బిష్ణోయ్ గ్యాంగ్ కథ ఏమిటి ?

Sharing is Caring...

A new headache………………………………

కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు భారత ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. బిష్ణోయ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి అప్పగించమని భారత్ అడుగుతుంటే కెనడా సరైన రీతిలో స్పందించడం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వంతో విభేదిస్తున్న కెనడియన్ల సమాచారాన్నిభారత దౌత్యవేత్తలు  సేకరిస్తున్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత సర్కార్ తన దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది.

కొన్ని గంటల తర్వాత, కెనడా గడ్డపై తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ప్రభుత్వ “ఏజెంట్” సహకరిస్తున్నారని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఆరోపించింది.ఈమధ్య కాలంలో ‘లారెన్స్‌ బిష్ణోయ్‌’ పేరు ఎక్కువగా వినబడుతోంది. ఎందరో ప్రముఖులు లారెన్స్‌ బిష్ణోయ్‌ టార్గెట్ జాబితాలో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం జైల్లో ఉన్నలారెన్స్ బిష్ణోయ్‌ నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు ? ఎంతమంది ఆయన అనుచరులుగా ఉన్నారు?  వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి  తెలిసిందే. ఈ హత్యకు తాము బాధ్యత వహిస్తున్నట్లు  బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.. ఈ క్రమంలోనే బిష్ణోయ్ పేరు మళ్ళీ చర్చల్లో కొచ్చింది. 

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రకారం బిష్ణోయ్ గ్యాంగ్ లో  షార్ప్ షూటర్లతో సహా 700 మంది సభ్యులు ఉన్నారని సమాచారం. గోల్డీ బ్రార్, సచిన్ థాపన్, అన్మోల్ బిష్ణోయ్, విక్రమ్‌జిత్ సింగ్, కాలా జాతేరి వంటి గ్యాంగ్‌స్టర్ల సహాయంతో ఈ గ్యాంగ్ నడుస్తోంది.

లారెన్స్ బిష్ణోయ్  బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన వాడు.1993 ఫిబ్రవరి 12 తేదీన జన్మించాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ధత్తరన్‌వాలి గ్రామం బిష్ణోయ్ సొంత వూరు. ఆయన తండ్రి హర్యానా పోలీసు శాఖలో కొన్నాళ్ళు కానిస్టేబుల్ గా చేశారు.

లారెన్స్ పుట్టిన నాలుగేళ్ల తర్వాత  తండ్రి ఉద్యోగం వదిలి వ్యవసాయం మొదలుపెట్టాడు. లారెన్స్  బిష్ణోయ్ 12వ తరగతి వరకు పంజాబ్- హర్యానా- రాజస్థాన్ సరిహద్దులోని అబోహర్ అనే ఊర్లోని పాఠశాలలో చదువుకున్నాడు. 2010లో చండీగఢ్‌కు వెళ్లి డీఏవీ కాలేజీలో చేరాడు. అక్కడే అతని నేర సామ్రాజ్యానికి బీజాలు పడ్డాయి.

డీఏవీ కళాశాలలో చేరిన తరువాత బిష్ణోయ్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2011-12 మధ్య పంజాబ్ విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్ అధ్యక్షునిగా పని చేసాడు. ఆ సమయంలోనే లారెన్స్ కి గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో పరిచయమేర్పడింది. అతగాడి సహాయ సహకారాలతో  స్వల్పకాలంలోనే  యూనివర్శిటీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసాడు. ఆ సమయంలోనే అనేక నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి.

మోకా చట్టం కింద అరెస్టైన బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్ లోని సబర్మతి జైల్లో ఉన్నారు.గతఏడాది ఆగస్టులో తిహార్ జైలు నుంచి సబర్మతి జైలుకి తరలించారు. ఖలిస్తాన్ ఉద్యమంతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలను లారెన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తానని బిష్ణోయ్‌ బహిరంగం గానే  ప్రకటించాడు.

కృష్ణ జింకను చంపిన ఆరోపణల నేపథ్యంలో బెదిరింపులకు దిగాడు. దీంతోనే నటుడు సల్మాన్‌ఖాన్ కి  ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది. ఇక లారెన్స్ బిష్ణోయ్ కి  చెందిన క్రిమినల్ సిండికేట్ మే 2022లో పంజాబీ కళాకారుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గోల్డీ బ్రార్ కాల్పులకు బాధ్యత వహించగా, బిష్ణోయ్ ప్రత్యక్ష ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారెన్స్ పై  హత్య,దోపిడీ తో 15 కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి.

బిష్ణోయ్ గ్యాంగ్ చిన్నాచితకా ముఠా కాదు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలలో ఆ ముఠా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. విదేశాలలో కూడా లారెన్స్ గ్రూప్ పనిచేస్తోంది. కెనడా కేంద్రంగా క్రైమ్ సిండికేట్‌ లోని కీలక వ్యక్తి గోల్డీ బ్రార్  కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

ఉత్తర అమెరికాలో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూపులతో కూడా ఈ ముఠాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.లారెన్స్ సోదరుడు అన్మోల్ కూడా ముఠా నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాడని అంటారు. 
లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నప్పటికీ ముఠా కార్యకలాపాలు ఆగలేదు… అవి మరింత జోరుగా సాగుతున్నాయి. 

వివిధ ప్రాంతాల్లో దోపిడీలు, హత్యలు, ఆయుధాల అక్రమ రవాణాలో బిష్ణోయ్ ముఠా ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఒకప్పుడు ముంబాయిని వణికించిన దావూద్ ఇబ్రహీం కి చెందిన డి-కంపెనీ ఎలా  పనిచేసిందో .. అదే రీతిలో  బిష్ణోయ్ గ్యాంగ్ కార్పొరేట్ కంపెనీలా పనిచేస్తుంది. చదువు సంధ్యా అబ్బని యువకులకు ఎరవేసి ఉద్యోగులు గా చేర్చుకుని అసాంఘిక శక్తులుగా వారిని తయారు చేస్తున్నదనే ఆరోపణలు లేకపోలేదు.  

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!