రామసేతు నిర్మాణ రహస్యం ఏమిటో ?

Sharing is Caring...

శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించి  లంకపై దండెత్తి రావణుడిని సంహరించాడు. ఆనాడు రాముడు నిర్మించిన వారధినే రామసేతువు అంటారు. ఈ వారధి గురించి వాల్మీకి రామాయణంలో, రామ చరిత మానస్‌లోనూ స్పష్టంగా వివరించారు. 

యుద్ధకాండ రామసేతు నిర్మాణ దశలను స్పష్టంగా వివరించింది. మెుదటిరోజు 14, రెండవరోజు 20, మూడవరోజు21, నాల్గవరోజు 22, ఐదవరోజు 23 యోజనాల పొడవున రామసేతు వారధిని నిర్మించారట.

రామాయణ కాలం దాటి  శతాబ్దాలు గడిచినా రామసేతు నిర్మాణం ఇప్పటికి కనిపిస్తూనే ఉంది.  రామేశ్వరం దగ్గరున్న ధనుష్కోడి నుంచి శ్రీలంక దగ్గర ఉన్న మన్నార్ తీరం వరకు  రామసేతు ను నిర్మించారు.  

అందుకే చరిత్రలో రామేశ్వరాన్ని ‘సేతుబంధ రామేశ్వరం’ అని కూడా పిలుస్తారు.10 వ శతాబ్దంలో అరబ్ యాత్రికులు ఇక్కడ వంతెన ఉన్నట్లు స్పష్టంగా వారి చారిత్రిక గ్రంధాల్లో రాసారని కూడా చెబుతారు. 1480లో వచ్చిన పెను తుఫాన్ కారణంగా వంతెనలో చాలా భాగం కనుమరుగైంది. అయినప్పటికీ  ఈ సేతువు ఆధారాలు చెక్కు చెదరలేదు.

వానరసేనతో కలిసి శ్రీరాముడు నిర్మించినట్లు పురాణ ఆధారాలు ఉన్న రామసేతు మానవ నిర్మితమని సైన్స్ ఛానల్ పరిశోధనలు స్పష్టం చేశాయి. ఇక్కడి ఇసుక  4 వేల సంవత్సరాల క్రితం నాటిదని  ఏడు వేల ఏళ్ళక్రితం ఏర్పడిన రాళ్ళను ఇక్కడకు తీసుకువచ్చారని పాశ్చాత్య పరిశోధనల నివేదికలు చెబుతున్నాయి. 

డిస్కవరీ కమ్యూనికేషన్స్ కి  చెందిన సైన్స్ ఛానల్ ఈ నిర్మాణంపై కొన్ని విషయాలను  బయటపెట్టింది. రామాయణం నిజంగానే జరిగిందని – రామసేతు మానవ నిర్మిత కట్టడమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన సవివర కథనాన్నికూడా  ప్రసారం చేసింది. పూర్తిగా సున్నపురాయి తో  నిర్మించిన ఈ వారధిలో ఉపయోగించిన రాళ్లు.. నీటి మీద తేలుతూ.. ఇసుక శక్తితో ధృఢంగా నిలిచాయని వెల్లడించింది. 

తమిళనాడులోని ఆగ్నేయ ప్రాంతంలోని  రామేశ్వరం నుంచి… శ్రీలంకలోని వాయువ్య ప్రాంతంలో మన్నార్ ప్రాంతం వరకూ నిర్మించిన ఈ వారధిని ఆడమ్ బ్రిడ్జిగా ఆంగ్లేయులు పిలిచేవారు.. 2002 లో నాసా అంతరిక్షం నుంచి తీసిన ఒక చిత్రంలో రామసేతు స్పష్టంగా కనిపించడంతో ఈ వారధి  గురించి  అధ్యయనం ప్రారంభమైంది. రామసేతు దగ్గరి రాళ్ళపై పరిశోధనలు జరిగాయి.

భారత్-శ్రీలంక మధ్యనున్న అంతర్జాతీయ జలాల్లో ఈ రామసేతువు ఉంది. వారధి విషయంలో వాస్తవాలు వెలికి తీసేందుకు దాదాపు 30 మైళ్ల దూరం వరకు సైంటిస్టులు పరిశోధనలు చేశారు.  
ఈ రాళ్ళు లావాతో ఏర్పడే ప్యూమిస్ రాళ్ళు కాబట్టి  నీటిలో తేలియాడుతున్నాయని ఒక వాదన.  కాగా  ప్యూమిస్ రాళ్ళు కొద్దిసేపు మాత్రమే నీళ్ళపై తేలియాడుతాయనేది ఇంకో వాదన.  రాముని మహిమతోనే వేలాది సంవత్సరాలుగా ఈ రాళ్ళు నీటిమీద తేలియాడుతున్నాయనే నమ్మకానికి కార్బన్ డేటింగ్ బలం చేకూర్చింది.

