ఆ అందాలు చూసేందుకు రెండు కళ్ళూ చాలవు !

Sharing is Caring...

Wonderful sculpture…………………………………………………

శిలలపై శిల్పాలు చెక్కినారు… మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు…  అంటూ  కవి రాసిన మాట  అక్షర సత్యం. ఆనాటి శిల్పనిర్మాణాలు రాజుల కీర్తిని , పరిపాలనా తీరు తెన్నులను తెలియ జేస్తూ చరిత్రకుకు ఆనవాళ్లుగా నిలిచిపోయాయి. 

జీవితంలో ఒక్కసారైనా చూసి రాదగిన సందర్శనీయ స్థలాల్లో ఎల్లోరా గుహలు ముఖ్యమైనవి.షిర్డీ యాత్ర కు వెళ్ళేవారు అక్కడికి దగ్గర్లో ఉన్నఅజంతా, ఎల్లోరా గుహలు చూసి రావచ్చు.ఈ ఎల్లోరా గుహలలో వున్న కైలాసనాథ్ దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం.దీని నిర్మాణం అద్భుతం.. అపూర్వం ..1200 ఏళ్ళ క్రితం దీన్ని నిర్మించారు.

ఈ ఆలయ నిర్మాణానికి   దాదాపు 150 సంవత్సరాలు పట్టిందంటారు. దాదాపు ఏడువేల మంది శిల్పులు, కార్మికులు రెండు మూడు తరాలుగా ఈ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్నట్లు చెబుతారు. రాష్ట్రకూటులకు చెందిన రాజు  శ్రీకృష్ణ(1)కు కైలాసనాథ్ దేవాలయం నిర్మించిన ఖ్యాతి దక్కింది.

ఈ ఆలయం 60వేల చదరపు అడుగుల విస్తీర్లంలో వుంది. ఈ గుహాలయం అంతటా రామాయణ, భారత, భాగవత గాధలను శిల్పాలుగా చెక్కారు. ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికీ చెరిగి పోకుండా వుంది.

ఈ గుహలలో  మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి. ఈ ఎల్లోరా గుహల్లో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహలోని అద్భుత శిల్పకళ పర్యాటకులను ఆకట్టుకుంటుంది..ఇందులో బుద్ధుడి ప్రతిమలు, బోధిసత్వుని మూర్తులున్నాయి. దీని పైకప్పు పెద్ద స్థంభాలపై ఆధారపడి ఉంటుంది.  ఈ గుహ గర్భాలయంలో సింహాసనంపై కూర్చున్న బుద్ధుడి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.

వీటి నిర్మాణం క్రీ.పూ. 600-800 సంవత్సరాల మధ్య కాలంలోజరిగింది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించినవి. హిందూ దేవతా మూర్తులు, పౌరాణిక గాధలు వీటిలో కనిపిస్తాయి. 

30 నుండి 34 వరకు వున్నగుహలు జైన మతానికి చెందినవి. ఈ 5 గుహలను క్రీ.పూ. 600-1000 సం.. మధ్య తొలిచారు.ఇవి ప్రక్కప్రక్కనే వుండి మత సామరస్యతకు చిహ్నాలుగా నిలిచాయి.  ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది.

కొన్ని నిర్మాణాలు 5 నుండి 10వ శతాబ్ధం వరకూ సాగాయి. భారతదేశ పురాతన నాగరికతా చిహ్నాలుగా, యునెస్కో(UNESCO) వీటిని గుర్తించింది.  ప్రపంచ వారసత్వ సంపదగా విరాజిల్లుతున్న ‘ఎల్లోరా గుహలు’ భారతీయ  శిల్పకళకు నిలువుటద్దాలు.

‘చరణధారీ కొండలు’ ను మలచి తొలచిన ఈ గుహలు అప్పట్లో హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలకు, సన్యాసాశ్రమాలకు నిలయాలుగా ఉన్నాయి. ఎల్లోరా గ్రామం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణానికి  30 కి.మీ. దూరంలో వున్నది. బస్సు,టాక్సీ సౌకర్యం ఉంది.గైడ్స్ కూడా అందుబాటులో ఉంటారు. నిత్యం పర్యాటకులు వస్తుంటారు.

———- KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!