పుతిన్ సేనకు చుక్కలు చూపించిన గ్రామస్తులు!

Sharing is Caring...

ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీప గ్రామాల  ప్రజలు  ప్రాణాలకు తెగించి తమ సేనలకు సాయం చేశారు. రష్యా దళాల ఖచ్చితమైన కదలికల సమాచారాన్ని ఉక్రెయిన్ సైన్యానికి  అందించారు. ఫలితంగా కీవ్  ను  ఆక్రమించుకొనేందుకు వచ్చిన  రష్యా సేనలకు హైవే-7 పై  తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది.

దీంతో  రష్యా సేనలు వెనుదిరిగాయి. పుతిన్ సేనకు అతి పెద్ద ఓటమి హైవే-7 పైనే ఎదురైంది.  
గ్రామస్తులు అత్యంత కీలకమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉక్రెయిన్ సైనికులకు చేరవేశారు. ఇందుకోసం వివిధ యాప్ లను, గూగుల్ మ్యాప్ లను ఉపయోగించుకున్నారు.  

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలకమైన పోరు జరిగిన ప్రదేశాల్లో హైవే-7 ఒకటి. ఇది రష్యా నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్  కు వెళుతుంది. ఈ మార్గంలోని గ్రామాల ప్రజలు  తమ తెలివి తేటలను ఉపయోగించి రష్యా దళాల కదలికలను ఎప్పటికప్పుడు కీవ్ సేనలకు అందజేశారు. దీంతో ఉక్రెయిన్ దళాలు ఖచ్చితంగా గురిచూసి రష్యా దళాలకు చుక్కలు చూపించాయి. అసలు ఏమి జరుగుతుందో అర్ధంకాక  రష్యా దళాలకు దిమ్మ తిరిగిపోయింది. 

బైకీవ్ అనే గ్రామంలో రష్యా దళాలు ఓ ఆస్పత్రిలో మందుగుండు, సాయుధ వాహనాలను ఉంచాయి. ఈ సమాచారం తెలుసుకొన్న ఉక్రెయిన్ దళాలు ఆ ఆసుపత్రిపై దాడి చేసి సమూలంగా ధ్వంసం చేశాయి. అసుపత్రి పోయిందన్న బాధ  గ్రామస్థుల్లో ఉన్నా.. రష్యన్ల ఆక్రమణ అడ్డుకున్నామని గ్రామస్థులు సంతోష పడ్డారు. 

రష్యా దళాలు కీవ్  ను  స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన సమయంలో భారీ కాన్వాయ్ లను తరలించాయి. వీటికి సంబంధించిన రేషన్,ఇంధనం వంటి వాటి సరఫరాకు హైవే-7ను ఎంచుకొంది. ఇది 230 మైళ్ల పొడవు ఉన్న పెద్ద రహదారి.  ఈ మార్గంలో ఉక్రెయిన్ దళాలు జరిపిన దాడులు రష్యా వెన్ను విరిచాయి.  రష్యా దళాలు కొంత  నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ అభాసుపాలయ్యారు. 

హైవే-7 పై కీవ్ శివార్లలోని బ్రోవరి అనే ప్రదేశంలో రష్యాకు చెందిన 90గార్డ్స్ ట్యాంక్ డివిజన్‌ను  ఉక్రెయిన్ సైనికులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక్కడ ఉక్రెయిన్ దళాలు యాంటీ ట్యాంక్ ఆయుధాలతో ముందు, వైనుక వైపు నుంచి విరుచుకుపడి ట్యాంకుల శ్రేణి మొత్తాన్ని ధ్వంసం చేశాయి. ఈ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్నాయి.

ఈ యుద్ధంలో టెట్యాన చొర్నోవోల్ అనే ఉక్రెయిన్ ప్రజాప్రతినిధి కూడా పాల్గొన్నాడు. ఈ దాడికి అవసరమైన ఇంటెలిజెన్స్ సమాచారం మొత్తం గ్రామస్థుల నుంచి వచ్చిందే. సాధారణ యాప్స్ నుంచే కీలక సమాచారం సేకరించారు. ఈ జాతీయ రహదారి వెంట ఉన్న చాలా గ్రామాలు రష్యా సేనల చేతిలోకి వెళ్లాయి. దీంతో ఉక్రెయిన్ సైనికులకు రష్యా దళాల కదలికలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందడం కష్టమైంది.

మరోపక్క సుమీ నగరం నుంచి బ్రోవరీకి వెళుతున్న దళాలు చెట్లల్లో దాగాయి.  దీంతో ఉక్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ట్రాన్స్పర్మేషన్ ఓ టెలిగ్రామ్ ఛానల్ ను ఏర్పాటు చేసి.. అందులో రష్యా దళాల కదలికలు చెప్పాలని ప్రజలను కోరింది. దీంతోపాటు కీవ్లో  పార్కింగ్ టికెట్లు జారీ, నీటి సరఫరా నిలిపివేత తెలియజేసేందుకు వాడే ఓ యాప్ లో మార్పులు చేసి రష్యా దళాల కదలికలను గ్రామస్థులు వెల్లడించేలా ఏర్పాటు చేశారు.

ఇలా సేకరించిన సమాచారాన్ని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ కు అందజేశారు. అక్కడ వివిధ మార్గాల్లో వారు సేకరించిన డేటాతో పోల్చి చూసి అంతా కరెక్ట్ అనుకున్నాకనే దాడులు చేశారు. ప్రజలకు గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ పిన్ చేయడం నేర్పడం కూడా  రష్యా  దళాల అనుపానులు చెప్పేందుకు ఉపయోగపడింది. అక్కడి ప్రజలు సమాచారం అందించాక.. సదరు డేటాను వెంటనే  డిలీట్ చేసేవారు. ఆ విధంగా  గ్రామస్తులు తమ దేశభక్తిని చాటుకున్నారు. రష్యా సేనలను తిప్పికొట్టారు. మూడురోజుల క్రితం ఈ ఘటన జరిగింది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!