AG Datta……………………………………………
ప్రేమంటే ఏకత్వమూ లేదంటే ఏకత్వాన్ని సాధించే ఉద్వేగం! ఈ వాక్యంతో ఇతరులు ఏకీభవించడానికి నేను ఎంత ప్రేమతో కృషి చేయాలి? ప్రయత్నిస్తాను.. చూడండి!ఆకర్షణ, కోరిక, ఇష్టం.. ఈ మూడూ విడిగా ప్రేమ కిందకి రావు. అయితే ప్రేమలో ఈ మూడూ ఉంటాయి.
ఈ మూడింటికీ ప్రేమకు మధ్య సన్నటి పొర ఉంటుంది. ఈ మూడింటిని ప్రేమతో కలగాపులగం చేయడంతోనే ప్రేమంటే ఏంటీ? అనే గందరగోళం సృష్టించడంలో ప్రథమ ముద్దాయి మన మనస్సే!
మనస్సు పాత్రేంటీ?
మానవ మనో ఆవరణను కవులు లేదా సైకాలజిస్టులు అనబడే తొట్టి గ్యాంగ్ మనస్సని నామకరణం చేశారు. వారు ఏ మూహూర్తాన మనస్సు అని నామకరణం చేశారో కానీ, మనం ప్రతి దానిపై మనసు పారేసుకుంటూ.. దాన్నే ప్రేమ అనే భ్రాంతికి లోనవుతున్నాం. అంత వరకు అయితే పర్లేదు.. పిచ్చి పీక్‌కి చేరి మనం దేనిపైన అయితే మనసు పారేసుకుంటామో అది కూడా తిరిగి మనల్ని ప్రేమిస్తుందని అతి భయానకమైన భావనకు లోనవుతాం.
అబ్బా ఆ గుండ్రాయి ఎంత బాగుందని అనుకోవడంతో సరిపెట్టుకోకుండా దాన్ని మనం ప్రేమిస్తున్నట్లుగా భ్రమించి.. తిరిగి ఆ గుండ్రాయి సైతం మనపై మనసు పారేసుకుంటున్నట్లుగా భ్రాంతికి గురవుతాం. ఇది ఎంత తమాషాగా ఉంటుందంటే.. గుండ్రాయి మనకు ఐ లవ్ యూ చెబుతుంది తెలుసా?
ఎందుకిలా?
మనం సృష్టిలో దేన్నైనా ఎలా గుర్తిస్తామో.. సరిగ్గా అలానే మనల్ని మనం కూడా గుర్తించుకుంటాం. ఇది కేవలం ఆలోచనా జీవులమైన మానవులకే సాధ్యమైంది. సో.. చూడండి.. ఇక్కడ మన ఆలోచనను మన ఆలోచనే గుర్తిస్తుంది. ఇదే మిగిలిన అంటే.. ఆలోచన ఏ శరీరంలో అయితే ఉంటుందో.. దాన్నే కాకుండా మిగిలిన బాహ్యా ప్రపంచాన్ని కూడా గుర్తిస్తుంది. దీన్నే ఎరుక లేదా చైతన్యం అని అంటాం.
మనల్ని మనం గుర్తించుకోవడమే ఒక అబ్బుర పడే విషయం. అబ్బురపాటే.. బాహ్య ప్రపంచానికి కూడా వర్తింప చేసి.. దానికదే గుర్తించుకుంటుందని, అట్టి కారణంతో అది మనల్నీ గుర్తిస్తుందని అనుకుంటాయి. this is real mystic nature of consciousness. మానవుడి మనో ఆవరణ సృష్టించే మాయాజాలం ఇదే!
అయితే ఏంటట?
సజాతి జీవజాలంలో వేర్వేరు అనే భావన ఉండదు. ఏలయనగా.. వాటికి నేను అనే భావన ఉండదు. మనిషికి మాత్రమే నేను అన్న భావన ఉంది. ఈ నేను నుంచే యావత్ మానవ ఆవరణ ఏర్పడింది. మానవ ఆవరణకి ఈ నేనుకి మధ్య నిజానికి ఏ తేడా ఉండదు. కానీ తేడా సృష్టించబడింది. ఈ తేడాకి కూడా నేను అనే స్పృహనే కారణం అవుతోంది. నీకు నాకు మధ్య ఉన్న ఈ బేధాన్ని, నీకు మనకు మధ్య ఉన్న ఈ భేదాన్ని తొలగించే ప్రయత్నమే ఏకత్వం!
ఏకత్వానికి నేను మిత్రుడు, శత్రువు!
రెండు ఒకే రకమైన మొక్కల మధ్య ఊహాజనితమైన ఏకత్వం ఉంటుంది. కానీ పక్కపక్కనే ఉండే ఈ ఒకే జాతి మొక్కలు పెరగడానికీ, జీవిక కొనసాగించడానికి జరిపే struggle for existenceలో మనకు కనిపించని వైరుధ్యం ఉంటుంది. నేను అన్న మానవీయ స్పృహ ఉనికి కోసం పోరాటాన్ని సంక్లిష్టంగా మారుస్తుంది. పతాకస్థాయిలో అది యుద్దంగా పరిణమిస్తుంది.
కొరత ఒక సమస్య అయితే.. దాన్ని అధిగమించే క్రమంలో శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి జరిగినప్పటికీ, జరుగుతున్నప్పటికీ ఈ నేను అనే స్పృహ అడ్డుగోడగా నిలుస్తుంది, నిలుస్తోంది. నేనూ అనే స్పృహ లేకపోతే మనమూ అనే స్పృహ కూడా ఉండదు. నేనుగా ఉంటూనే.. మనం వేరు కాదనే చైతన్యపూరితమైన అవగాహన ప్రేమై ఉంటుంది.
ప్రేమే ఎందుకు?
అవును.. ఆకర్షణ ఉంది, కోరిక ఉంది, ఇష్టం ఉంది.. ఈ ప్రేమ ఎందుకు ఇక అనే ప్రశ్నకు సమాధానమే నేను అనేదాన్ని గుర్తించడం. ఈ నేనును సూక్ష్మదర్శిని కింద ఉంచి చూస్తే ఏం గోచరిస్తుంది? ఒక్క నేను అనే స్పృహ మినహాయించి.. ఈ నేనులో నాకు సంబంధించింది దాదాపుగా మృగ్యంగా ఉంటుంది. నేనులో నేను నేనుగా లేను. మనంగానే ఉంటాం. నేనూ మనమూ వేర్వేరు కాదని ఒకటే అని ఎరుక కలిగించి.. ఈ భూమ్మీద మానవ జాతి ఉనికిని రక్షించే ఉద్వేగమే ఈ ప్రేమ!
ఒక ప్రయోగం!
నేను అనబడే నువ్వులో ఏముందో ఒకసారి చూస్తే..? ఇలా చూడడానికి చాలా తేలికైన దారి ఉంది. నీ ఆలోచనల్లో నీ చుట్టు ఉన్న మానవ ఆవరణ, ప్రాకృతిక ఆవరణను మినహాయించి చూడు.. ఏం మిగులుతుంది? అక్కడ నువ్వు కూడా మిగలవు. మిగిలిన మానవ ఆవరణ, ప్రాకృతిక ఆవరణతో కలిపే నీ ఉనికి ఉంటుంది. కావున.. నీ ఉనికికి నువ్వో దారం మాత్రమే.. ఆధారం మిగిలిన మానవ, ప్రాకృతిక ఆవరణే!