నిధివన్ ఆలయ రహస్యం ఏమిటి ?

Sharing is Caring...

The deepest mystery……. 

దేశంలోని కొన్ని పురాతన ఆలయాలు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సైతం అంతుచిక్కని అద్భుతాలకు వేదికలుగా ఉన్నాయి.. వాటిలో నిధివన్ ఆలయం ఒకటి. ప్రతిరోజూ రాత్రి వేళ శ్రీకృష్ణుడు రాధాదేవి, గోపికలతో కలిసి ఆ వనంలో రాసలీలలు ఆడతాడని భక్తులు నమ్ముతారు.

వనంలో వేల సంఖ్యలో తులసి చెట్లు ఉంటాయి.ఈ చెట్లు సాధారణ చెట్లలా పైకి పెరగవు. ఇవన్నీ కిందికి వంగి, ఒకదానితో ఒకటి అల్లుకుని ఉంటాయి. దీన్ని తులసి వనం అని కూడా అంటారు.రాత్రి వేళ ఈ చెట్లే  గోపికలుగా మారి కృష్ణుడితో నృత్యం చేస్తాయని, సూర్యోదయం కాగానే మళ్ళీ చెట్లుగా మారిపోతాయని స్థానికులు చెబుతారు. ఇంతకూ ఆ వనం ఎక్కడ ఉందంటే ‘బృందావనం’ లో ఉన్నది.

ఆ వనం మధ్యలో రాధాకృష్ణుల కోసం ఒక చిన్న ఆలయం ఉంది. దీన్నే ‘నిధివన్’ ఆలయం అంటారు. అందులోని రంగమహల్ లో రాధకృష్ణులు రాత్రివేళ విశ్రమిస్తారని అంటారు.  ప్రతిరోజూ రాత్రి అక్కడ చందనపు మంచం, నీళ్ల చెంబు, పండ్లు, తాంబూలం, పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలు ఉంచుతారు.

ఉదయం తలుపులు తీసి చూస్తే మంచంపై ఎవరో పడుకున్నట్లుగా ముడతలు పడి ఉండటం, నీళ్లు తాగినట్లుగా, తాంబూలం తిన్నట్లుగా ఆధారాలు కనిపిస్తాయని పూజారులు చెబుతారు.

సాయంత్రం హారతి కార్యక్రమం కాగానే ప్రధాన ఆలయం ద్వారాలకు తాళాలు వేస్తారు. రాత్రి వేళ పక్షులు, కోతులు కూడా ఈ వనాన్ని వదిలి వెళ్ళిపోతాయి. రాత్రి 7 గంటల తర్వాత మనుషులెవరినీ వనంలోకి అనుమతించరు.

ఒకవేళ ఎవరైనా కుతూహలంతో రాత్రి వేళ పొదల్లో దాక్కుని చూడాలని ప్రయత్నిస్తే.. వారు చూపు కోల్పోవడం, మాట పడిపోవడం లేదా మరణించడం జరుగుతుందని చెబుతారు. ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయని స్థానికులు ఇప్పటికీ చెబుతుంటారు.

నిధివన్ చుట్టూ ఉన్న ఇళ్లకు ఈ వనం వైపు కిటికీలు ఉండవు. ఉన్నా సరే, రాత్రి వేళ వాటిని మూసివేస్తారు. భగవంతుని లీలలను చూడటం ప్రాణాపాయమని వారు నమ్ముతారు.ఆలయం చుట్టూ నివసించే కొందరు స్థానికులు రాత్రి వేళల్లో అప్పుడప్పుడు వనం నుండి గజ్జెల శబ్దం,మధురమైన వేణుగానం విన్నట్లు చెబుతుంటారు.

శాస్త్రీయంగా వీటికి బలమైన ఆధారాలు లేకపోయినా, తరతరాలుగా వస్తున్న ఈ కథలు, భక్తుల అనుభవాలు ‘నిధివన్‌’ను ఒక అంతుచిక్కని రహస్యంగా ఉంచుతున్నాయి.

బృందావనం (వృందావన్) భౌగోళికంగా చిన్న పట్టణమే అయినప్పటికీ, ఇది ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ యాత్రికుల కోసం అన్ని రకాల వసతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

బృందావనం లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ ఎక్కువ రైళ్లు ఆగవు. 13 కి.మీ దూరంలో ఉన్న మధుర జంక్షన్ లో అన్ని రైళ్లు ఆగుతాయి. బాంకే బిహారీ, ప్రేమ్ మందిర్, ఇస్కాన్ఆలయాలు  సుమారు 2 కి.మీ పరిధిలోనే ఉంటాయి. బృందావనం సందర్శించడానికి అక్టోబర్ నుండి మార్చి వరకు ఉండే శీతాకాలం అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి, ఆలయ దర్శనాలకు, స్థానిక ప్రదేశాలను చూసి రావడానికి వీలుగా ఉంటుంది.

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!