Rough training………………………………………………….
చైనా సరిహద్దుల వద్ద ఇండియన్ ఆర్మీ ‘ప్లాన్ 190’ ని అమలు చేస్తున్నది. ప్లాన్ 190 అంటే మరేమిటో కాదు. చైనా వ్యూహాలను, చొరబాట్లను తిప్పికొట్టేందుకు సైనికులు ఎపుడూ దూకుడుగా ఉండేందుకు వారికి ప్రత్యేకంగా ప్లాన్ 190 పేరిట కఠినమైన మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులు ఎండ,వాన,చలి వంటి వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా ప్రతి రోజూ ఒకసారి 190 నిమిషాల పాటు కఠోర శిక్షణ పొందాలి. ఈ శిక్షణ లో భాగంగా పుషప్స్, సిటప్, స్క్వాట్లు వంటి పలు రకాలైన కసరత్తులు చేయిస్తారు.
శీతాకాలం ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 25 డిగ్రీలకు పడిపోతుంది. సముద్ర మట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి వాతావరణంలో ఆక్సిజన్ 70 శాతమే ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ శ్వాస తీసుకోవడమే చాలా కష్టం. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠోర శిక్షణ మాత్రం కొనసాగించాలి.
అలాగే మానసిక ఆరోగ్యం కోసం 20 నిమిషాలు ధ్యానం…యోగా తప్పనిసరిగా చేయాలి. ఇక వేగంగా ప్రత్యర్థిపై విరుచుకుపడేలా కిక్ బాక్సింగ్ లో కూడా శిక్షణ ఇస్తారు. అలాగే బురదలో కుస్తీ వంటి యుద్ధ విద్యలూ నేర్పిస్తారు. వేగంగా వెళ్లి శత్రువుల దిష్టిబొమ్మల రైఫిల్ బాకుతో దాడి చేయడం … టైరును సుత్తితో కొట్టడం ..గొడ్డలితో కట్టెను రెండు ముక్కలు చేయడం వంటి విద్యలను కూడా నేర్పిస్తారు.
ఇవన్నీ తప్పనిసరిగా నేర్చుకున్నవారే ఇక్కడ విధులు నిర్వహించడానికి అర్హులు అవుతారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడం.. చైనా భారీ సంఖ్యలో సైనికులను మోహరించిన నేపథ్యంలో ఇండియా కూడా అప్రమత్తమైంది. ఇటీవల పెరుగుతున్న చైనా చొరబాట్లను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం ‘ప్లాన్ 190’ అమలు చేస్తోంది. ఈ ప్లాన్ ప్రకారమే సైన్యం దూకుడు పెంచేలా చర్యలు తీసుకుంటోంది.
భారత సైనికులు శత్రువులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ ప్రణాళికను అనుసరించడం ద్వారా తమను తాము దూకుడుగా మార్చుకుంటారు. సరిహద్దుల్లో చొరబాట్లు కొనసాగితే, భారత సైన్యం దూకుడుగా స్పందించే అవకాశం ఉందని ఆర్మీ అధికారులు అంటున్నారు.
భారత సైన్యం రెండవ ప్రపంచ యుద్ధంలో మాదిరిగా ఎత్తైన శిఖరాలపై ఆధునిక టెక్నాలజీ తో బంకర్‌లను నిర్మించింది. ఈ బంకర్లలో ఆధునిక కమ్యూనికేషన్ సెంటర్, నిఘా గది తదితరాలతో పాటు ఆర్టిలరీ కమాండ్ సెంటర్ కూడా ఉంటుంది. దీని ద్వారా సరిహద్దులో శత్రువుల ప్రతి కదలిక ను గమనిస్తారు. ఇండియన్ ఆర్మీ ప్లాన్-190 ఉద్దేశ్యం ‘కిల్ అండ్ బి కిల్డ్ ‘ ఇటీవల వాస్తవాధీన రేఖకు సమీపంలో సైన్యం యుద్ధ విన్యాసాలు నిర్వహించింది.