Bharadwaja Rangavajhala……………………………………………..
తెలుగులో మొదటి డబుల్ ఫొటో సినిమా ఆయనే తీశారు. ఆయన్ను డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పెట్టుకుంటే చాలు. డిస్ట్రిబ్యూటర్లు మారు మాట్లాడకుండా అడ్వాన్స్ లు ఇచ్చేవారు.అంతటి ముద్ర వేసిన ఆ కెమేరా దర్శకుడు ఇంకెవరు…పి.ఎన్.సెల్వరాజ్. ముళ్లపూడి వెంకటరమణ విజయవాడ నవయుగ ఆఫీసులో కూర్చున్నారు.ఎదురు గా నవయుగాధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు.సరే మీ సినిమా టీమ్ ఎవరో చెప్పండి.. షార్ట్ గా అడిగారు వాసుగారు.బాపు డైరక్షన్ చేస్తాడండీ నేను రైటర్ నండి అన్నారు ముళ్లపూడి సాక్షి మూవీ గురించి. సరే…కెమేరానైనా సీనియర్ ని పెట్టుకోండని వాసుగారి సలహా.
ఎవరైతే బాగుంటుందండీ … ముళ్లపూడి అమాయకం… మన అన్నపూర్ణా సినిమాలకు పనిచేస్తారు.కదా…సెల్వరాజు… ఆయన్నే పెట్టేసుకోండని వాసుగారి సలహా. ఇంతకీ ఎవరా సెల్వరాజ్. ఏమిటాయన గొప్పనేగా మీ అనుమానం. సెల్వరాజ్ మోస్ట్ సీనియర్ కెమేరా డైరక్టర్.అప్పట్లో తెలుగు సినిమా రంగంలో బెంగాలీ నుంచి వచ్చిన కమల్ ఘోష్ లాంటి వాల్ల రాజ్యం నడుస్తోంది. సెల్వరాజ్, విన్సెంట్ ఇద్దరూ ఓకే టైమ్ లో వచ్చారు. అలాంటి టైమ్ లో సెల్వరాజ్ దగ్గరకు ఓ సూపర్ ఛాన్స్ వచ్చింది.
తెలుగు తమిళ హిందీ భాషల్లో రూపొందే సినిమా. పేరు చండీరాణి.ట్రైలింగ్వలే కాదు…డబుల్ యాక్షన్ మూవీ కూడా. భానుమతి డైరక్షను.తను కెమేరా డైరక్షను. డబుల్ ఫొటో సినిమా. అంటే డబుల్ యాక్షన్ మూవీ అన్నమాట. అలా తెలుగు తెర మీద దాదాపు తొలి డబుల్ యాక్షన్ మూవీ సెల్వరాజ్ చేతుల్లోనే పురుడుపోసుకుంది.
ఆ తర్వాత అక్కినేని నటించిన తొలి డబుల్ యాక్షన్ మూవీకి కూడా సెల్వరాజే కెమేరా నిర్వహణ చూశారు. అన్నపూర్ణ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఇద్దరు మిత్రులు అన్నపూర్ణ చరిత్రలోనే కాదు…అక్కినేని నట జీవితంలోనే సెన్సేషనల్ హిట్ మూవీ. ఇద్దరు మిత్రులు శతదినోత్సవ వేదిక మీద అన్నపూర్ణ సంస్ధ వారు సెల్వరాజ్ కు వజ్రాల ఉంగరం ప్రజంట్ చేసి పట్టాభిషేకం చేశారు.
ఆ సినిమాలో అనేక షాట్లు ఎలా తీశారో ఇవ్వాళ్టికీ కన్పూజనే.ముఖ్యంగా ఇద్దరు నాగేశ్వర్రావులూ షేక్ హ్యాండివ్వడం అలాగే…ఒక నాగేశ్వర్రావు వెనక నుంచి మరో నాగేశ్వర్రావు తిరిగి రావడం…లాంటివి అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అన్నపూర్ణ వారు నిర్మించిన దాదాపు అన్ని చిత్రాలకూ సెల్వరాజే కెమేరా. నిజానికి సెల్వరాజ్ మాత్రమే అక్కినేనిని అందంగా చూపించగలడనే అభిప్రాయం ఫాన్స్ లో చాలా బలంగా ఉండేది.
