Mohammed Rafee ……..
ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టెది ఇంకో దారి అంటారు! ఈయన అలాంటోడే! అందుకే నాకు నచ్చేస్తాడు! సినిమా వాళ్ళలా పైపైన నటించడు! తనను తాను మోసం చేసుకోడు! భయపడకుండా మాట్లాడతాడు! మనసులో ఏది ఉంటే అది అలా చెప్పేస్తుంటాడు!
ఏ విషయాన్ని అయినా వేరే కోణంలో ఆలోచిస్తాడు! ఆ కోణం మన అంచనాలకు అందదు! అందుకే “ఎబ్బే” అనుకుంటాం! అదే అతని సృజనాత్మకత! అందుకే అతనితో జర్నీ ఎవరికైనా చాలా కష్టం! ఇవాళ రాంగోపాల్ వర్మ పుట్టినరోజు… కాసిన్ని కబుర్లు!
వర్మను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు! తెలుగు సినిమా చరిత్రను మార్చిన దర్శకుడు! తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే శివ సినిమా ముందు ఆతరువాత అనే మాట్లాడుకోవాలి! అది నాగార్జునకే గొప్ప మలుపులాంటి సినిమా! దర్శకుడుగా వర్మ సంచలనం సృష్టించిన సినిమా. యువతను కట్టిపడేసిన సినిమా శివ!
వర్మ రాసిన “నా ఇష్టం” పుస్తకం చదివితే ఆయన తత్వం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు! కానీ, ఒక పట్టానా అర్ధం కాడు! ఆర్జీవి అర్ధం కావడం అంత వీజీ కాదు! క్షణ క్షణం, గాయం, గోవిందా గోవిందా, సర్కార్, సత్య, రంగీలా … ఇలా ఎన్నో ఆణిముత్యాల్లాంటి అద్భుత సినిమాలు తీసిన దర్శకుడు ఆర్జీవి! జెడి చక్రవర్తితో తీసిన అనగనగా ఒక రోజు ఎంత బావుంటుంది!
1993లో మనీ సినిమా వచ్చింది, ఆ తరువాత మనీ మనీ ఇచ్చాడు! దెయ్యం, ప్రేమకథ కూడా సరిగా ఆడకపోయినా అద్భుత చిత్రాలే! బాలీవుడ్ లో సంజయ్ దత్ తో తీసిన దౌడ్ సినిమా చూస్తుంటే వర్మ రచనా శైలి కళ్ళకు కడుతుంది! ఆ సినిమా చాలా సార్లు చూశాను!
అనురాగ్ కశ్యప్, కృష్ణవంశీ, మధుర్ బండార్కర్, పూరీ జగన్నాధ్, శివ నాగేశ్వరరావు, నివాస్ ఇలా పేరు తెచ్చుకున్న దర్శకులు చాలా మంది వర్మ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన వాళ్లే! ఎందరినో ఇండస్ట్రీలో స్థిర పడేలా చేసిన సృజనాత్మక శక్తి వర్మ!
వర్మకు ఈ ప్రపంచంలో నాలుగే ఇష్టం! ఒకటి కాఫీ, రెండు వోడ్కా, మూడు మనీ, నాలుగు అందమైన మగువ! అతను పక్కా నాంపల్లి కుర్రాడు! అక్కడే పుట్టి అమీర్ పేట్ న్యూ సైన్స్ కాలేజ్ లో ఇంటర్ చదివి, బెజవాడ సిద్ధార్ధ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తాజ్ కృష్ణ లో కొన్నాళ్ళు ఉద్యోగం చేసి వదిలేసాడు! డబ్బు సంపాదించాలని అమీర్ పేట్ లో అప్పట్లో సినిమా వీడియోల లైబ్రరీ పెట్టాడు!
