రష్యా ఉక్రెయిన్ పై దాడులు మొదలు పెట్టి సరిగ్గా రెండునెలలు అవుతోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచదేశాల ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. అపఖ్యాతి మూట కట్టుకోవడం మినహా పుతిన్ కూడా సాధించింది ఏమి లేదు. యుద్ధం ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో ఎవరి కి తెలీదు .. ఉక్రెయిన్ను అన్నివిధాలా అతలాకుతలం చేయడంలో మాత్రం రష్యా పైచేయి సాధించింది.
ఉక్రెయిన్ నగరాలన్నీ చాలావరకు నేలమట్టం కాగా .. ఆస్తి నష్టం .. ప్రాణనష్టం భారీగానే జరిగింది. రష్యా అయితే పెద్ద ఎత్తున నష్టాలను మూటగట్టుకుంది. ఇక పశ్చిమ దేశాల ఆంక్షలతో ఇబ్బందులు పడుతోంది. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మొండిగానే వ్యవహరిస్తున్నారు. పుతిన్ యుద్ధ కాంక్షకు ఎందరో అమాయకులు బలైపోయారు. ఈ యుద్ధం తో నియంతలను మించిపోయి పుతిన్ చరిత్రకెక్కారు. యుద్ధ నేరస్తుడిగా మారిపోయారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ను పూర్తిగా స్వాధీనం చేసుకుని గౌరవప్రదంగా యుద్ధానికి తెర దించాలనేది పుతిన్ ఎత్తుగడగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు కూడా అంత సులువుగా ఫలించేలా లేవు.అక్కడ కూడా రష్యా దాడులను ఉక్రెయిన్ సైనికులు తిప్పికొడుతున్నారు. 9 యుద్ధ ట్యాంకులను, 18 సాయుధ యూనిట్లను, 13 సాయుధ వాహనాలను, 3 ఆర్టిలరీ వ్యవస్థలను ధ్వంసం చేశారు. దాంతో రష్యా దళాలు కాస్త ఊపు తగ్గించాయి.
ఉక్రెయిన్ సేనలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తూ రష్యాకు చుక్కలు చూపిస్తున్నాయి. నాటో దేశాలు ఆయుధాలు అందించడం తో ఉక్రెయిన్ రెట్టింపు ఉత్సాహంతో పోరాడుతోంది. మరియుపోల్‌ను ఆక్రమించామని పుతిన్ ప్రకటించినా అక్కడ పోరు కొనసాగుతూనే ఉందని ఇంగ్లండ్ రక్షణ శాఖ అంటోందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటుపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోందని అంటున్నారు.
మరియుపోల్‌లో కొత్తగా అనేక మట్టిగుట్టలు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మాక్సర్ టెక్ సంస్థ విడుదల చేసిన శాటిలైట్ ఫొటోల్లో నగరం సమీపంలో 200పైగా సమాధులు కనిపించాయి. ఇక్కడ దాదాపు 9వేలమంది పౌరులను రష్యన్లు సమాధి చేశారని ఉక్రెయిన్ ఆరోపణ. ఈ చిత్రాలపై రష్యా స్పందించలేదు.
రష్యన్ల దమనకాండకు ఇవన్నీనిదర్శనాలని, వారు జరిపిన నరమేధానికి ఈ చిత్రాలు ఆనవాళ్లని ఉక్రెయిన్ అంటోంది, వీటిని అంతర్జాతీయ న్యాయస్థానానికి పంపనుంది. ఇదిలా ఉంటె డోన్బాస్ ప్రాంత నగరాలపై రష్యా దాడులు ముమ్మరం చేసింది. అక్కడ నుంచి పౌరులను తరలించే యత్నాలు ఇంకా జరుగుతున్నాయి.మరియు పోల్ లో దాదాపు 20 వేలమంది పౌరుల ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు.
ఇంకా ఈ యుద్ధం ఎన్నాళ్లు కొన సాగుతుందో ఎవరికి తెలీదు. రెండో విడత యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో పైచేయి సాధించాలని రష్యా భావిస్తుంటే .. ఏమాత్రం భయపడకుండా పోరాడాలని ఉక్రెయిన్ నిర్ణయించుకుంది. ఇది పేరుకి ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధమే కానీ అసలు యుద్ధం అమెరికా రష్యాల మధ్యనే జరుగుతోంది. అమెరికా ఆయుధ సహాయం లేకపోతే ఈపాటికి ఉక్రెయిన్ ను రష్యా ఆధీనంలోకి వెళ్లి ఉండేది.
రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో భారీ విధ్వంసం జరిగింది. పురాతన భవనాలు .. ఆధునిక బిల్డింగ్లు, మౌలిక సదుపాయాలన్నీ నేలమట్టమైనాయి. ఆ భౌతిక నష్టం సుమారు 60 బిలియన్ల డాలర్లు ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ప్రస్తుతం యుద్ధం సమయంలో ధరలు మరింత పెరిగాయని, దానికి ప్రకారం ఆర్థిక నష్టం మరింత ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు.
యుద్ధం కొనసాగుతున్న కొద్దీ.. నష్టం విలువ పెరుగుతూనే ఉంటుందని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది.
తీవ్రమైన ఆర్థిక నష్టం నుంచి కోలుకునేందుకు ప్రతి నెల ఏడు బిలియన్ల డాలర్లు అవసరం ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు.
ఇక కొన్ని లక్షలమంది ప్రాణ భయంతో వలసలు పోయారు. ఇంకో నెల రోజులు దాడులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. కీవ్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకుని యుద్ధ విరమణ ప్రకటించవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.