భాషావేత్త, భాష్యకారుడు – చేరా ! (1)

Sharing is Caring...

Taadi Prakash………………………………………………… 

Versatile literary personality———————————————

చేకూరి రామారావు గారు ఆర్టిస్ట్ మోహన్ దగ్గరికి వస్తుండేవారు. తీరిగ్గా కూర్చుని కబుర్లు చెబుతూ, పుస్తకాలకి కవర్ పేజీ బొమ్మలు వేయించుకునేవారు. ఇద్దరూ వెటకారాలు పోతూ తెగ జోకులు వేసుకునేవారు. ‘స్మృతి కిణాంకం’ పుస్తకానికి మోహన్ బొమ్మ వేస్తున్నపుడు, “ముందుమాట కూడా రాయరాదూ” అన్నారు చేరా. “మీ భాషా పుస్తకాలకి నేనేం రాయగలను, వద్దులెండి” అన్నాడు మోహన్. ఆయన మళ్లీ అడిగారు.

ఒక పెద్ద పేరా రాసిచ్చాడు మోహన్. వెనక అట్ట మీద దాన్ని అచ్చేశారు. చేరా గారు చనిపోయాక, అమెరికా నుంచి పిల్లలు రావాలని, నాలుగైదు రోజుల తర్వాత అంత్యక్రియలు జరిపారు. మోహన్ తో పాటు ఆర్టిస్ట్ మోషే డయాన్, ఉషాజ్యోతి బంధం, ముక్కామల చక్రధర్, నేనూ వెళ్ళాం. అంతకు ముందురోజే చేరాని గుర్తుచేసుకుంటూ మోహన్ రాసిన వ్యాసం ‘సాక్షి’లో వచ్చింది.

అంత్యక్రియలకు చాలామంది ప్రముఖులు వచ్చారు. కుప్పిలి పద్మ అయితే ఏడుస్తూనే వుంది. ఆ గుంపులోంచి ఒక బట్టతలాయన మోహన్ దగ్గరికి వచ్చి ‘నమస్కారమండీ’ అన్నాడు. చేరా గురించి చాలా గొప్పగా రాశారు. మీతో అలా రాయించుకోడం కోసమన్నా ఎర్లీగానే చనిపోతే బావున్ననిపిస్తోంది” అన్నారు. వాళ్లు నవ్వుకున్నారు. ఆయన వెళిపోయాక, ‘ఎవరాయన?’ అని మోహన్ని అడిగాను.

“అయ్యో, కవి ఎండ్లూరి సుధాకర్ గారు” అని చెప్పాడు. ముందు చేరా కోసం మోహన్ రాసిన వెనక మాట, తర్వాత ‘సాక్షి’లో రాసిన స్మృతి వ్యాసం చదవండి. చేరా బొమ్మ ఎంతో ముచ్చటగా, cuteగా వేశాడు మోహన్.

*** *** ***

చేరా మాస్టారితో ప్రయాణం. పదండి. ఖమ్మం జిల్లా మధిరకు అల్లంత దూరాన ఇల్లిందలపాడు. ఏటి ఒడ్డున మామిడి, జామ తోటల్లో దొంగతనాలు. గుంటూరు జిల్లా సిరిపురంలో ఉర్దూ అలీఫ్, బే లు వల్లెవేయటం. తెనాలిలో గాంధీజీని చూడ్డం. నరసరావుపేటలో ఎర్రజెండాలు, కవులు, పండితులతో పరిచయాలు. అటు తిరిగితే అమెరికా. మేడిసన్ నగరంలో మెండోటా సరస్తీరం వెంట రాలే మేపుల్ చెట్ల ఆకుల మీద నడక.

