భాషావేత్త, భాష్యకారుడు – చేరా ! (2)

Sharing is Caring...

Taadi Prakash………………………………………………… 

Versatile literary personality———————————————

ఉదయం డైలీ జోరు. సాయంత్రమైతే వరవరరావు గారొచ్చి చౌరస్తాలో పేవ్ మెంట్ మీద ఒంటరి టీకొట్టు బయట బండరాయి మీద కూచునేవాడు. పనులు వదిలి పరిగెత్తుకుంటూ వెళ్తే కబుర్లు. సాయంత్రం చేరా. రామ్ నగర్ మురికి ఫ్లాట్లో పిల్లకవి రూమ్ లో చేరేవాళ్లం.

కిరసనాయిల్ స్టౌ మీద ఖాదర్ బిరియానీ వంట. ప్రిలిమ్స్ పక్కన త్రిపురనేని శ్రీనివాసూ, గుడిహాళం రఘునాథం లాంటి మందంతా జేరి ఉద్రేకపడిపోయీ, ఊగిపోయీ ఆ రాతకోతలేంటి, ఆ ముష్టి కవిత్వంలో ఏదో ఎక్కడో ఉందంటూ పొగడ్తలేంటీ అంటూ చేరా మీద ముక్కుల్లోంచి, చెపుల్లోంచి నిప్పులు కురిపించేవారు. ఆడపిల్ల రాసిందంటే అద్భుతమనేడమేనా? వెనకాముందూ లేదా? కవిత్వమనేదొకటుంటుంది గదా! అని ఆయన్ని కైమా కొట్టేవారు.

చిన్నగా నవ్వేవాడు. ‘కోపం బెరుంగడు’. తాపీగా తన పాయింట్ చెప్పేవాడు. చాలా రీజనబుల్ గా ఉండేది. అయినా సరే ‘వుయ్ డిఫర్ విత్ యు’ అని ఠలాయించేవాళ్లు. ‘ఐ బెగ్ యు డిఫర్ విత్ మీ’ అని నవ్వేవాడు. అందరూ ఆయన్ని కమ్యూనిస్టంటారు గాని నిజంగా ఆయన లిబరల్ డెమోక్రాట్. నిజమైన రిపబ్లికన్ అనిపిస్తుంది. లేకపోతే మంచి యాంటీ కమ్యూనిస్టులైన నండూరి లాంటి వారు ఆయన్ని అంతగా ప్రేమించరు.మళ్లీ ఆ కాలం గురించి.. ఆకుచెప్పులేసుకుని, చిరిగిన జుబ్బా, చంకలో వ్యాసాల కట్ట పెట్టుకుని బాలగోపాల్ వచ్చేవాడు.

పలకరించడానికి ఎన్ని కితకితలు పెట్టినా అన్నీ మోనో సిలబుల్స్ లోనే సమాధానాలు. పలుకే బంగారం. సాయంత్రం క్రాస్ రోడ్స్ లో రెగ్యులర్ జాయింట్స్ కి పతంజలీ, శివాజీ, దేవీప్రియ, నేనూ, విఫలమైన కవి సబ్ ఎడిటర్లూ కలిసి వెళ్తే ఒక క్యూబికల్లో బూదరాజు రాధాకృష్ణ, పక్కన జ్యోతి మంత్లీ ఎడిటర్ గోపీతో హరిపురుషోత్తమరావు అప్పుడప్పుడు స్మైల్ గారు. ఏవో కొంపలు మునిగిపోయినట్టు ‘ఇప్పుడూ భద్రిరాజు కృష్ణమూర్తి చెప్పిందేమిటి? నోమ్ చామ్స్ కీ రాసిందానికీ, దీనికీ తేడాని ఎలా చూడాలోయ్’ అంటూ చర్చ. స్టాలిన్ భాషాశాస్త్రం గురించి రచ్చ కూడా.

