ఆకట్టుకునే ‘విలేజి రాక్ స్టార్స్ !’

Sharing is Caring...

Pudota Sowreelu ………………………

VILLAGE ROCKSTARS.. అస్సామీ సినిమా ఇది. పల్లెటూరి పిల్లలు … వారి బాల్యం .. ఆడపిల్లలపై ఆంక్షలు ..స్వేచ్ఛ వంటి అంశాలపై అందరిని ఆకట్టుకునేలా ‘విలేజ్ రాక్ స్టార్స్’ సినిమాను రూపొందించారు.

సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ తీసిన ఈ సినిమా ఎన్నో అవార్డులు .. రివార్డులను కైవసం చేసుకుంది.దర్శకురాలు రీమాదాస్ తన స్వగ్రామమైన అస్సాం లోని చైగావ్ సమీపంలోని కలార్దియా గ్రామం వ్యక్తులనే  ఎంచుకుని ఈ సినిమాను నిర్మించడం గొప్ప విషయం.

ఇక కథ విషయానికొస్తే ……

పేదరాలైన,వితంతువు[బసంతి దాస్] తన 12 ఏళ్ల కొడుకు[మనబెంద్ర దాస్]10 ఏళ్ల కూతురు ధును[భనితా దాస్]తో తనకున్న కొద్దిపాటి పొలంలో వరిపండిస్తూ,మగ్గం మీద బట్టలు నేస్తూ జీవనం సాగిస్తుంటుంది. ఒక ఆవు,ఒక మేకను పెంచుతూ పిల్లలిద్దరిని వున్న దానిలో చక్కగా,క్రమశిక్షణ తో పెంచుతుంది.కూతుర్నిగూడా కొడుకు లాగే ఏ వివక్ష లేకుండా పెంచుతుంది. 

ఒకరోజు వూర్లో జరిగిన జాతర సందర్భంగా ఏర్పాటు చేయబడిన పాటకచ్చేరిలో,ఆ ట్రూప్ వారు పాడిన పాటలు,వారి వాయిద్యాలు ధును ని ఎంతో ఆకర్షిస్తాయి. తను గూడా వారి లాగా పాటలు పాడాలని, గిటార్ వాయించాలని, ఎలాగైనా ఒక గిటార్ కొనుక్కోవాలని ఆశ పడుతుంది.

ధును ఎప్పుడూ వాళ్ళ అన్నతో పాటే వుండే మగపిల్లలతోనే తిరుగుతూ వుంటుంది.వాళ్ళతోనే స్నేహం చేస్తుంది.వాళ్ళతోనే కలిసి బడికి వెళ్ళటం,ఆటలు ఆడటం ,చెట్లు ఎక్కడం ,కాయలు కోయటం,ఈత కొట్టటం,చేపలు పట్టటం,గడ్డి కోయటం,మేకని,ఆవుని మేపటం,ఇవన్నీ మగపిల్లలతో సమానంగా చేస్తుంది.

వూర్లో ఆడవాళ్ళు ధునుని కోప్పడుతూ ‘ఎప్పుడూ మగపిల్లలతో ఏమిటాటలు. పెద్దదానివి  అవుతున్నావు.. సిగ్గులేదా.?ఆడపిల్ల లతో కలిసి ఆడుకో’’అని బెదిరిస్తారు.ఏడుస్తున్న ధునుని తల్లి ఓదారుస్తూ నువ్వు చేసే పనిలో తప్పు లేదు అని చెబుతుంది. పైగా తన కూతురుని తప్పు పట్టిన ఆడవాళ్ళనే తిడుతుంది.నాకు లేని అభ్యంతరం మీకెందుకు.? అని వాళ్ళను ప్రశ్నిస్తుంది.

నీ తండ్రి ఈత రాకనే బ్రహ్మపుత్రానది కొచ్చిన వరదల్లో కొట్టుకుపోయాడు అని కూతురు ధునుకి తనే దగ్గరుండి ఈత నేర్పిస్తుంది.ధును మనసంతా ఎప్పుడూ గిటార్ మీదనే వుంటుంది.ధర్మాకోల్ తో గిటార్ తయారుచేసి,దానికి మెరుపు కాగితాలు అంటించి,అందంగా తయారుచేసి,దాన్ని వాయిస్తూ,పాటలు పాడుతూ,డాన్స్ చేస్తూ వుంటుంది.

తన జట్టు మగపిల్లలతో కలిసి ధర్మాకోల్ తో గిటార్లు,కీబోర్డు,తబలాలు,మైక్ లు తయారుచేసుకుని,విలేజ్ రాక్ బ్యాండ్ పేరుతో పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ వుంటారు.నాకు ఈ సందర్భంగా ఎప్పుడో ఎవరో,పేస్ బుక్ లో పంపిన ఒక వీడియో గుర్తొచ్చింది.పల్లెపిల్లలు తాటిమట్టలు తంబురగా,కట్టెమొద్దులు,రాళ్ళు తబలాలుగా పుల్లలు వయోలెన్ గా చేసుకుని చక్కని సంగీత కచ్చేరిలో అద్భుతంగా నటించారు.

