలో బిఎ ఎకనామిక్స్ చదువుతూ సినిమా పరిశ్రమలో కాలుపెట్టారు.
అంటే సుమారుగా ఎనభై ఐదు జులై నెల్లో ఆయన ‘సూర్యచంద్ర’ సినిమాకు పాడారు. అంతకు సరిగ్గా సంవత్సరం క్రితం ‘జగన్’ లో పాడారు. దానికి ఓ రెండు మూడు నెల్ల అటూ ఇటూగా సత్యం గారి సంగీతంలో పాడారు.
తెలుగు సినిమాకు సంబంధించి …. సంగీత దర్శకుడు సత్యం తొలిసారి ‘అగ్నిసమాధి’ అనే సినిమాలో రాజ్ సీతారామ్ తో పాట పాడించారు. ఆ తర్వాత దాసరి దర్శకత్వంలో వచ్చిన శోభన్ బాబు చిత్రం ‘జగన్’ లో ‘అది ఒక రాతిరీ’ అనే పాటను చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాడారు.
సేలంలో జరిగిన గవర్నమెంట్ ఎగ్జిబిషన్ లో రాజ్ సీతారామ్ కచ్చేరీ విని ప్రముఖ వయెలనిస్టు కన్నక్కుడి వైద్యనాథన్ తను నిర్మించిన తమిళ సినిమా ‘తోడిరాగం’లో పాడించారు. ఇలా సినిమా కెరియరూ స్టేజ్ కెరియరూ నడుస్తూండగా …రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘సూర్యచంద్ర’ సినిమాలో హీరో కృష్ణకు అన్ని పాటలూ తనే పాడే అవకాశం వచ్చింది.
ఆ తర్వాత ‘సింహాసనం’ లోనూ పాడేశారు. బాలు కృష్ణల మధ్య ఆర్ధిక లావాదేవీల్లో సమస్య రావడంతో కృష్ణ తన సినిమాలకు వేరే గాయకుడిని తీసుకోవాలనుకున్న సందర్భంలో రాజ్ సీతారామ్ ఆయన కంట పడ్డాడు. ఘంటసాల రోజుల్లో బాలును మనమే కదా పెంచింది అనే కాన్ఫిడెన్స్ తో ఈ సీతారాముడూ పెరిగి పెద్దోడు అవుతాడనుకున్నారు కృష్ణ.
అలా కాకపోయినా ఇంకోలా ఈయన పెద్దోడయ్యాడు పాపం. అప్పట్లో ఇచ్చిన ఇంటర్యూల్లో కృష్ణ ఈ మాట వాడారు కూడా. బాలు నాకు పాడుతూనే కదా పాపులర్ అయ్యింది అని. ఫైనలాకరుగా సీతారాముడు ఆ విధంగా కృష్ణ సింగర్ గా పాపులర్ అయ్యాడు. తర్వాత కాలం లో రాజ్ కోటి , వేటూరి కలసి కృష్ణకూ బాలసుబ్రహ్మణ్యానికీ రాజీ చేసిన తర్వాత ఈ సీతారాముడు అంతర్ధానం అయ్యాడు.
అవతారం చాలించినట్టుగానే తర్వాత ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం ఇషా ఫౌండేషన్ వాలంటీర్ గా ఉన్నారు. వివేకానంద కాలేజీలో ఎకనామిక్స్ లో డిగ్రీ చేసిన తర్వాత రూరల్ మేనేజ్మెంట్ కాలేజీలో ఎమ్బీయే చదివారు. తర్వాత సొంతంగా ఓ కంపెనీ పెట్టారు. అలా ముందుకు వెళ్లిపోయారుగానీ సినిమా పాటలు గానీ ఇతరత్రా కచ్చేరీలుగానీ చేసినట్టు కనిపించదు.
ఒక వేళ ఎక్కడైనా భక్తి సంగీతం ఏమైనా పాడారేమో నాకు తెలియదు కదా పాపం .. ట్యూబులో కూడా లేవు .. బాలసుబ్రహ్మణ్యం రామకృష్ణలను కలిపితే ఈ సీతారాముడి వాయిస్ వస్తుంది అన్నట్టు ఉండేది .. కానీ ఏం లాభం … అలా ఓ నాలుగైదేళ్లు కూడా పాడినట్టు లేదు .. ఏదేమైనా ప్రిస్టేజియస్ మూవీ ‘సింహాసనం’లో ‘ఆకాశంలో ఒక తారా నాకోసం వచ్చింది ఈ వేళా’పాట మాత్రం అదరగొట్టాడంతే !