Will survival be difficult?………………………….
ఆక్సిజన్ ఒక్కసారిగా ఆవిరై పోతే ? అలా జరుగుతుందని తలచుకుంటేనే భయమేస్తుంది. గుండె జారిపోతుంది. ఇలాంటి ఘటన అపుడెపుడో జరిగిందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. రాబోయే కాలంలో ఆంటే కొన్ని కోట్ల ఏళ్ళ అనంతరం జరిగే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. ఇక ఈ అంశాలపై కొంత కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిల్లో తేలిందేమిటంటే ….
దాదాపు 50 కోట్ల ఏళ్ల క్రితం. భూమిపై ఆక్సిజన్ ఉన్నట్టుండి పూర్తిగా ఆవిరైపోయింది. ఊహించని ఈ పరిణామంతో ఎన్నో జీవరాశులు ఉన్నపళంగా కళ్లు తేలేశాయి.క్రమంగా ఉనికినే కోల్పోయాయి. భూగోళంపై తొలి జీవ వినాశనం జరిగిన తీరు ఇదేనని శాస్త్రవేత్తలు కొన్ని అధ్యయనాల్లో కనిపెట్టారు.
భూమిపై తొలి జీవ వినాశనం జరిగిన తీరును అర్థం చేసుకునేందుకు, ఆ క్రమంలో పూర్తిగా నశించిపోయిన జీవరాశులు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు పరిశోధకులు శిలాజ ముద్రలను అధ్యయనం చేశారు. ఆ వినాశనమే చాలా జంతు జాతులు ఇప్పుడున్న రూపాల్లో వికసించేందుకు పురిగొల్పి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఆక్సిజన్ ఏమైపోయింది? అనే అంశానికి సంబంధించి అందుకు ఫలానా సంఘటనే కారణమని ఖచ్చితంగా చెప్పలేకపోయినా, అది అప్పట్లో జరిగిన అనేకానేక పరిణామాల కారణంగా ఆక్సిజన్ ఆవిరై పోయిందని పరిశోధకులు అంటున్నారు. ‘అగ్నిపర్వతాల పేలుడు, భూ ఫలకాల్లో భారీ కదలికలు, గ్రహశకలాలు ఢీకొనడం వంటి వాటి వల్ల భూమిపై ఆక్సిజన్ తగ్గిపోవడం జరిగి ఉంటుంది” అని అధ్యయన సారధి వర్జీనియా టెక్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కు చెందిన పరిశోధకుడు స్కాట్ ఇవాన్స్ అభిప్రాయపడ్డారు.
గ్లోబల్ వార్మింగ్ వంటివి ఆక్సిజన్ స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇది లాగే కొనసాగితే మరో మారు ప్రాణ కోటి కి ముప్పు తప్పదని ‘అని హెచ్చరించారు. అదలా ఉంటే…. సౌర వ్యవస్థ తన జీవిత చక్రాన్ని కొనసాగిస్తున్నందున, సూర్యుడు వేడెక్కడం ప్రారంభమవుతుంది.
పెరిగిన సౌర ఉత్పత్తి వాతావరణాన్ని మరింత వేడి చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ విచ్ఛిన్నం ద్వారా ఉష్ణోగ్రత పెరుగుతుంది.కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగదు. ఈ పరిణామ క్రమంలో మొక్కలు చనిపోతాయి. ఆహార ఉత్పత్తి పడిపోతుంది. దాంతో పాటు ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. క్రమం గా మనుగడ కష్టమవుతుంది.