Ravi Vanarasi……………
అది 1940వ సంవత్సరం. ఆకాశం అగ్నిని కురిపిస్తోంది. లండన్ నగరంపై జర్మనీ చేసిన వైమానిక దాడులు (Blitz) భూమిని వణికించాయి. చరిత్రపుటల్లో చెరగని భీకర గాయాలను మిగిల్చాయి. నగరమంతా శిథిలాల కుప్పగా మారుతుండగా, లక్షలాది మంది ప్రజలు మరణ భయం, నిస్సహాయత అనే చీకటి గుహల్లోకి నెట్టివేయబడ్డారు.
ఎక్కడ చూసినా హాహాకారాలు, కూలిపోయిన భవనాల దుమ్ము, నిరంతరంగా వినిపించే సైరన్ల భయంకర శబ్దం. ఆ నిశాచర సమయంలో .. ప్రజల ఏకైక ఆశ్రయం – భూగర్భ బంకర్లు. ఆ భూగర్భ ఆశ్రయాలు కేవలం కాంక్రీటుతో కట్టిన నిర్మాణాలు మాత్రమే కావు.. అవి వేలాదిమంది ఆత్మలకు తాత్కాలిక శవపేటికలు, అదే సమయంలో అచంచలమైన మానవ ఆత్మకు నిలయాలు.
బంకర్లలో జన సమూహం ఇరుకైన చోట ఒకరిపై ఒకరు ఒత్తిగిల్లి కూర్చున్నారు. పైనున్న ప్రపంచం పెనుగులాడుతుంటే, క్రిందనున్న వారి హృదయాలు భయంతో బిగుసుకుపోయాయి. పైనుండి పడే ఒక్కొక్క బాంబు శబ్దం వారికి మృత్యుదేవత చేస్తున్న హాహాకారంలా వినిపించేది. ఆబీభత్స వాతావరణంలో విషాదం నెలకొంది.
ఆ నిశ్శబ్దంలో ఎవరికి వారు మౌనంగా ప్రార్ధనలు చేస్తున్నారు. ప్రతి శ్వాస చివరిదైపోతుందేమోనన్న భీతితో బిక్కుమంటున్నారు. అటువంటి భయానక రాత్రిలో, లండన్‌లోని ఒక సాధారణ బంకర్లో, ఒక అసాధారణ దృశ్యం ఆవిష్కృతమైంది. తమ చిన్నపిల్లలను ఒడిలో చేర్చుకున్న ఒక తల్లి, తన చుట్టూ అలుముకున్న దట్టమైన చీకటిని చీల్చుతూ, చిన్న కొవ్వొత్తిని వెలిగించింది.
అది కేవలం ఒక కాంతి వనరు కాదు. ఆమె బిడ్డలపై, భర్తపై, వారి భవిష్యత్తుపై ఉన్న నమ్మకానికి సాదృశ్యం. ఆమె తన పెదవులపై మాటలు బయటకు రాకుండా ప్రార్థనలు చేస్తున్నది. ఆప్రార్థనలు బాంబుల గర్జనలో కలిసిపోలేదు.. అవి ఆ బంకర్ గోడల్లోనే ప్రతిధ్వనించాయి. ఆ కొవ్వొత్తి, ఆమె హృదయంలోని అంతులేని ప్రేమను ప్రతిబింబించే ఒక పవిత్రమైన జ్యోతి.
పక్కనే ఉన్న వారికి, ఆ చిన్న కొవ్వొత్తి వెలుగు ఒక అద్భుతం.బంకర్ నిండా ఉన్న మందపాటి చీకటిపై ఆ మంట చిరునవ్వు చిందించింది. బాంబుల కుదుపులకు అది పదే పదే ఊగిసలాడింది. ఆరి పోతుందేమోనన్న భయాన్ని కలిగించింది. కానీ, ప్రతిసారి అది మరింత శక్తితో నిలబడింది. అది పెళుసుగా, దుర్బలంగా కనిపించినా, అది అఖండమైనది.
