Investigations ……………………………………………
పోలాండ్ లో ఆడ వ్యాంపైర్ (రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి తవ్వకాల్లో బయటపడింది. యూరప్ దేశం పోలాండ్ లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ గ్రామంలోని శ్మశానానికి పక్కనే ఉన్న ప్రదేశంలో ఈ వ్యాంపైర్ సమాధిని గుర్తించారు.
టోరన్ లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. బయట పడిన అస్థిపంజరం 17వ శతాబ్దానికి చెందిన ఒక యువతిదిగా నిర్ధారించారు. మెడ చుట్టూ కొడవలి పెట్టి, ఆమె ఎడమ పాదం బొటనవేలుకి తాళం వేసి ఉంది. అస్తిపంజరాన్ని బట్టి ఆ యువతి బాగా పొడవైనది అని చెప్పుకోవచ్చు
ఆగష్టులోనే ఈ అస్థికలు బయటపడ్డప్పటికీ.. కొంత ఆలస్యంగా ఈ అస్థిపంజరం కి సంబంధించిన డాక్యుమెంటరీ, ఫొటోలు బయటపెట్టారు.వ్యాంపైర్ అంటే.. కోరల్లాంటి పళ్లతో రక్తం పీల్చి బతికే పిశాచి. పగలు సాధారణం రూపం లేదంటే అసలు కనిపించకుండా తిరుగుతూ.. రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ మనుష్యులను వేటాడుతుంది.
మెడపై వ్యాంపైర్ గనుక కొరికితే.. అవతలి వాళ్లూ వ్యాంపైర్లుగా మారిపోతారని, లేదంటే ఎముకల గూడుగా మిగిలిపోతారని.. చాలా కథల్లో, సినిమాల్లో విని కనీ ఉంటాం. ఈ వ్యాంపైర్ ఉనికి, మనుగడ అనేది ఇప్పటిదాకా కేవలం జానపద కథల్లో ఫిక్షన్ క్యారెక్టర్ గానే ప్రచారంలో ఉంది. చాలామందికి అదొక నమ్మకంగానే మిగిలిపోయింది.
పరిశోధకులు ఏమన్నారంటే.. 17వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రపంచంలో మూఢనమ్మకాలు తారాస్థాయిలో ఉండేవి. బహుశా.. ఆ యువతిని వాంపైర్ గా అనుమానించి అంత ఘోరంగా చంపేసి ఉంటారు. ఆమెను వ్యాంపైర్ గా భావించి.. ఎక్కడ సమాధి నుంచి లేచి వస్తుందో అనే భయంతో మెడలో కొడవలిని అలాగే ఉంచేశారు. ఒకవేళ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే.. తల తెగిపోతుందని అలా చేసి ఉంటారు.
అలాగే ఆమె పాదానికి తాళం కూడా వేశారు. ఆరోజుల్లో మూఢనమ్మకాలు అలా ఉండేవి” అని చెబుతున్నారు.ఈ పరిశోధనకు ప్రొఫెసర్ డారియుక్గా పోలిన్ స్కి నేతృత్వం వహించారు.తమ పరిశోధన ఇంతటితో ఆగదని … ముందుకు వెళ్తుందని అంటున్నారు.
గతంలో యూరప్ తూర్పు ప్రాంతంలోనూ ఈ తరహా సమాధులు చాలానే బయటపడ్డాయి. వాటిలో చాలావరకు పైన చెప్పుకున్న విధంగాపెట్టారు. అయితే తల, కాళ్లు, చేతులు, పక్కకు తిప్పేసి ఉండడం, లేదంటే తల పూర్తిగా ధ్వంసమై ఉండడం లాంటి పరిస్థితుల్లో ఆ అస్థిపంజరాలు బయట పడ్డాయి.
ముందు ముందు మరెన్ని విశేషాలు వెలుగులోకి వస్తాయో చూద్దాం. కాగా యునైటెడ్ స్టేట్స్‌లోని సౌత్ అలబామా విశ్వవిద్యాలయానికి చెందిన లెస్లీ గ్రెగోరికా నేతృత్వంలోని పురావస్తు శాస్త్రవేత్తలు 2014లో వాయువ్య పోలాండ్‌లోని ఒక శ్మశానవాటికలో ఆరు పిశాచ అస్థిపంజరాలను కనుగొన్నారని సమాచారం.