జెరల్డ్ కెలీ గారి ఔదార్యం. గుడ్డివాడైన భాషా శాస్త్రవేత్త రాడ్నీ మోగ్ పట్టుదల. ఆస్టిన్ నగరంలో వానకురిసి వాగులు పొంగడం, మరోచోట మంచు పింజెల వాన – పంచరంగుల అనుభవాలు.చిన్ననాటి ఆత్మీయమైన జ్ఞాపకాల నుంచి, ప్రముఖ రచయితలు, కవిపండితులు సాహితీ శిఖరాలెక్కినపుడు ఉల్లాసంతో రాయగా ఎందరెందరో తెలుగు సాహితీవేత్తల సృజనను స్పృశించి మనకందిస్తారు.

గురువులు, మిత్రులు ఒక్కొరొక్కరే వదిలి పోయినపుడు ఉద్వేగంతో చెప్పిన మాటలకు కళ్లు చెమరుస్తాయి.  జ్ఞాపకాల పేరుతో రాసిన ఈ వ్యాసాల్లో నేను అనేమాట ఎన్నిసార్లు కనిపించినా అదెవరి గురించో, వారి సాహిత్య కృషి గురించో తప్ప ఇందులో ‘నేను’ లేనే లేదు. శ్రీశ్రీ, ఎ.కె. రామానుజన్, రా.రా.. రమేష్, నాయని, నండూరి, వరద, కె.వి.ఆర్, బొమ్మకంటి, ధర్మారావు, పురాణం, దొణప్ప, పఠాభి, ఆరుద్ర, బేతవోలు రామబ్రహ్మం ఎన్ని పేర్లని చెప్పాలి. 

కుప్పలు తెప్పల అనుభవాలన్నిటిలో దారం లాగా, తెలుగుభాషా, కవితలను అనుభవించి పలవరించే ఆరాటం సాగుతుంది. చిన్నచిన్న సరదాలు, కష్టాలూ కన్నీళ్ల కలనేత లోంచి యాభై ఏళ్ల తెలుగు సాహిత్యంలోకి ప్రయాణమిది. చేరా మేస్టారు గైడ్.

మేస్టారూ… మిస్సింగ్ యూ…
Artist Mohan’s tribute to Chera

స్మృతి కిణాంకం అంటే? సాహిత్య కిర్మీరం అనగా? సాహిత్య వ్యాస రించోళి- ఇది తెలుగా, పాళీ భాషా, ఫ్రెంచా? అని ఇంటలెక్చువల్ క్యూరియాసిటీతో రగిలిపోవడం కాదు. చదువులేక, చదువు రాక అడగడం. అది కూడా ఆ పుస్తకాలకి అట్ట మీద బొమ్మలెయ్యాలి గనక, చేరా మేస్టారు చీప్ గా చూసేవాడు కాదు. ఓపిగ్గా అర్థాలు, వివరాలు చెప్పేవాడు.

విశాలాంధ్ర ఎడిటర్ రాఘవాచారి గారి జోకొకటుంది. మనిషికి ఒకటే ఆప్షన్, చదవడమో లేక రాయడమో. చదువెలాగూ లేదు గనక రాయక తప్పేదేముంది మరి. ఇది మనలాంటి టాలా టోలీ జర్నోలితరతి వ్యవహారం.కానీ మేస్టారి సంగతి అలా కాదు. ఎంతగానో చదివి అంతగానూ రాశాడు.  ఆయనకున్న ఆప్షన్ అదీ.

చేరాతలు పుస్తకానికి నండూరి రామ్మోహనరావు గారు ముందుమాట రాశారు.1980-90ల కాలం తెలుగు వచన కవితకు స్వర్ణయుగమన్నారు. అప్పుడు మాకా విషయం తెలీదు. కాని అప్పుడు మేం అనుభవించింది వేరే స్వర్ణయుగం అని కూడా తెలియదు. ఇప్పుడనిపిస్తోంది. ఆ రోజులూ మనుషులూ.. కబుర్లూ, వారితో బాతాఖానీలూ.

PL. Read it also ……………. భాషావేత్త, భాష్యకారుడు – చేరా ! (2)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!