మనీషా కొయిరాలా ఏమి చేస్తున్నారో ?

Sharing is Caring...

Actress who fought with cancer……………………….

మనీషా కొయిరాలా ..ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఒకే ఒక్కడు సినిమాలోని ‘నెల్లూరి నెరజాణ’ పాట వినపడగానే మనీషా నే గుర్తుకొస్తుంది. ఆమె నటించిన దక్షిణాది సినిమాలు తక్కువే అయినప్పటికీ అన్నీహిట్ మూవీసే. భారతీయుడు, క్రిమినల్, ముంబయి ఎక్స్‌ప్రెస్, బొంబాయి వంటి సినిమాలతో అప్పట్లో మనీషా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

బాలీవుడ్‌లో ఆమె నటించిన కొన్నిచిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇటీవల మనీషా’ హీరా మండి.. ది డైమండ్ బజార్’ వెబ్ సీరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఈ సిరీస్ ను రూపొందించారు. బ్రిటీష్ హయాంలో వేశ్యల జీవితాలు ఎలా ఉండేవో హీరా మండి లో చూపారు. కథా ప్రాధాన్యమనున్న చిత్రాల్లో నటించడానికి మనీషా ఆసక్తిగా ఉన్నారు.

ఇక మనీషా నేపాల్‌లోని సంపన్న కుటుంబంలోనే జన్మించింది.నేపాల్‌ ప్రధానిగా చేసిన విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా కు ఆమె మనవరాలు. తండ్రి ప్రకాష్ కొయిరాలా కూడా రాజకీయ నాయకుడే. మనీషా చిన్నతనంలో నేపాల్ రాజకీయ పరిస్థితులు దిగజారడంతో ఆమె తల్లిదండ్రులు వారణాసిలో స్థిరపడ్డారు.

పదో తరగతి తర్వాత నేపాల్‌కు తిరిగి వచ్చిన మనీషా కొయిరాలా’ ఓని ‘అనే నేపాలీ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.తర్వాత కొన్నాళ్ళకు ఇండియాకొచ్చి మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. అపుడే హిందీ సినిమాల్లో అవకాశం వచ్చింది. సౌదాగర్ ఆమె మొదటి సినిమా.

1942 – ఎ లవ్ స్టోరీ (1994), తమిళ చిత్రం బాంబే (1995) సినిమాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన అగ్నిసాక్షి (1996), ఇండియన్ (1996), గుప్త్ – ది హిడెన్ ట్రూత్ (1997), కచ్చే ధాగే (1999), కంపెనీ (2000), ఏక్ చోటీసి లవ్ స్టోరీ (2002) వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. సుమారుగా ఓ వంద సినిమాల్లో నటించింది.

నటిగా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మనీషా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది.పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. నేపాల్‌కి చెందిన సమ్రాట్‌ దహల్‌తో 2010లో వివాహం జరిగింది. పెళ్లైన ఆరు నెలలకే మనీషా సమ్రాట్ ల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి.

2012లో విడాకులు ఇరువురు తీసుకున్నారు. వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. కానీ కొద్దీ కాలానికే గొడవలు ప్రారంభమయ్యాయి.తను ప్రేమించిన భర్తే తనకు శత్రువుగా మారాడంటూ అప్పట్లో ఆమె ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.

తర్వాత మానసిక ఒత్తిడికి గురై మద్యానికి బానిసగా మారింది మనీషా. విడాకుల ప్రభావంతో డిప్రెషన్‌కు గురైంది. అదేసమయంలో క్యాన్సర్ బారిన పడింది. ఎంతో ఆత్మ స్థైర్యంతో నిలబడి క్యాన్సర్ వ్యాధితో పోరాడి గెలిచింది.

ఈ పోరాటం తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిందని మనీషా కొయిరాలా తన ఆత్మకథ ‘హీల్డ్’ పుస్తకంలో రాసుకున్నారు. తన జీవనశైలి, అలవాట్లే క్యాన్సర్‌కు కారణమని తెలుసుకున్న మనీషా వాటికి స్వస్తి పలికారు. నీలమ్ కుమార్ ఈ ఆత్మకథ రాయడంలో మనీషాకు సహకరించారు.

54 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా ఉంటున్న మనీషా కొయిరాలా సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటున్నారు.. నేపాలీ బాలికల అక్రమ రవాణాను నిరోధించే కార్యక్రమాలు చేపట్టే సంస్థలతో కలిసి పని చేస్తున్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!