ఒకరోజు ధును,భాస్కర్ అనే అబ్బాయిని పడవమీద తీసుకుని వెళ్ళి నది వరదల్లో కొట్టుకు పోయిన ఒక ఆదివాసీల ఇల్లు చూపిస్తుంది.ఇంటికొచ్చిన ధునుని తల్లి కట్టె తీసుకుని విపరీతంగా కొడుతుంది.పిల్లల్ని ఎంతో ప్రేమించే తల్లి గూడా పిల్లల్ని సరైన దారిలో పెట్టటం కోసం దండన తప్పదు అనుకుంటుంది.ఇక్కడ పక్కింటి పిల్లాడికి ఏమన్నా జరిగుంటే అనే ఊహే అలా చేయిస్తుంది.దాదాపు ప్రతి తల్లిదండ్రులు ఇలాంటి సమస్యని ఎదుర్కొనే వుంటారు.

దాన్నిక్కడ బాగా చూపించారు.ధును గిటార్ కోరిక తీర్చాలని తల్లి ఒకసారి సెకండ్ హ్యాండ్ షాప్ లో కనుక్కుంటుంది.ఆ గిటార్ ధర విన్న తల్లి పిల్లల కడుపు నింపటమే పెద్దసమస్యగా వున్నపుడు దీన్ని నేను కొనిపెట్టగలనా అని బాధపడుతుంది.ఆ వూర్లో పిల్లలకు ఎప్పుడూ కతలు చెప్పే తాత,మీకు ఎదైనా కావాలని బలమైన కోరిక వుంటే దానికోసం కష్టపడాలి.

అప్పుడు దైవం గూడా అనుకూలిస్తాడు అని చెబుతాడు.ఆ మాటలు విన్న ధును డబ్బు సంపాదించటం కోసం చాలా కష్టమైన పనులు గూడా ఇష్టంగా చేస్తుంది.పోకచెట్లు ఎక్కి కాయలు కోయటం, వంటి పనులు చేసి పైసా,పైసా కూడబెట్టి తల్లికి ఇస్తుంది.

ఇలా ప్రకృతిలో హాయిగా,గడుపుతున్న ధును ఒకరోజు’పెద్దమనిషి’అవుతుంది.ఆడవాళ్ళంతా కలిసి వాళ్ళ సంప్రదాయం ప్రకారం ధునుని అలంకరించి  పూజలు,విందులు చేస్తారు.సంప్రదాయ గీతాలు పాడుతూ,మంగళ హారతిచ్చి,ఇకనుండి నువ్వు ఎట్టి పరిస్తితుల్లో మగపిల్లలతో తిరగకూడదు అని హెచ్చరిస్తారు.

ఆ రోజునుండి లేడిపిల్లలా ఎగిరే ధను,వంటింటి కుందేలు పిల్లలా మారిపోతుంది.కూతురులోని స్తబ్ధత,విచారం గమనించిన తల్లి,పట్నం వెళ్ళి గిటార్ కొని తెస్తుంది.గిటార్ చేతిలో పెట్టగానే ధును దాన్ని మీటుతూ,డాన్స్ చేస్తూ,తన చుట్టూ చేరిన చిన్నపిల్లలతో కలిసి పాడుతూ సంతోష పడుతుంది.

ఈ సినిమాలో డైరెక్టర్ రీమాదాస్ ప్రకృతిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు .ఆ చేల వెంట,అస్సాంలో తరచుగా వచ్చే వానల్లో పిల్లల ఆట,పాట లు,పోకచెట్లు,బ్రహ్మపుత్రానది బ్యాక్ వాటర్స్… అందులో పడవ ప్రయాణాలు,వరదలు,అస్సామీ వస్త్రధారణ,వారీ సంప్రదాయ గీతాలు చక్కగా చూపించారు.ఈ సినిమా NETFLIX లో సబ్ టైటిల్స్ తో వుంది. 

ఈ సినిమాకి కథ,సినిమాటోగ్రఫీ,దర్శకత్వం రీమా దాస్.  2017 సెప్టెంబర్ 9 న విడుదలైన ఈ సినిమా పలు అవార్డులను సొంతం చేసుకుంది.2018లో ఉత్తమ పిల్లల చిత్రంగా ఎన్నికై ‘స్వర్ణకమలం’పొందింది.  2017 లో టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ప్రదర్శితమైంది..మన దేశం నుండి ఆస్కార్ పోటీలకు వెళ్ళింది..సినిమా నిడివి ఒక గంట 17 నిమిషాలు. 

ఈ లింక్ పై కూడా చూడవచ్చు https://www.facebook.com/watch/?v=535399598289962

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!