ఈ “పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా” కథేమిటి ?

Sharing is Caring...

Fight for the rights of minorities ……………………………………..

రెండు రోజుల క్రితం ఏకకాలంలో 15 రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( PFI ) సంస్థ కార్యాలయాలపై  జాతీయ దర్యాప్తు సంస్థ (NIA ), ఆర్థిక నేరాలపై పనిచేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (E D)  దాడులు నిర్వహించడంతో ఒక్క సారిగా ఆ సంస్థ పై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ఎక్కడిది సంస్థ ? ఏం చేస్తుందని  తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఇంతకూ ఏమిటీ పీఎఫ్ ఐ ?  ఆ సంస్థ  లక్ష్యమేంటి? చరిత్రేంటి?  అన్న వివరాలలో కెళితే ……  

దక్షిణభారతంలోని మూడు ముస్లిం సంస్థలు కలసి 2006లో  PFI  గా  ఆవిర్భవించాలని నిర్ణయించాయి. ఫిబ్రవరి 16, 2007న ఈ సంస్థ ఏర్పాటును ప్రకటించాయి.   ఈ సంస్థ ఏర్పాటుకు ఓ నేపథ్యం ఉంది. వివాదాస్పద స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (SIMI ) సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది.

ఈ క్రమంలో కేరళలోని నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్, కర్ణాటకలోని ఫోరం ఫర్ డిగ్నిటీ, తమిళనాడులోని మనితా నీతి పసరాయ్ సంస్థలు విలీనమై  PFI  ని  స్థాపించాయి.మైనార్టీలు, దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడటమే  తమ లక్ష్యంగా  PFI  ప్రకటించుకుంది.

కానీ… ఇది నిషేధిత సిమికి మారు రూపమే అంటూ 2012లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ‘ PFI  కి రహస్య ఎజెండా ఉంది. మత మార్పిడులు, సమస్యలకు మతం రంగు పులమటం, తమకు మతపరంగా, రాజకీయంగా వ్యతిరేకులైన వారిని అంతమొందించటానికి వీలుగా ముస్లిం యువతను రెచ్చగొట్టడం ..ఉగ్రవాద సంస్థల్లో చేరేలా వారికి శిక్షణ ఇవ్వటం వంటి పనులు  PFI   చేస్తుందని  కేరళ ప్రభుత్వం హైకోర్టుకు తెలియ జేసింది.  కర్ణాటకలో  PFI  పై 300కు పైగా కేసులు నమోదయ్యా యి.

PFI  సంస్థ తమ  సభ్యుల పేర్ల జాబితాను  నిర్వహించదు.  నేరుగా ఎన్నికల్లోనూ పాల్గొనదు.  2009లో తమ సంస్థకు అనుబంధంగా సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా   (SDPI)  పేరిట ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసింది.

తమ లక్ష్యానికి అనుగుణంగా రాజకీయంగా పార్టీ  ముందుంటే… వెనక నుంచి  PFI  పనిచేస్తుంది. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల పై  PFI .. దాని రాజకీయ పార్టీ   (SDPI)   ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో (ఉడుపి తదితర) స్థానిక ఎన్నికలలో   SDPI పోటీ చేసింది. క్రమంగా బలం పెంచుకుంటూ  2013 నుంచి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతోంది.

ముస్లిం ఓట్లను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సంస్థ బ్యాంక్ ఖాతాలను ఈడీ అటాచ్ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.బీజేపీ ఈ సంస్థను నిషేధించాలని డిమాండ్ చేస్తోంది. అయితే తీవ్రవాద కార్యకలాపాలలో తమ ప్రమేయాన్ని  PFI   నిరాకరిస్తూనే ఉంది. ఈ సంస్థ ఉనికి ఎక్కువగా కేరళలో కనబడుతుంది. కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో మెల్లగా బలం పుంజుకుంటోంది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!