కొన్నేళ్లక్రితం ఈ వారధిని తవ్వి శ్రీలంకకు దారి వేయాలని  తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నించడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం రామసేతువు మానవ నిర్మితం కాదని, దానికి ఎలాంటి చారిత్రక ప్రాధాన్యతా లేదని సుప్రీంకోర్టుకు  వివరించింది. 

ఆ రాళ్ళగుట్టను తొలగించడానికి  అభ్యంతరాలులేవని క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో ఆందోళన చెలరేగింది. చాలాకాలం కోర్టు జోక్యంతో సేతువు కూల్చివేత పనులు ఆగిపోయాయి.ఆ తర్వాత అధికారంలో కొచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం రామసేతు నిర్మాణాన్ని కూల్చబోమని, ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తామని స్పష్టమైన ప్రకటన చేసింది.   

శ్రీరామచంద్రుడు వానరసేనతో నిర్మించిన రామసేతు తాత్విక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్న నిర్మాణం. అలాగే పరిశోధనలకు ప్రేరణగా నిలుస్తున్న ఈ సేతువు పదికాలాలు నిలిస్తే మరిన్నిరహస్యాలు  వెలుగులోకి వస్తాయి. 

ఇక రామాయణం ప్రకారం … శ్రీరాముడు సీత ను అపహరించుకు వెళ్లిన రావణునిపై దండెత్తడానికి లంకాపురి చేరేందుకు  రామేశ్వర ద్వీపం చేరుకున్నాడు. ఈ ద్వీపం చేరుకోగానే మొదట శ్రీ రాముడు కొద్దికరై అనే చోట సముద్రం మీద వారధి కట్టడానికి ఆ ప్రదేశం అనువైనది కాదని భావించాడు. తర్వాత సైన్యంతో రామేశ్వరం చేరుకున్నాడు.

అక్కడి ధనుష్కోడి సరైన స్థలం అని భావించాడు.  వారధి నిర్మాణానికి అనుభవజ్ఞుడైన శిల్పిని తీసుకు రమ్మని సుగ్రీవుణ్ణి కోరేడు. ఇందుకు సమర్థుడైన వాడు విశ్వకర్మ అంతటి అనుభవజ్ఞుడైన నలుడే అని సుగ్రీవుడు భావించి అతన్ని పిలిపించాడు.నలుడి పర్యవేక్షణ లో  రామసేతు నిర్మాణం 5 రోజులలో పూర్తయ్యిందని వాల్మీకి రామాయణంలో రాశాడు.

నూరు యోజనాల పొడవున్న ఈ సేతువు వెడల్పు పది యోజనాలట. ఇక్కడే వారధి నిర్మాణంపై కొన్ని సందేహాలు వ్యక్తమైనాయి. లంకకీ రామేశ్వరం దీవికీ మధ్యన సేతువున్న చోటుకి  దూరం 30 కి.మీ. మానవ మాత్రులెవరికైనా ఎంతమంది సైన్యం సహకరించినా సముద్రంలో వారధి ని  5 రోజుల్లో కట్టడం అనేది అసాధ్యం.

ప్రస్తుతం సముద్రంలో మునిగి పోయి ఉన్న రామసేతువనేది ఇప్పటికీ ఉంది. ఇంత కాలం అంటే కనీసం 7 వేల సంవత్సరాలు సముద్రపు తాకిడిని తట్టుకుంటూ నిలిచి ఉన్ననిర్మాణం ఏదయినా ఏ కాలంలో నైనా మానవులకు అసాధ్యమే అనే సందేహం లేకపోలేదు. 

శ్రీ రాముడు మానవుడు కాడు భగవత్స్వరూపుడు కాబట్టి సాధ్యమయిందా ? అలా అనుకుందామంటే శ్రీ రామావతారంలో అటువంటి మానవాతీత శక్తుల ప్రదర్శన ఏదీ జరుగలేదు.ఈ అవతారంలో  రాముడు మానవుని లాగే జీవించాడు. మన అందరి లాగే కష్టసుఖాలను అనుభవించాడు.ఎటువంటి అద్భుతాలనూ చూపలేదు. అయితే మరి రామసేతు నిర్మాణ రహస్యం ఏమిటి?

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!