ఆ మిస్టీరియస్ హోల్ కథేమిటో ?

Sharing is Caring...

ఈ ఫొటోలో కనిపించే గొయ్యి ని చూస్తుంటే ఎవరో నీట్ గా తవ్వినట్టు కనబడుతోంది కదా .. కానీ ఎవరూ తవ్వకుండానే అకస్మాత్తుగా రాత్రికి రాత్రే  ఈ గొయ్యి ఏర్పడిందట. ఈ చిత్రమేమిటో అర్ధం కాక
అక్కడి ప్రభుత్వం ఒక కమిటీ ని వేసి కూపీ లాగమని ఆదేశించింది. ఈ చిత్రం ‘చిలీ’ లో జరిగింది.

ప్రకృతి లో అపుడపుడు ఇలాంటి చిత్రాలు జరుగుతుంటాయి. చిలీలో ఏర్పడిన  పెద్ద  గొయ్యికూడా అలాంటిదే. ఇది ఎలా ఏర్పడిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ గొయ్యి వల్ల  సమీపంలోని  మైనింగ్  కంపెనీలకు కూడా ఎటువంటి నష్టం జరగలేదు.

అకస్మాత్తుగా ఏర్పడిన ఈ గొయ్యిని అందరూ వింతగా చూస్తున్నారు. అసలు ఇది ఏర్పడటానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు చిలీ ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు.  చిలీ నేషనల్ జియాలజీ అండ్ మైనింగ్ సర్వీస్ అందించిన  వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితమే ఈ గొయ్యి ఏర్పడింది.

656 అడుగుల లోతు, 82 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గొయ్యి టియెర్రా అమరిల్లా ప్రాంతంలో  ఏర్పడింది. ఈ గొయ్యి మరింత పెద్దదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.  అల్కపెరోసా గని వద్ద ఏర్పడిన ఈ గొయ్యి చుట్టూ సుమారు 100 మీటర్ల పరిధిలో కంచెను ఏర్పాటు చేశారు.

అల్కపెరోసా గనిలో కార్యకలాపాలను కెనడాకు చెందిన లుండిన్ మైనింగ్ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ గొయ్యి ఏర్పడిన కారణంగా  తమకు ఎటువంటి నష్టం జరగలేదని కంపెనీ ప్రకటించింది. సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాలకు ఎటువంటి హాని జరగలేదు. ఈ గొయ్యిని గుర్తించినప్పటి నుంచి ఆ ప్రాంతంలో మార్పులు ఏమీ లేవట. 

ఇక చిలీ  ప్రపంచంలోనే అతి పెద్ద రాగి ఉత్పత్తిదారు. ప్రపంచానికి అవసరమైన రాగిలో దాదాపు 25 శాతం వరకు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఈ  గొయ్యి శాంటియాగో నుంచి సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రాంతంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ మైనింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు.

నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ సమాచారం ప్రకారం ఈ గోతిలో కొంత నీరు ఉంది.  జనసాంద్రత లేని  ప్రాంతం కాబట్టి  ఈ గొయ్యి ఏర్పడినందువల్ల  ప్రమాదాలు ఏమీ జరగలేదు. గనుల తవ్వకం కారణంగా  ఈ గొయ్యి ఏర్పడిందా ? వేరే ఏదైనా కారణం ఉందా? అనే విషయం తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!