ఏమని అడగను దేవుడిని ?

Sharing is Caring...

——-భండారు శ్రీనివాసరావు        ……… Transfused AIDS patient’s blood by mistake.

ఆర్థర్ రాబర్ట్ యాషె మునుపటి తరం టెన్నిస్ క్రీడాకారుల్లో మేటి. ప్రపంచంలో అగ్రగణ్య టెన్నిస్ ఆటగాడు. అనూహ్యంగా సంక్రమించిన ఎయిడ్స్ వ్యాధితో ఆ అమెరికన్ క్రీడాకారుడు అకాల మరణం చెందాడు. అతగాడి గుండెకు శస్త్ర చికిత్స చేసే సమయంలో పొరబాటున ఎయిడ్స్ రోగి రక్తం ఎక్కించిన ఫలితంగా అతడికి ఈ భయంకరమయిన రోగం సోకింది.

ఈ విషయం తెలుసుకుని విశ్వవ్యాప్తంగా వున్న అతడి అభిమానులు ఎంతో బాధ పడ్డారు. వారిలో ఒక కుర్రవాడు అతడికి ఉత్తరం రాస్తూ ‘లోకంలో ఇంతమంది జనం వుంటే ఆ పాడు దేవుడు మీ ఒక్కరికే ఈ వ్యాధి యెందుకు కలిగించాడు’ అంటూ ఆవేదన వెలిబుచ్చాడు. ఆర్ధర్ అతడికి రాసిన జవాబులో మొత్తం మానవజీవిత పరమార్ధాన్ని కాచివొడబోశాడు.

ఆ సమాధానం ఇలావుంది. “దేశదేశాల్లో లక్షలాదిమంది పిల్లలు. చాలామందికి టెన్నిస్ ఆడాలనే కోరిక వుంటుంది. వారిలో కొన్ని వేలమంది మాత్రమే టెన్నిస్ అంటే ఏమిటో ఎంతో కొంత తెలుసుకోగలుగుతారు. మళ్ళీ వారిలో కొందరు మాత్రమే టెన్నిస్ బ్యాట్ పట్టుకోగలుగుతారు.

“వింబుల్డన్ స్తాయికి చేరేవాళ్ళు చివరకు ఓ యాభయ్ మంది వుంటారేమో. వారిలో ఓ నలుగురు సెమీ ఫైనల్ చేరతారు. వాళ్ళలో ఇద్దరు ఫైనల్స్ ఆడితే మళ్ళీ వారిలో ఒక్కడే చాంపియన్ అవుతాడు. ఆ ఒక్కడిని నేనే.  వింబుల్డన్ కప్పును ఘనంగా చేతిలో పట్టుకుని గర్వంగా అందరికీ చూపెడుతున్నప్పుడు ఎప్పుడూ నాకు దేవుడు గుర్తు రాలేదు. వచ్చినా ఆయన్ని నేను అడిగిన గుర్తు లేదు.

ఇంతమంది జనాలు వుంటే, నన్నొక్కడినే టెన్నిస్ చాంపియన్ ని యెందుకు చేశావని? ఇప్పుడు ఈ స్తితిలో ఆ దేవుడ్ని ఏ మొహం పెట్టుకుని అడగను ఇంతమంది జనాల్లో నన్నొక్కడినే ఈ వ్యాధి బారిన యెందుకు పడేశావని?

“అందుకే దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడాలి. ఆనందం నిన్ను ఎప్పుడూ హాయిగా వుంచుతుంది. నువ్వు చేసే ప్రయత్నాలే నిన్ను అత్యంత శక్తివంతుడ్ని చేస్తాయి. బాధలు వేదనలు నీలో మానవత్వాన్ని పెంచుతాయి. ఓటమి అనేది నిన్ను ఉదాత్తుడిగా చేస్తుంది. గెలుపు నిన్ను మెరిపిస్తుంది. కాకపోతే, మన నమ్మకం, మన నడత ఈ రెండే మనల్ని మరింత ముందుకు నడిపిస్తాయి”..

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!