పై ఫొటోలో కనిపించే వ్యక్తులు ప్రముఖ దర్శకుడు బాపు .. ఆయన చెప్పేది వింటున్నవ్యక్తి ప్రముఖ హీరో అనిల్ కపూర్. 42 ఏళ్ళ కిందట తీసిన ఛాయా చిత్రం ఇది. అనిల్ కపూర్ తొలిసారి నటించింది తెలుగు సినిమానే. ఆ సినిమా పేరు “వంశ వృక్షం.”
ప్రఖ్యాత రచయిత ఎస్ ఎల్ భైరప్ప నవల ‘వంశవృక్ష’ ఆధారంగా ఈ సినిమా తీశారు.1972 లోనే కన్నడం లో కూడా తీశారు. బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్ దర్శకత్వం వహించారు. కన్నడ సినిమాకు చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఆ సినిమా ఆధారంగా తెలుగులో వంశ వృక్షం రూపొందింది.
1980లో విడుదలై పెద్ద హిట్ మూవీ గా పేరు తెచ్చుకున్న శంకరాభరణం లో కీలక పాత్రధారి జె.వి. సోమయాజులే ‘వంశవృక్షం’లో ప్రధాన పాత్ర పోషించారు. సోమయాజులు నటించడం వల్ల ‘వంశవృక్షం సినిమాకు కు కొంత క్రేజ్ వచ్చిన మాట కూడా నిజమే. ఈ క్లాసిక్ సినిమా అందరికి నచ్చేది కాదు. మాస్ మసాలా సినిమా చూసే వాళ్లకు అసలు నచ్చదు.
1980 నవంబర్ లో విడుదలైన ఈ సినిమా పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. చాలామంది కే. విశ్వనాథే వంశ వృక్షం డైరెక్ట్ చేసాడని అనుకుంటారు. సినిమా పోకడ కూడా అదే విధంగా ఉంటుంది. కానీ సినిమా బాగుంటుంది. ఛాందస భావాలపై ‘వంశవృక్షం’ తిరుగుబాటు అస్త్రమిది. ఏది వంశం? ఏది గోత్రం? ఏది పరమార్ధం? ఏది బీజం? ఏది క్షేత్రం? ఏది పురుషార్థం? ఏది పాపం? ఏది పుణ్యం? ఏది గీతార్థం? అన్న అంశాల ఆధారంగా భైరప్పకథ రాసుకున్నారు.
ఈ కథాంశం అప్పట్లో ఎందరినో ఆలోచింప చేసింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక అనిల్ కపూర్ పాత్ర చిన్నదే అయినా కీలక పాత్ర. విధవా వివాహం చేసుకున్న హీరో పాత్రలో నటించారు. బాలసుబ్రహ్మణ్యం అనిల్ కపూర్ కి డబ్బింగ్ చెప్పారు. కధానాయిక సరస్వతి పాత్రలో జ్యోతి బాగా నటించింది.
పిల్లవాడిని జ్యోతి తాత గారి ఇంట్లోనే వదిలే వెళ్లే సన్నివేశాలు బాగా పండాయి. వంశ గౌరవం, ధర్మం, క్షేత్రం , బీజ ప్రాధాన్యం అంటూ పాకులాడే పాత్రలో సోమయాజులు జీవించారు. తాను తండ్రి అని భావించే వ్యక్తికీ గాక మరొకరికి పుట్టానని తెలుసుకున్న సన్నివేశం లో సోమయాజులు అద్భుతంగా నటించారు. ఇంకా ముక్కామల, కాంతారావు, కల్పన, డబ్బింగ్ జానకి తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.
ముళ్లపూడి వెంకట రమణ పదునైన సంభాషణలు ఆకట్టుకుంటాయి. సినారె పాటలు,మహదేవన్ సంగీతం,బాబా అజ్మీ కెమెరా పనితనం ఈ చిత్రానికి ఎస్సెట్. సినిమాను ట్రాజెడీ చేయకుండా సుఖాంతం కూడా చేయవచ్చు.కానీ ముగింపు విషాదం గానే తీశారు.
వంశవృక్షం ప్రివ్యూ చూసి బయటకు వస్తుండగా ‘‘బాపూగారూ మీరెప్పుడూ ట్రాజెడీలు తీసినట్టు లేదు’’ అన్నాడట చిత్ర నిర్మాత మాట వరుసగా. ‘‘తీశాక కొన్ని ట్రాజెడీలే అయినాయ్ లెండి’’ అని బాపు జవాబు ఇచ్చాడట. శ్రీరమణ గారు ఈ మాట ఎక్కడో రాసారు. సినిమా విడుదలయ్యాక నిర్మాత కు బాపు మాటలోని శ్లేష అర్థమయ్యే ఉంటుంది.
——–KNM
PHOTO COURTESY.. BNIM