మంకీ గాడ్ సిటీ కథేమిటి ?(2)

Sharing is Caring...

Vanished cities …………………

దట్టమైన రైన్ ఫారెస్ట్ ను అన్వేషించడానికి 2012 లో పురావస్తు శాస్త్రవేత్తలు లైట్ డిటెక్షన్, రేంజింగ్ (LIDAR) సర్వేలను చేసినపుడు ఈ సైట్ మొదటిసారిగా కనుగొన్నారు. పరిశోధకుల బృందం ఆ కీకారణ్యంలో ప్రవేశించినపుడు పెద్ద పెద్ద విష సర్పాలు బుసలు కొడుతూ కనిపించాయి. చుట్టూ దట్టమైన పొదలు,చెట్లు ఉండటంతో నగర అవశేషాలను కనుగొనేందుకు కష్టపడ్డారు.

చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనప్పటికి అధిగమిస్తూ ఎట్టకేలకు పరిశోధకులు నగర శిధిలాల వద్దకు చేరుకున్నారు. అక్కడి అవశేషాలను, అప్పటి ప్రజలు వదిలి వెళ్లిన వస్తువులను కనుగొనేందుకు ప్రయత్నించారు.అందులో భాగంగానే సగం మానవుడు, సగం వానరం ఉన్న విగ్రహం కనిపించింది. ఈ విగ్రహం మన పురాణాల్లోని హనుమంతుడి విగ్రహాన్ని పోలి ఉండటం విశేషం.

ఈ మంకీ గాడ్ కి  హనుమంతుడికి ఏదైనా సంబంధం ఉందా ? మధ్య అమెరికాలో కూడా వానర ప్రముఖులు ఉన్నారా ? ఇవన్నీ జవాబుల్లేని ప్రశ్నలు. అందుకే ఈ నగరానికి మంకీ గాడ్ అనే పేరు పెట్టారా ? అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ మంకీ గాడ్ సిటీ లో నివసించిన ప్రజలు ఓల్మేక్ జాతికి చెందినవారని భావిస్తున్నారు.

ఓల్మేక్ నాగరికత  క్రీ శ 1000 –1400 మధ్య కాలం నాటిదని గుర్తించారు. ఇక హనుమంతుడికి వీరికి సంబంధం ఏమిటనేది రహస్యంగానే ఉండిపోయింది.ఇక టీమ్ కనుగొన్న వాటిలో ఆలయాలు , రాతి కళాఖండాలు , చెక్కతో నిర్మించిన  బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ శిధిలావస్థలో ఉన్నాయి. కొన్ని మట్టిలో కూరుకుపోయాయి.

వేల ఏళ్ళ క్రితం నాటి నగరపు తాలూకు అవశేషాలలో కొన్నింటిని పరిశోధన కోసం అమెరికా పట్టుకెళ్లారు. ఇక్కడ తవ్వకాలు జరుగుతున్న క్రమంలోనే టీమ్ సభ్యులకు అనారోగ్య సమస్యలు మొదలైనాయి.దీంతో మంకీ గాడ్ శాపం తమపై పనిచేస్తుందని సభ్యులు భయపడ్డారు. ఆ వెంటనే టీమ్ అక్కడనుంచి వచ్చేసింది.

డగ్లస్ ఆ దట్టమైన అడవిలో తమ అన్వేషణ ఎలాసాగిందో వివరిస్తూ ‘లాస్ట్ సిటీ అఫ్ ది మంకీ గాడ్’ అనే పుస్తకాన్ని రాశారు. కాగా పరిశోధకుడు స్టీవ్  90వ దశకం నుంచే ఈ నగరం గురించి అన్వేషణ మొదలు పెట్టాడు. అయితే సఫలం కాలేదు.

అక్కడ నుంచి తరలివచ్చిన కొన్ని తెగలకు చెందిన ప్రజలతో స్టీవ్  మాట్లాడారట. వాళ్ళే మంకీ గాడ్ శాపం గురించి చెప్పారు. 2015 లో డగ్లస్ అధునాతన పరికరాలతో వెళ్లి వచ్చాకనే అక్కడొక నగరం ఉందని బయట ప్రపంచానికి తెలిసింది.

2018లో కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ చేసిన యాత్రలో కొత్త జాతులు సహా అనేక జీవ సంపదను కనుగొన్నారు. 2025 సర్వేలో మాయమైన నగరం చుట్టూ ఉన్న ప్రాంతంలో 22 కి పైగా కొత్త జాతుల సీతాకోకచిలుకలు, గబ్బిలాలు సరీసృపాలు ఉన్నట్టు గుర్తించారు.

ఈ సర్వేలు మోస్క్విటియా వర్షారణ్యంలో అద్భుతమైన మొక్కలు,వన్యప్రాణుల సేకరణను వెల్లడించాయి. ఈ పరిశోధనలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిన, కానీ రహస్యమైన, మెసోఅమెరికన్ నాగరికత ఉనికిని నిర్ధారిస్తున్నాయి. పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి

 

——–KNM

Pl. Read it Also ………………మంకీ గాడ్ సిటీ కథేమిటి ?(1)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!