గుజరాత్ లోని పంచ్‌మహల్ జిల్లా గోద్రా రైల్వే స్టేషన్ లో 2002 ఫిబ్రవరి లో అంటే సుమారు 22 ఏళ్ల క్రితం కర సేవకులను సజీవ దహనం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు రఫీక్ హుస్సేన్ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు.అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో 31 మందిని కోర్టు దోషులుగా నిర్దారించింది.
అందులో కీలకమైన నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు. కొంతమంది పాక్ వెళ్లారనే కథనాలు ప్రచారం లో ఉన్నాయి. నాటి ఘటనలో రఫీక్ హుస్సేన్ రైలు పెట్టెను తగులబెట్టేందుకు పెట్రోల్ సిద్ధం చేశాడని… ఒక భోగీ కి నిప్పు అంటించాడని అభియోగం. ఈ కుట్రలో అతనే కీలకపాత్రధారి అని పోలీసుల విచారణలో తేలింది. కుట్ర కు సూత్రధారులు ఎవరనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
ఇతగాడిపై పలు కేసులు కూడా ఉన్నాయి.ఆ నాటి ఘటనలో మొత్తం 59 మంది కరసేవకులు మృతి చెందారు. ఆరోజున వేలాది మంది రామభక్తులు గుజరాత్ నుండి అయోధ్యకు వెళ్లి పూర్ణాహుతి యజ్ఞంలో పాల్గొని తిరిగి వస్తున్నారు. అపుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రైలు రాగానే వందల సంఖ్యలో దుండగులు రాళ్లు విసురుతూ దాడి చేశారు.
కొద్దిసేపు రాళ్ళు విసిరాక, నాలుగు బోగీలను తగలబెట్టారు. ఆ బోగీల్లో అనేక మంది చిక్కుకుపోయారు. 27 మంది మహిళలు, 10 మంది పిల్లలతో సహా 59 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. 48 మంది గాయాలపాలయ్యారు.ఈ రైలు పెట్టె దహనం కేసు తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి.
దీంతో దేశవ్యాప్తంగా భయాందోళనలను నెలకొన్నాయి. నాటి అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 790 మంది ముస్లిములు, 254 మంది హిందువులూ మరణించారు. వాస్తవానికి రెండువేల మంది పైగా మరణించి ఉంటారని అంచనా. ఈ అల్లర్ల వెనుక అప్పటి సీఎం మోడీ .. ఇతర మంత్రులు ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
కాగా గోద్రా అల్లర్ల కేసులో కేంద్ర ప్రభుత్వం నియమించిన నానావతి కమిషన్ విచారణ అనంతరం సీఎం మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పట్లో నరేంద్రమోదీ గుజరాత్ సీఎం గా ఉన్నారు.ఆయన హయాంలో జరిగిన గోద్రా రైలు దహనం ఘటన తర్వాత.. చెలరేగిన హింసాకాండలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మైనార్టీలే.
ఇందులో మోదీ ప్రమేయం ఉందడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అల్లరి మూకలను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యమే కారణమని నానావతి కమిషన్ నివేదికలో తెలిపింది. అలాగే సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీల దహనం పక్కా ప్రణాళికతో చేసిందేనని.. తర్వాత జరిగిన అల్లర్లు మాత్రం ప్రణాళికా బద్ధంగా జరిగినవి కావని నానావతి కమిషన్ తెలిపింది.
ఈ అల్లర్ల వెనుక రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మంత్రి ప్రమేయం ఉందనడానికి లేదా.. వారి ప్రోద్బలంతోనే దాడులు జరిగాయనడానికి ఆధారాలు లేవని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. కమీషన్ నివేదికపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ కమీషన్ నివేదిక ఇవ్వడానికి దాదాపు 12 ఏళ్ళ కాలం పట్టింది. అప్పట్లో సీఎం గా మోదీ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు.