భక్తి కి విప్లవానికి లింకేమిటి స్వామి ?

Sharing is Caring...

Devotion vs Revolution ………………………………………..

భక్తి అన్నది మూర్కత్వమూ కాదు,విప్లవం అన్నది శాశ్వతమూ కాదు. “ఎంత భౌతిక విప్లవం వచ్చినా కూడా సాంస్కృతిక విప్లవం రావాల్సిందే” అన్నారు కొందరు కమ్యూనిస్ట్ సిద్ధాంత కర్తలు. అలాగే మతం అన్నది తప్పక అవసరం, కాకపోతే ఆ మతం కాలానికి అనుగుణంగా వచ్చే మంచి మార్పులను ఆహ్వానించగలిగే తెల్లని కాగితం లాగా ఉండాలి అంటారు అంబేద్కర్.

ఇక విషయంలోకి వెళ్ళితే ప్రముఖ తెలంగాణా సాహితీ వేత్త  నందిని సిద్ధారెడ్డి  చేతుల మీదుగా ఈ మద్యే యూట్యూబ్ లో విడుదల అయిన కొండపాక టీమ్ .. BPS audio & వీడియో వారి శ్రీ వెంకటేశ్వరా భక్తి విప్లవ గీతం “తిరువెంకటా చలాధీశా” గురించి మాట్లాడుకుందాం.

ఈ శీర్షిక చూడగానే  అసలు భక్తికి,విప్లవానికి పొత్తు ఎక్కడ కుదురుతుంది, అని ఆలోచన చేస్తారు చాలా మంది. మన దేశం లో 11వ శతాబ్దం లోనే రామానుజాచార్యుల వారి ఆధ్వర్యంలో భక్తి ఉద్యమం వచ్చింది, ఆ తర్వాత శంకరాచార్యులు, రామనందులు,మధ్వాచార్యులు,నింబార్కులు,ఇలా చాలా మంది భక్తి ఉద్యమకారులు వచ్చారు.

కేవలం హిందూ మతమనే కాకుండా ఇస్లాంలో కూడా సూఫీ గురువులు భక్త కబీర్ లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. అసలు ఇస్లాం మతం జనాల్లో వ్యాప్తి చెందడానికి సూఫిలు చేసిన బోధనలే చాలా వరకు కారణం కూడా . వీరిలో చాలా మంది బోధించింది ఒకే విషయం . మనుషులంతా ఒక్కటేనని, కుల మత బేధాలు వదులుకోవాలని. అసలు “మానవ సేవే మాధవ సేవా” అన్న చిన్న పదాన్ని మించి మార్క్స్ కమ్యూనిజం సిద్ధాంతాలు, అంబేద్కర్ ఆశయాలు ఏముంటాయి చెప్పండి.

ఇక ఇంకోవైపు చూస్తే నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్ర అదియు ఒకటే అని చెప్పాల్సిన అవసరం అన్నమయ్య గారికి ఎందుకు? తీరికగా ఏదో వర్ణన చేసుకోవచ్చు కదా. అలాగే అన్నమయములైన వన్ని జీవమ్ములు కూడు లేక జీవ కోటి లేదు కూడు తినెడి కాడ కుల బేధమేలకో అని కాళికాంబా శతకంలో రాసుకోవాల్సిన అవసరం వీరబ్రహ్మం గారికి ఏముంది.

ఇలా చాలా మంది కవులు భక్తిని విప్లవానికి ఒక మార్గంగా ఎన్నుకొని ఈ దేశం లోని చాలా మూఢ ఆచారాలను నిర్ములన చేసే విషయంలో విజయం సాధించారు.అలాంటి ఒక చక్కటి ప్రయత్నాన్నే కొండపాక టీం …. BPS ఆడియో &వీడియో వారి ఆధ్వర్యంలో రూపొందిన శ్రీ వెంకటేశ్వర భక్తి విప్లవ గీతం కూడా చేసింది.

తిరుమల స్థల పురాణం ప్రకారం శ్రీ మహా విష్ణువే భక్తుల దర్శన,ప్రార్థన,అర్చనలతో ప్రీతి చెంది వరాలను ప్రసాదిస్తూ కరుణించే వెం=పాపాలను,కట =తొలగించే,ఈశా=ఈశుడిగా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా తిరుమల తిరుపతిలో వెలిసాడు.