క్రాస్ రోడ్స్ నుంచి కాస్త దూరం జరిగితే రాంభట్ల కృష్ణమూర్తి, ‘ఏం ఫ్రెండూ’ అంటూ బ్రాండెడ్ పలకరింపు. బుల్ ఫిన్స్ మైథాలజీలోనే ఈడిపస్ కాంప్లెక్స్ ఉంది. దాన్ని ఫ్రాయిడే కనిపెట్టాడనుకోడం రాంగ్. అస్సీరియా మెసపుటోమియా కల్చర్స్ చూస్తే అసలు సంగతి తెలుస్తుందని నాన్ స్టాప్ లెక్చర్స్. కాసేపయితే గజ్జెల మల్లారెడ్డి, తెలుగునాట భక్తిరసంవట్టికే రాయలేదు అని మొదలెట్టి నాన్ స్టాప్ జోకులేసి నవ్వించడం. ‘ఈనాడు’ పేపర్ నుంచి రాచమల్లు రామచంద్రారెడ్డిగారొస్తే ‘సంవేదన’ నుంచి ‘అనువాద సమస్యల’ వరకూ ఎన్ని ప్రశ్నలు కురిపించినా ముక్తసరే మరి.

క్రాస్ రోడ్స్ ఏ.ఆర్. క్రిష్ణ ఇంటికి పతంజలీ, నేనూ వెళ్తే అక్కడ రావిశాస్త్రితో పార్టీ. చేరాతో పాటూ ఎప్పుడూ వీళ్లందర్నీ కలవడం మామూలు వ్యవహారంగా ఉండేది. పెద్ద విశేషంగా ఫీలయ్యే వాళ్లం కాదు. చేరా అంటే ఎప్పుడూ కలిసే మనిషే కదా అనిపించేది. స్మృతి కిణాంకానికీ రింఛోళికీ కవర్ బొమ్మలేయడం, వెనక మాటలు రాయడం రోజువారీ పనిలాగా అనిపించేది. ఆయన ఇంటికెళ్లడం, ఆవిడ అన్నం పెడితే తినడంలో ఏదో గొప్ప కనిపించేది కాదు. ఒకసారి మరో పుస్తకం అట్టబొమ్మ కోసం వచ్చి ఆయన నాకు స్క్రిప్ట్ ఇచ్చారు.

ఎదురుగా ఉన్న కవిని ఇతను కె. రాజేశ్వరరావు అని పరిచయం చేశాను. విష్ చేశాడు. ఈ పుస్తకం ప్రూఫ్ రీడింగ్ తలనెప్పిగా ఉందన్నాడు. కె.రా. బాగా చూడగలడని చెప్పా. ఓ గంట మా కబుర్ల తర్వాత కె.రా. కొన్ని పేజీలు చూపించి, ఈ పద్యాల్లో గణ విభజన తప్పిందన్నాడు. ఆయన చూసి వెంటనే నిజమేనన్నాడు. మీరు ఇలా చూడకపోతే అచ్చయి బయటికెళ్తే పరువు పోయే దన్నాడు.చాలాకాలం తర్వాత మళ్లీ నా స్టూడియోలో మా మీట్. పాబ్లో నెరూడా దీర్ఘ కవితకి కె.రా. అనువాదానికి బొమ్మలేస్తున్నా.

ఏమిటవి? అంటే చెప్పా. ముందుమాట కూడా రాస్తున్నానన్నా. వెంటనే ఆయన ‘నాకూ చాన్స్ ఉంటే కొన్ని మాటలు రాస్తా. వీలుంటేనే’ అని ఆఫర్ చేశాడు. నాచన సోముడూ, శ్రీనాథుడూ, మయకోవ్స్ కీ, నెరుడా అంటూ అందర్నీ అప్పజెప్పే ధారణ శక్తిగల వాళ్లిక పుట్టరు. అంతా కొత్తతరం వస్తోంది. వీళ్లకీ విషయాలు తెలీవని బెంగపడ్డాడు. తర్వాత రాసిచ్చాడు కూడా.

గొప్ప మోడెస్టీ, బోలెడు లిబరలిజం. ఎదుటి అభిప్రాయం ఎంత దుర్మార్గంగా ఉన్నా నిజంగా సహించే భరించే రూసో. మళ్లీ మానవ హక్కులన్నా, ఖైదీల విడుదల కోసమైనా కమిటీల్లో ఉండి సభలకొచ్చే కమిట్ మెంట్. అరుదైన కాంబినేషన్.ముందు చెప్పిన స్వర్ణయుగం పేర్లలాగే మాష్టారు పేరూ చెప్పుకుంటాం. తెలుగు భాషా, కవిత, వచనం అన్నీ కూడబలుక్కుని ఆయన గురించి బెంగపడతాయి. మేస్టారూ… మేం కూడా నిజంగా మిస్సింగ్ యూ!

Pl. Read it also …………. భాషావేత్త, భాష్యకారుడు – చేరా ! (1)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!