ఉత్తరాయణ పుణ్యకాలమంటే ?

Sharing is Caring...
Bhaskar Reddy ……………  

ఉత్తరాయణ పుణ్యకాలమంటే ? సూర్యుని సంచారం రెండువిధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం , రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక్క రోజు కింద లెక్క. “ఆయనే దక్షిణే రాత్రి… ఉత్తరేతు దివా భవేత” అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. “సంక్రాంతి” లేదా “సంక్రమణం” అంటే “చేరడం” లేదా “మారడం”అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. *జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం”సంక్రాంతి”ని ఇలా నిర్వచించింది. “తత్ర మేషాదిషు ద్వాదశ”*రాశి క్రమణేషు* *సంచరితఃసూర్యస్య పూర్వన్మాద్రాశే ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః”* మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో వివరించారు.

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజు నేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక.. తర్వాత దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి , దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ , ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు.

ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు , తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది…. మనం ఉత్తర దిక్కునూ , ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ , హైందవ సంస్కృతి , జ్ఞాన విజ్ఞానం , భాష , నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ , సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ , సమస్త ఋషులకూ , దేవతలకూ , పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ , ముఖ్యం గా ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ , ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావిస్తారు.

సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను , ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని , వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని , ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.

ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా , ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం , ఫలాలు , విసనకర్ర, వస్త్రం , కాయగూరలు , దుంపలు , నువ్వులు , చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం.ఇక చాలామంది ఉత్తరాయణ పుణ్యకాలం లోనే చనిపోవాలని కోరుకుంటారు. తద్వారా ముక్తి లభిస్తుందని నమ్మకం . భీష్ముడు కూడా ఉత్తరాయణం వరకు అంపశయ్యపై వేచి చూసింది అందుకే.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!