అలా భక్తులు కోరికలు తీర్చే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి షోడశ ఉపచారాలతో అర్చన చేస్తూనే, ఒక్కో దానికి ఒక్కో సమస్యతో జత కట్టి, సమాజంలోని అసమానతలు గురించి స్వామి వారికి నివేదించాడు రచయిత. “పరమ పునీతమైన గంగా జలముతో ఆర్గ్యం పొందే ఓ స్వామి, తాగడానికి నీళ్లు లేక బాధపడే జనాలు బాధలు చూడవయ్యా అంటాడు.

అలాగే అమృతంతో స్నానం చేసే దేవా, ప్రజలకు ఇంత అన్నం దొరికేలా చెయ్యలేవా అంటాడు. మరొకచోట నాకేమి వజ్ర వైడుర్యాలు, మణిరాసులు అవసరం లేదయ్యా, మనుషుల్లో మానవత్వం అన్నది పూర్తిగా కనుమరుగైపోతుంటే, చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావు? అని అడుగుతాడు.

సృష్టికి వెలుతురు ఇచ్చే అరుణోదయ వర్ణములో ఉన్న తిలకం దిద్దుకున్నావ్ కదా వచ్చి ఈ మాత్రం అన్యాయాన్ని ప్రశ్నించలేవా అంటాడు. మంత్రపుష్పంతో అర్చన చేస్తూ “ఓ దేవానువ్వేం మరీ పేద్ద పేద్ద నిర్ణయాలు చెయ్యాల్సిన అవసరం లేదు, నలుగురికి తిండి పెట్టాలి,బాగు చెయ్యాలి అన్న ఆలోచన ఉన్న వాడికి మాత్రమే తిండి దొరికేటట్టు చెయ్యి, మిగిలిన వారందరిని ఆకలితో చావగొట్టు చాలు, దెబ్బకు ప్రపంచం దానికదే మారిపోతుంది చూడు. అని ఒక ఉచిత సలహా పడేస్తాడు. చివరికి తన తుచ్ఛమైన భాష లో తప్పులు ఎంచకుండా భావము అర్ధం చేసుకో తండ్రి అని వేడుకుంటాడు.

ఇలా పాట మొత్తం సమాజం గురించి బాధ పడ్డాడు… కాబట్టే ఇది భక్తి విప్లవ గీతం అయి కూర్చుంది అని కవి భావన. వంశీకృష్ణ సాహిత్యం అందించిన ఈ పాటకి ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు సాకేత్ సాయిరాం  చక్కని బాణీని అందించారు, రాజు కుమార్ గారు చక్కగా ఆలపించారు. ఇక  దర్శకుడు కృష్ణ మోహన్ పాటను ఎంతో గొప్పగా చిత్రీకరించారు.  ఈ విషయం లో అతనికి కెమెరా… ఎడిటింగ్ పరంగా బాలెందర్ సహకారం అందించారు.

ఇక నటీ నటుల్లో “స్వామీ నేనానంద”గా ప్రధాన పాత్ర పోషించిన భరద్వాజ రంగావజ్జల  పాట  అంతరార్దాన్ని పూర్తిగా గ్రహించి, దానిని తనదైన హావభావాలతో, నటనా పటిమతో రక్తి కట్టించారు. నిజమైన స్వామీజీనే పాడుతున్నాడా అన్నంతగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు.

ఇక చిన్న పాత్రల్లో నటించిన పాత్ర ధారులు ఉదయ్, సరస్వతి, వంశీ, రమా వీరితో పాటు దేవస్థానం పూజారి. దేవాలయం సభ్యులు మిగిలిన పాత్రధారులు కూడా చక్కగా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. హైదరాబాద్ లోని బాలాపూర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో షూటింగ్ జరుపుకున్న ఈ పాట యూట్యూబ్ లో Bps audio &video channal లో అందరికి అందుబాటులో ఉంది. అందరూ చూసి ఆనందించి ఆ స్వామి వారి కరుణకు పాత్రులు కావచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!