Investigations in the sea womb…..
సముద్రాల్లో ఆరు కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతులో ఉండే ప్రాంతాన్ని ‘హడల్ జోన్’ అని అంటారు. సముద్ర గర్భంలో మనకు తెలియని ఎన్నో లోతైన కందకాలు ఉన్నాయి. భూమిలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికల ద్వారా ఈ కందకాలు ఏర్పడ్డాయి.
ఇవి సముద్ర మట్టానికి 11కి.మీ దిగువన విస్తరించి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలోకి సూర్యరశ్మి ఏమాత్రం సోకదు. ఆ కందకాల్లో చిమ్మ చీకటి ఆవరించి ఉంటుంది. అతి శీతల పరిస్థితులు నెలకొని ఉంటాయి. ఇలాంటి హడల్ జోన్లో జీవం మనుగడ కష్టమనే భావన ఉంది.
ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కొన్ని రకాల జీవులు బతుకుతున్నాయి. ఒకప్పుడు వెలుతురు లేని జీవితం అసాధ్యమని భావించినా, ఇప్పుడు హడల్ మండలం కూడా జీవంతో నిండి ఉందని పరిశోధనల ద్వారా స్పష్టమైంది. అనేక ప్రత్యేకమైన .. అసాధారణమైన జీవులు ఈ లోతైన కందకాలలో మనుగడ కొనసాగిస్తున్నాయి.
ఈ జీవులు ప్రతికూల వాతావరణంలో, తీవ్రమైన ఒత్తిడిలో సైతం బతుకుతున్నాయి. నాచు, చిన్న కీటకాలను, నీటిపై తేలే వ్యర్ధపదార్ధాలను ఈ జీవులు ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ జాతులను మానవులు ఎన్నడూ చూడలేదు. ముందు ముందు చూస్తారని కూడా చెప్పలేము. ఈ జాతులు ఉపరితలం నుండి 9.1 కి.మీ (సుమారు 30,000 అడుగులు) లోతులో సంచరిస్తున్నాయి.
వేటాడే జంతువులు కూడా ఈ లోతుల్లోకి ప్రవేశిస్తాయి. 7 కిమీ (23,000 అడుగులు) లోతులో క్రేఫిష్, రొయ్యలు, పీతలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ లోతుల్లో కూడా కొన్నిరకాల చేపల జాతులు ఉన్నాయి. పరిశోధకులు హడల్ నత్త చేప సూడోలిపారిస్ ఆంబ్లిస్టోమోప్సిస్‌ను ఉపరితలం నుండి 8 కిమీ (27,000 అడుగులు) లోతులో చూశారు . జపాన్ ట్రెంచ్‌లో హకుహో-మారు సబ్‌మెర్సిబుల్ ద్వారా ఈ పరిశీలనలు జరిగాయి . ఇంత కంటే లోతులో ఏ చేప మనుగడ సాగించదని పరిశోధకులు అంటున్నారు.
నాసా ప్రయోగాలు
సముద్రాల అట్టడుగున ఉండే క్లిష్టమైన పరిస్థితుల పై నాసా ఇప్పటికే ప్రయోగాలు చేపట్టింది. ఈ పరిస్థితులపై పరిశోధన చేసి.. ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై సముద్రాలు, అక్కడి పరిస్థితులు ఎలా ఉండొచ్చనే అంచనాలను రూపొందిస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా అన్నిరకాల పరిస్థితులను తట్టుకునే పరికరాలను రూపొందించి.. భవిష్యత్తులో ఆయా గ్రహాలు, ఉపగ్రహాలపై పరిశోధనలు చేయబోతోంది.