మన దేశంలోని కొన్ని ఆలయాల్లో చిత్రాలు జరుగుతుంటాయి.అవి ప్రకృతి రీత్యా జరుగుతాయా ? మరేదైనా కారణమో ఎవరికి తెలీదు. వాటిని కనుగొనేందుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు.రాజస్థాన్ లోని ఇడానా మాతాఆలయం కూడా అలాంటిదే.ఇక్కడ అమ్మవారు అగ్నిస్నానమాచరిస్తారు. అగ్నిని నీటిగా స్వీకరిస్తారు. మంటలు అవే అంటుకుంటాయి. మరల అవే ఆరిపోతాయి.
ఆరావళి పర్వతాల్లో ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని ఉదయపూర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన ఎలాంటి కప్పు లేకుండా నిర్మితమైన ఈ ఆలయం చతురస్రాకారంలో ఉంటుంది.ఇడాన ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది.
పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. నెలకు రెండు మూడు సార్లు ఇడాన మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది.ఆ సమయంలో దేవాలయంలోని అమ్మవారి విగ్రహం మినహా అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతాయి.మంటలు 10 నుంచి 20 అడుగుల వరకు ఎగిసి బడతాయి.
ఈ దృశ్యాన్నిచూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. ఈ మంటలు ఎలా ? ఎందుకు మండుతున్నాయో ?కనుగొనేందుకు చాలా ప్రయత్నాలు జరిగేయి. కానీ కారణం ఇతమిద్దంగా ఎవరూ చెప్పలేకపోయారు. దీంతో ఇప్పటికి ఈ మిస్టరీ అలాగే ఉండిపోయింది.
ఆలయంలో మంటలు ఎగిసినపుడు వచ్చే జ్వాలలకు అమ్మవారి అలంకరణ కూడా స్వాహా అయిపోతుంది కానీ విగ్రహానికి ఏమికాదని స్థానికులు చెబుతుంటారు.భక్తులు ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్నానం ఆచరిస్తుందని నమ్ముతారు. తరచుగా ఈ మంటలు వస్తున్నందున ఆలయ విస్తరణ జరగలేదు.
ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు కారణంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళనకు గురైన రోగులు ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందుతారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహిస్తుందని చెబుతుంటారు.
ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా.. అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారిని మొక్కితే కోరుకున్న కోరికల వేరవేరతాయని భక్తుల నమ్మకం.