గంప మల్లయ్య గుహల్లో ఏముంది ?

Sharing is Caring...

ఆ కొండ పేరు గంప మల్లయ్య కొండ.. ఆ కొండ గుహల్లో మల్లయ్య స్వామి వెలిశాడని చెబుతుంటారు. ఆ కొండ చుట్టూ అటవీ ప్రాంతం. ఏడు కొండలు దాటి వెళితే కానీ గంప మల్లయ్య కొండకు చేరుకోలేం. అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నజలాల తరిమెల గ్రామాల మధ్య ఉంది ఆ కొండ. స్వామి ఆలయానికి (గుహనే ఆలయం అంటారు) వందల ఏళ్ల చరిత్ర ఉందని సమీప గ్రామ ప్రజలు చెబుతారు.

కొండకు వెళ్లే మార్గమంతా రాళ్లు రప్పలే. జాగ్రత్తగా ఆ రాళ్లను దాటుకుంటూ నడవాలి. మధ్యలో దాహమైతే చుక్క నీరు కూడా దొరకదు.  ఎత్తైన కొండల గుండా సాగే  ప్రయాణం సాహసం తో కూడుకున్నదే అని చెప్పుకోవాలి. దాదాపు పదకొండు కిలో మీటర్లు నడుచుకుంటూ అడవి నుంచి ఏడుకొండలు దాటి మల్లయ్య కొండ పైకి చేరితే ఉత్సవ విగ్రహాలను దర్శించవచ్చు.

ఆ పక్కనే కొండ లోయ ఒకటుంది. కొండపై నుంచి ముప్పయి అడుగుల కింద చిన్న గుహలున్నాయి. ఆ గుహలో మల్లయ్య స్వామి విగ్రహం ఉందని అంటారు. సామాన్య ప్రజలు కిందకు దిగి వెళ్లడం చాలా కష్టం. ఉత్సవ విగ్రహాల వద్ద నూనె పోసి దీపాలు వెలిగిస్తారు.

ఆ నూనె అంతా లోయ లోకి దిగే బండరాళ్లపై పడుతుంది.కాలు పెడితే జర్రున జారుతుంది. కేవలం పూజారి మాత్రం బండరాళ్ళపై నుంచి కిందకు వెళ్లి గుహలోని స్వామి కి భక్తులు తెచ్చిన ముడుపులను సమర్పించి మరల కొండ పైకి వస్తాడు. అదే అసలైన ఘట్టం.

కాలు పెడితేనే జారిపోయే బండరాళ్ళపై నుంచి పూజారి  కిందకు దూకుతూ  వెళ్లడం … మరల పైకి రావడం సాహసోపేత కార్యం.  ఒక చేత్తో హారతి .. మరోచేత్తో గంట పట్టుకుని .. ముడుపుల మూట మెళ్ళో వేసుకుని కిందకు దిగుతాడు.

శ్రావణ శనివారాలు మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్దఎత్తున భక్తులు వస్తారు. ఈ దిగే క్రమంలోనే భక్తులు గోవిందా ఆంటూ పెద్దగా అరుస్తుంటారు. మేళగాళ్ళు ఉరుము వాయిస్తుంటారు. ఆ శబ్దాలతో అక్కడి వాతావరణమంతా గంభీరంగా మారుతుంది.

భక్తులు అలా గోవింద నామస్మరణ చేస్తుండగా పూనకం వచ్చిన వాడిలా పూజారి కిందకు దిగుతాడు.  అలా దిగుతూనే ఇటీవల పూజారి కాలు జారి లోయలో పడి పోయాడు. దీంతో ప్రభుత్వం అక్కడి  కార్యక్రమాలను రద్దు చేసింది. చాన్నాళ్ల  కిందట కూడా ఇలాగే జరిగిందట.

అదలా ఉంటే …  అసలు ఆ గుహలో ఏముందనేది మిస్టరీ. కిందకు దిగి చూసిన వాళ్ళు లేరు. ప్రాణాలపై ఆశలు వదులుకుని దిగాల్సిందే. మరి పూజారి ఎందుకు అంత సాహసం చేసాడు ? గుహలో ఏముంది ? అక్కడ నుంచి మరో ప్రాంతానికి సొరంగ మార్గం ఏమైనా ఉందా ?

 

అక్కడ నిధి నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా ? ఇవన్నీ ఎవరికి తెలియని అంశాలు. ఈ మిస్టరీ ని ఛేదించిన వారు ఎవరు లేరు. కేవలం పూజారులకు మాత్రమే తెలుసు.

ఇదే అంశంపై  అనంతపురం కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ .. చరిత్ర పరిశోధకులు మైనాస్వామి తర్జని తో మాట్లాడుతూ  గంప మల్లయ్య గురించి జనం చెప్పుకునే కథనాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. అయితే చారిత్రక ఆధారాలు ఏమి లేవని అభిప్రాయ పడ్డారు.

శింగనమల కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ తర్జని తో మాట్లాడుతూ గంప మల్లయ్య ను  శ్రీ వేంకటేశ్వరుని మరో అవతారం గా ఇక్కడి ప్రజలు భావిస్తారని చెప్పుకొచ్చారు. గుహలో గంప మల్లయ్య విగ్రహం ఉందని .. పూజారికి మినహా లోపలికి వెళ్లడం ఇతరులకు అసాధ్యమని .. గుహ లోపల ఇంకేమున్నాయో పూజారికి తప్ప మరెవరికి తెలియదని  వివరించారు.

తిరుమలలో ఉన్నట్టు ఇక్కడ ఏడుకొండలు ఉన్నాయి .. ఒకప్పుడు ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉండేదని . అయితే అభివృద్ధికి నోచుకోలేదని అభిప్రాయ పడ్డారు. ఇక్కడ పిల్లలకు  గంప మల్లయ్య..  మల్లయ్య స్వామి, గంప మల్లు అని పేర్లు పెట్టుకుంటారని వివరించారు. 

అనంతకు చెందిన మరో జర్నలిస్ట్ శ్రీహరిమూర్తి  మాట్లాడుతూ … విజయనగర రాజుల హయాంలో కొంతమంది పాలెగాళ్ళు తమ సంపదను ఇలాంటి కొండల్లోని గుహల్లో దాచుకున్నారనే కథనాలు ప్రచారంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు.  

గంప మల్లయ్య గుహల్లో కూడా  నిధి నిక్షేపాలు ఉన్నట్టు గతంలో పెద్దలు చెప్పుకునే వారని.. అయితే వాస్తవాలు వెలుగు చూడాలంటే పురావస్తుశాఖ అధికారులు చొరవ తీసుకుని  గుహల్లో  ఏమున్నాయో పరిశోధిస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు.

———KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!