పామాయిల్ కష్టాలకు కారణం అదేనా ?

Sharing is Caring...

ఇండోనేషియా చేపట్టిన పామ్‌బేస్‌డ్‌ బయో డీజిల్ ప్రాజెక్టు మూలంగా ఇండియా లో పామ్ ఆయిల్ కి కొరత ఏర్పడింది. ఇండోనేషియా ప్రభుత్వం పామాయిల్‌ను బయోడీజిల్‌గా వాడాలని 2020లో నిర్ణయించింది. దీని ప్రకారం 30శాతం పామాయిల్‌ను కలిపిన డీజిల్‌ను విక్రయిస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడానికే అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

దీంతో ఇండోనేషియాలో వినియోగించే 17.1 మిలియన్‌ టన్నుల్లో.. 7.5 మిలియన్‌ టన్నులు బయో డీజిల్‌కే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయోడీజిల్‌ ప్రాజెక్టు ఏర్పాటు నేపథ్యంలో  అధిక శాతం పామాయిల్‌ ను దేశీయంగా వాడుతున్నారు. ఈ క్రమంలో ఎగుమతులు తగ్గుతున్నాయి. దీంతో పామాయిల్ కొరత ఏర్పడింది.

ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్‌ ను ఉత్పత్తి చేసేది ఇండోనేషియానే . అలాంటి ఇండోనేషియాలోనే పామాయిల్‌ కి డిమాండ్‌ భారీగా పెరిగింది. మార్చిలో  ప్రభుత్వం పామాయిల్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. మరోపక్క రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. ఇండోనేషియాలో డిసెంబర్‌లో 3.98 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ దిగుబడి వచ్చింది.

అదే జనవరికి వచ్చేసరికి అది 3.86 మిలియన్‌ టన్నులకే పరిమితమైంది. దీనికి తోడు వంట నూనెలు ఎక్కువగా ఉత్పత్తి చేసే ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ నూనె మార్కెట్లకు అందడంలేదు. 2021 మార్చి నుంచి 2022 మార్చిలోపు ఇండోనేషియాలో వంటనూనెల ధర 14,000 ఇండోనేషియన్‌ రూపాయిల నుంచి 22,000 లకు పెరిగింది. దీంతో ఫిబ్రవరిలో ప్రభుత్వం రంగంలోకి దిగి చిల్లర విక్రయ ధరపై సీలింగ్‌ పెట్టింది.

అదే సమయంలో అక్కడి ప్రభుత్వం ఎగుమతులకు సిద్ధమైన పామాయిల్‌లో 30 శాతం దేశీయ మార్కెట్లలో విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎగుమతులపై కొత్త పన్నులు  విధించింది. దీంతో పామాయిల్ ధరలు పెరగడం మొదలెట్టాయి. వీటికి తోడు వంటనూనె ఉత్పత్తి దేశాల్లో సమస్యలు మొదలైనాయి. కరోనా సమయంలో మలేషియాలో పామాయిల్‌ తోటల్లో పనిచేసే కూలీలు కరవయ్యారు.

ఈ ప్రభావం పామాయిల్‌ దిగుబడిపై పడింది. సోయాబీన్‌ నూనెను ఎక్కువగా ఉత్పత్తి చేసే దక్షిణ అమెరికా దేశాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. బ్రెజిల్‌, అర్జెంటీనా, పరాగ్వేల్లో ఉత్పత్తి 9.4శాతం పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో నల్లసముద్రంలో ఎగమతి మార్గాలు మూసుకుపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వంటనూనె కరువు ఏర్పడింది. 

మొత్తం మీద వివిధ కారణాలతో వంటనూనె లభ్యత తగ్గిపోయి .. డిమాండ్ పెరిగి .. ధరలు పెరుగు తున్నాయి.  ఇండోనేషియాలో పన్నుల భారం భరించలేని విధంగా పెరిగిపోవడంతో మలేషియా నుంచి పామ్‌ఆయిల్‌ ఇండియా దిగుమతి చేసుకుంటోంది.మలేషియా సుంకాలు తగ్గించడంతో ఇండియాకి పామాయిల్‌ ఎగుమతులు ఏకంగా 238 శాతం పెరిగాయి.

ఇదే సమయంలో ఇండోనేషియా దిగుమతులు 32 శాతం తగ్గాయి. మరోవైపు ఇండియా అవసరాలను గమనించిన మలేషియా కూడా  క్రమంగా పన్నులు పెంచుతోంది. ప్రపంచంలో అత్యధికంగా వంట నూనెలు దిగుమతి చేసుకొంటున్న దేశం మనదే.  

మన వార్షిక దిగుమతులు 14 మిలియన్‌ టన్నుల వరకు ఉంటాయి. వీటిల్లో పామాయిల్‌ 8 నుంచి 9 మిలియన్‌ టన్నులు, సన్ ఫ్లవర్ ఆయిల్ 3.5 మిలియన్‌ టన్నులు మేరకు ఉంటాయి. ఆ సరఫరా తగ్గిపోవడంతో ఒక్కసారిగా ధరలు భగ్గుమంటున్నాయి. ప్రజల  జేబులు గుల్ల అవుతున్నాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!