మన్నార్ గుడి మాఫియా అంటే ?

Sharing is Caring...

Conspiracies around Jaya……………………………………..మన్నార్ గుడి మాఫియా తో సంబంధాలే  పురచ్చితలైవి జయలలిత ఇమేజ్ ను దెబ్బతీశాయి. చివరికి జయ ప్రాణాలే కోల్పోయారు. ఈ మన్నార్ గుడి మాఫియా  గురించి తెహెల్కా .. డీఎన్ ఏ వార్తా పత్రికలు … మరి కొన్ని తమిళ పత్రికలు అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. 2010 కి ముందే జయలలిత పై విష ప్రయోగం, మంత్ర తంత్ర ప్రయోగాలు జరిగినట్లు వార్తా కథనాలు రాశాయి.

అప్పట్లో చిన్నమ్మ ఈ పనులన్నీ చేయించినట్టు ప్రచారం జోరుగా జరిగింది. చిన్నమ్మ అంటే పార్టీ లో అందరు భయపడేవారు. జయకు సైతం భయపడని అన్నాడీఎంకే నేతలు కొందరు.. ఆమె నీడ చిన్నమ్మకు భయపడేవారు. వంగి వంగి దండాలు పెట్టేవారు. జయ ఇచ్చిన చనువుతో చిన్నమ్మ మెల్లగా అల్లుకుపోయారు . తమ బంధుగణాన్ని చేరదీశారు. చిన్నమ్మ బంధు గణం రాష్ట్రమంతా ఉంది. ఆమె బంధు గణాన్నే మన్నార్ గుడి మాఫియా అనేవారు.

ప్రభుత్వం లో ఎక్కడ .. ఏస్థాయిలో పని కావాలన్నా దానికో రేటు ఫిక్స్ చేసి చిన్నమ్మ పూర్తి చేసేది. అంతగా ఆమె ప్రభుత్వ అధికారులను నియంత్రించేది. మొదట్లో కొన్ని విషయాలు జయ చెవిన పడినప్పటికీ ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అదే ఆమె కొంప ముంచింది.

అయితే 2011 డిసెంబర్ 17 నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జయ .. శశికళ ల మధ్య ఎన్నో ఏళ్లుగా అల్లుకున్న అనుబంధం కట్ అయిపొయింది. తన నివాసంలో ఉన్న చిన్నమ్మను … ఆమె బంధువులందరినీ పురచ్చితలైవి బయటకు పంపేశారు.

అకస్మాత్తుగా ఎందుకలా వెళ్లగొట్టారు? అసలేం జరిగింది? అనే విషయాలు పూర్తిగా వెలుగు చూడలేదు. అయితే, అన్నాడీఎంకే నేతలు చెప్పారంటూ తెహల్కా పత్రిక .. మరికొన్ని పత్రికలు కొన్ని ఆసక్తికరమైన కథనాలు ప్రచురించాయి. వాటి ప్రకారం అప్పట్లో ఒక ఎన్నారై తమిళనాడులో పెట్టుబడులు పెట్టడానికి  చెన్నై వచ్చారు.

తన ప్రాజెక్టు పనుల కోసం  చిన్నమ్మను కలిశాడు. చిన్నమ్మ అతని పని చేయడానికి  15 శాతం కమీషన్ అడిగారట. కాగా కమిషన్ ఇవ్వడానికి ఇంటరెస్ట్ చూపని  ఆ ఎన్నారై గుజరాత్‌కు వెళ్లాడు. అప్పట్లో నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్నారు. ఎన్నారై  మోడిని కలిశాడు .. ప్రాజెక్టు పనులు గురించి మాట్లాడుతూ చిన్నమ్మ కమీషన్ అడిగిన విషయాన్నీ చెప్పారు. 

ఆ తర్వాత నరేంద్ర మోడి ఈ విషయాన్ని ఒక సందర్భంలో జయలలితకు తెలియ జేశారు. జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు ఎదురువుతాయని హెచ్చరించారు. అక్కడనుంచి జయకు అనుమానాలు మొదలైనాయి. అప్పట్లోనే మోనోరైల్ ప్రాజెక్టును సింగపూర్‌కు చెందిన ఒక కంపెనీకి ఇవ్వమని జయలలిత అధికారులకు సూచించారు.

కానీ ఆ ప్రాజెక్టు మలేసియా కంపెనీ కి వెళ్ళింది. యాదృచ్చికంగా  సంబంధిత ప్రాజెక్టు ఫైల్ జయ దగ్గరకు రాగా దాన్ని మొత్తం చూసింది. అందులో పెట్టిన సంతకం తనది కాదని ఎవరో ఫోర్జరీ చేశారని ఆమెకు అర్థమైంది.

కూపీ లాగితే చిన్నమ్మ ఈ ఫైల్ వ్యవహారాలు చూసారని తెలిసిపోయింది. దాంతో చిన్నమ్మను ఎడాపెడా వాయించేసింది. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆవేశంలో జయ శశికళను మెడ బట్టి బయటకు నెట్టేసింది. ఇంకెప్పుడూ ముఖం చూపించకు అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే జయ  తాను వాడుతున్న మందుల గురించి డాక్టర్లను సంప్రదించారు.

ఆ మందులను వైద్యులు పరీక్షించి .. ఎవరో ఆమెకు మత్తుమందు, చిన్నమొత్తంలో విషం ఇస్తున్నట్లు చెప్పారట. ఇవన్నీ తెలుసుకుని జయ కంగారు పడిందట. ఇది జరగక ముందే జయకు మరి కొన్ని విషయాలు కూడా తెలిసాయి. అన్నింటిని సమీక్షించుకునే  డిసెంబర్ 17 న చిన్నమ్మను ఇంటి నుంచి పంపేసింది. 

————KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!