అప్పట్లో వీడియో కేసట్లు అద్దె కు తీసుకుని వెళ్ళి ఇంట్లో టివిలో సినిమా చూడటం క్రెజ్! ఆ ఊపులోనే జనం నాడి పట్టుకున్నాడు! ఏ సినిమా జనానికి ఎక్కుతుందో తెలుసుకున్నాడు. కొన్నాళ్ళు అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా పని చేశాడు. క్రైం థిల్లర్ మూవీ శివను క్యాచ్ చేశాడు!
ఇక అతడ్ని పట్టుకోవడం కష్టమైపోయింది! మంచి ట్రెండింగ్ లో వున్నపుడు బాలీవుడ్ చెక్కేసాడు!దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా ఎడా పెడా సంపాదించడమే లక్ష్యంగా పని చేశాడు!
అతనిలో బాగా నచ్చింది ఏమిటంటే… వాళ్ళేం అనుకుంటారో, వీళ్ళేం అనుకుంటారో అని అతనికి పట్టదు! అసలు పట్టించుకోడు!
అందుకే భార్య రత్న విడాకులు తీసుకున్నారు. కుమార్తె మంచి నృత్య కళాకారిణిగా గుర్తింపు పొందారు. అతను 2015లో రాసిన గన్స్ అండ్ థైస్ : ది స్టోరీ ఆఫ్ మై లైఫ్… ప్రతి ఒక్కరూ చదవాల్సిన వర్మ ఆత్మ కథ అది! సినిమా సక్సెస్ లు, ఫెయిల్యూర్స్, సుచిత్ర కృష్ణమూర్తితో సహ జీవనం, వివాదాలు ఇబ్బందులతో పాటు భారతీయ సినిమా జీవన చిత్రణ అర్ధం అవుతుంది!
బ్రూస్ లీ, అమితాబ్ బచ్చన్, ఊర్మిళ కు ఆ పుస్తకాన్ని అంకితం చేయడం విశేషం! అంతకు ముందు 2010లో రాసిన నా ఇష్టం, ఆ తరువాత వోడ్కా విత్ వర్మ జీవిత చరిత్ర పుస్తకాలు కూడా కొత్తగా సినిమా రంగంలోకి వచ్చిన వారు, రావాలనుకుంటున్న వారు చదివి తీరాలి!
వివాదాల్లో ఉండటం ఎవ్వరికి ఇష్టం ఉండదు! కానీ సినిమా ఇండస్ట్రీ లో వున్నప్పుడు కొన్ని అనివార్యం అని వర్మ వార్తల్లోనే ఉంటారు! అదేదో నాగార్జున సినిమా “అన్న నడచి వస్తే మాస్, అన్న ప్యాంట్ వేస్తే మాస్” అనే పాట వర్మకు బాగా సెట్ అవుతుంది! మీడియా వాళ్ళు వర్మ ఇంటర్వ్యూ కోసం ఆశగా ఎదురు చూస్తారు!
ఎందుకంటే ఆయన్ని ఎంత మంది తిడుతుంటారో అంతకన్నా కొన్ని రెట్లు ఎక్కువ మంది ఆయనేం మాట్లాడతారో అని అసాంతం చూస్తారట! ఆయన స్టూడియోలో అడుగు పెడితే ఛానెల్ రేటింగ్ జామ్మంటూ పెరిగిపోతుందట! ఇదొక సెంటిమెంట్!
అతను ముఖ్యమంత్రిని కలిస్తే ఒక వార్త ! ఒక స్టేట్ మెంట్ ఇస్తే ఒక వివాదం! ఏది ఏమైనా అతను ఎప్పుడూ నిత్య సంచలనం! ఇండస్ట్రీలో ఎంతో మంది వచ్చారు! సంచలనాలు సృష్టించారు! కనుమరుగైపోయారు! కానీ వర్మ అలా కాదు! సినిమా వున్నా లేకున్నా ఆయన మాత్రం ఎప్పుడూ వార్తల్లో మెరుస్తూనే ఉంటారు! అది అతని స్టయిల్! అదే అతని ప్రత్యేకత! ఆర్జీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

