Importance of Mouni Amavasya ………………………
మౌని అమావాస్య ను హిందువులు పవిత్రంగా భావిస్తారు. మౌని అమావాస్యను ఈ సారి జనవరి 29 న ఆచరిస్తారు.అమావాస్య తిధి జనవరి 28 తేదీ 19. 35 నిమిషాలకు మొదలై, 29 తేదీ 18.05 నిమిషాలకు ముగుస్తుంది.ఆరోజు శ్రద్ధగా పూజలు చేసి, భగవంతుడిని ఆరాధిస్తారు.
వేకువ జామునే నిద్ర లేచి గంగా నదిలో లేదా సమీపంలోని నదుల్లో స్నానాలు చేస్తారు. అవి లేకపోతే కొలను లేదా బావిలో స్నానాలు చేస్తారు.ఆ రోజున పితృతర్పణాలు వదలడం, నదీ స్నానాలు చేయడం, మౌన వ్రతం పాటించడం (అంటే రోజంతా మాట్లాడకుండా ఉండడం) వలన పుణ్యం కలుగుతుందని హిందువుల నమ్మకం.
మౌని అమావాస్య రోజున గంగానది అమృతంగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి.ఆ రోజున వారణాసిలోని గంగానదిలో,అలహాబాద్ (ప్రయాగ)లోని త్రివేణీ సంగమంలో లక్షలాది ప్రజలు స్నానాలు ఆచరిస్తారు. కుంభమేళా సమయంలో మౌని అమావాస్యకు ఉత్తరాదివారు విశేష ప్రాధాన్యతను ఇస్తారు.
ఉత్తరాదిలో మౌని అమావాస్యను నిష్ఠతో పాటిస్తారు. దక్షిణాదిలో నదీ స్నానాలు ఆచరిస్తారు. ఉపవాసాలు ఉంటారు.మౌని అమావాస్య నాడు స్తొమతను బట్టి పేదలకు దానం చేస్తుంటారు.
నువ్వులను, నల్ల బట్టలు, దుప్పట్లు, నూనె లాంటివి దానం చేస్తారు.ఈ అమావాస్య రోజున విష్ణువుకు నువ్వులు, దీపాలు అర్పించడం వలన మంచి జరుగుతుందని అంటారు. ఉత్తరాదిలో ఈ మౌని అమావాస్య ను ‘మాఘీ అమావాస్య’ అని కూడా అంటారు.
‘మౌని’ అనేది సంస్కృత పదం. ‘మౌన్’ నుంచి మౌని అనే పదం వచ్చింది. మౌని అంటే అర్థం ‘సంపూర్ణ నిశ్శబ్దం’. అందుకే ఆరోజున పూజలు చేసేవారంత మౌనవ్రతం చేస్తారు.మౌన వ్రతం చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ అందుతుంది. కేవలం మౌనీ అమావాస్య రోజు మాత్రమే కాకుండా ఈ నెల మొత్తాన్ని అత్యంత పవిత్ర మాసంగా భావిస్తారు.
పుష్య పూర్ణిమ రోజు మొదలు పెట్టి మాఘ పూర్ణిమ వరకు వ్రతాన్ని పూర్తి చేస్తారు. పితృపూజకు మౌని అమావాస్య మంచిరోజు. పూర్వీకులను గుర్తు చేసుకుని తర్పణాలను వదిలి, వారి ఆశీస్సులు పొందుతారు.ఆరోజున శనీశ్వరుడిని కూడా పూజిస్తారు.నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేస్తారు.