చుట్టూ ఉన్న ప్రజల కళ్లలో, ఆ దీపం – కేవలం భౌతికమైన కాంతిని మాత్రమే కాదు – అంతర్గత ధైర్యాన్ని, సజీవంగా ఉండాలన్న పట్టుదలను నింపింది. ఆ చిన్న కొవ్వొత్తి మెరుపు, కేవలం ఒక బంకర్లో నిలిచిపోలేదు. ఆ కొవ్వొత్తి కథ, చూసిన వారి జ్ఞాపకాల్లో, వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. లండన్ Blitz కథలన్నీ చెప్పేటప్పుడు, ఆ దీపం పట్టుదల గురించి, దాన్ని వెలిగించిన తల్లి గుండె ధైర్యం గురించి తరచూ చెప్పుకునేవారు.
ఆ కొవ్వొత్తి – లండన్ నగర ఆత్మకు ప్రతీకగా మారింది.లండన్ ప్రజలు దాడులకు గురైనప్పుడు, తమ ఇళ్లను, తమ ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కూడా, భయానికి తమ జీవితాలను అప్పగించలేదు. దేవుడు కూడా తమను విడిచిపెట్టాడేమోనని అనిపించిన చీకటి క్షణంలో, ఒకరికొకరు తోడుగా నిలబడ్డారు. ఒక తల్లి వెలిగించిన ఆ దీపం, నిరాశకు గురైన వారికి ఒక పాఠం చెప్పింది.
పరిస్థితులు ఎంతటి దుర్భరంగా ఉన్నా, మానవత్వపు ఆశా జ్వాల మాత్రం ఆరిపోదు. చీకటి అనేది కేవలం కాంతి లేకపోవడం కాదు. అది నిరాశ, విషాదం, భయ సంకేతం. బాంబులు పడేటప్పుడు ఏర్పడే చీకటి, మనస్సులోని అంధకారాన్ని మరింత పెంచుతుంది. లండన్ ప్రజలు ఆ రెండు రకాల చీకటినీ ఎదుర్కొన్నారు.
ఆ చిన్నదీపం, వారికి భయం అనేది ఒక తాత్కాలిక భావన మాత్రమే అని గుర్తుచేసింది. “కార్పెర్ డీమ్” ( ఈ క్షణాన్ని ఆస్వాదించు) అన్నట్లుగా, ఆ దీపం వారికి ప్రతి క్షణాన్ని ధైర్యంగా జీవించాలని, పోరాడాలని, రేపటి ఉదయం కోసం ఎదురుచూడాలని ప్రోత్సహించింది. ఆ దీపం వెలుగు, పక్కనున్న వారి ముఖాలపై పడి, వారి కళ్లలో ఉన్న కష్టాన్ని, అదే సమయంలో వారి అంతర్గత బలాన్ని స్పష్టంగా చూపించింది.
అది సాధారణ కొవ్వొత్తి కాదు.* అది ప్రతిఘటన (Resistance) జ్వాల. అది నిరాశ మధ్య మరో జీవితం ఉందన్న నమ్మక శిఖరం.ఆ బంకర్లో, లండన్ చరిత్ర పునర్నిర్మించబడింది. కాంక్రీటు, ఉక్కు, దుమ్ము, భయం మధ్య, మానవ హృదయం పవిత్రత, దాని బలం అనే బలమైన మూలాలు నాటబడ్డాయి.
ఆ తల్లి నిశ్శబ్ద ప్రార్థనలు, ఆమె చేతిలోని ఆ మంట – లండన్ Blitz యొక్క భీభత్సంలో, తరతరాలకు ఆశ తాలూకు గొప్ప సందేశాన్ని మిగిల్చిపోయాయి.(చరిత్ర ఎప్పుడూ యుద్ధాల గురించి, విజేతల గురించి మాత్రమే కాదు. చీకటిని ఓడించిన ఒక చిన్న కొవ్వొత్తి గురించి, దాన్ని వెలిగించిన ధైర్యవంతులైన సాధారణ ప్రజల గురించి కూడా.)