సెల్వరాజ్ ఓ టైమ్ లో కేవలం అక్కినేని చిత్రాలకే పరిమితం అయిపోయారు.క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గని సెల్వరాజ్ తో పనిచేయడానికే డైరక్టర్ ఆదుర్తి కూడా కంఫర్ట్ గా ఫీలయ్యేవారు.బాపు, విశ్వనాథుల తొలి చిత్రాలకు ఆయనే కెమేరా దర్శకుడు.
సినిమా కెమేరా డిపార్ట్ మెంట్ కు సంబంధించినంత వరకు ఆయన పెదకాపే.సాక్షిలో అత్యధిక రెమ్యూసనరేషను సెల్వరాజ్ కే చెల్లించానంటారు ముళ్లపూడి.ఎన్టీఆర్ చిత్రాలకు పర్టిక్యులర్ గా ఫలానా కెమేరామెన్నే ఉండాలనే నియమం ఏదీ లేదు. కానీ…అక్కినేని సినిమాలకు అలా కాదు…ఆయన పని చేసిన ప్రతి సినిమాకూ అనివార్యంగా సెల్వరాజ్ కెమేరా బాధ్యతలు నిర్వహించారు.
ఈ అనుబంధం యాబై దశకం మధ్యలో ప్రారంభమై…మేఘసందేశం వరకు కొనసాగింది. తనను మూడ్ లోకి తీసుకువచ్చే కథ దొరికితే…సెల్వరాజ్ చెలరేగిపోతాడనడానికి మేఘ సందేశం కన్నా గొప్ప సినిమా ఏముంటుంది. అక్కినేని నటించిన చివరి సూపర్ డూపర్ హిట్ చిత్రం ప్రేమాభిషేకం కూడా సెల్వరాజే కెమేరా బాధ్యతలు మోసారు. ఆ సినిమా మూడ్ కు తగ్గ ఫొటోగ్రఫీ అందించడంలో సెల్వరాజ్ సినిమా సక్సస్ కు తన వంతు కృషి చేశారు. ముఖ్యంగా వందనం పాటలో ఆయన వాడిన లైటింగ్ ఎఫెక్ట్స్ అద్భుతం.
బాపు రమణలు తీసిన చిత్రం సాక్షిలో సెల్వరాజ్ కెమేరా పనితనం చిత్రానికి గొప్ప లుక్ ఇస్తుంది. ముఖ్యంగా… అటు ఎన్నెలా…ఇటు ఎన్నెలా పాటలో నీళ్ల మీద చంద్రకిరణాలు కదలాడే సీనులు చూస్తుంటే… విజయా వారి చందమామ గుర్తు రాకమానదు.బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే కాదు… ఆ తర్వాతా సెల్వరాజ్ హవా కొనసాగింది. నిజానికి తెలుగులో మెదటిసారి రంగుల్లో తీసిన సాంఘిక చిత్రం తేనె మనసులు కూ సెల్వరాజే కెమేరా.
అది సూపర్ స్టార్ కృష్ణ నటించిన తొలి చిత్రం కావడం విశేషం.తెలుగు సినిమా కు మాత్రమే కాదు…హిందీ, తమిళ, మళయాళ చిత్రాలకూ పనిచేశారు సెల్వరాజ్. జీవించినంత కాలం విలువలకు కట్టుబడి పనిచేశారు. టాలీవుడ్ చరిత్రలో సెల్వరాజ్ ది ఓ స్పెషల్ పేజ్. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే ఆయనా 1989 సెప్టెంబర్ నెల్లోనే కన్నుమూశారు కనుక.