Govardhan Gande…………………………………………..
పేరుకే అది పిట్ట… అదొక పెద్ద సోషల్ మీడియా వేదిక. దాన్నినడిపిస్తోంది ఓ అంతర్జాతీయ సంస్థ. మన దేశంలో చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నది.దాని కోణంలో ఇండియా ఓ పెద్ద మార్కెట్.నిజం కూడా.భూమిపై ఇంత పెద్ద మార్కెట్ మరొకటి లేదు కూడా.అది దానికి తెలుసు.ఈ మార్కెట్ నుంచి బాగానే డబ్బు వెనకేసుకుంటున్నది.అది దాని వ్యాపారమే.అభ్యంతరం ఏమీ లేదు.గొంతు లేని వారి కోట్లాది మందికి గొంతుకగా మారింది ఈ “పిట్ట”. సంతోషం.మనసులోని భావాలను ఎక్కడ,ఎవరికి,ఎలా చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఈ “పిట్ట” అందుబాటులోకి వచ్చి ఓ స్వేచ్చా వేదిక గా మారింది.
మనిషి నిత్య జీవిత సమస్యలు,బాధలు,కోపాలు,తాపాలు,ఆశలు,ఆశయాలు, ఆలోచనలు,ఉద్వేగాలు,భావాలు, భావజాలాలను ప్రపంచానికి స్పష్టంగా వ్యక్తం చేసుకోగలిగే వేదికగా నిలిచింది. ఇది కూడా సంతోషించవలసిన పరిణామమే. సాంకేతిక రంగంలో వచ్చిన అభివృద్ధి ఫలితమిది.అయితే దాని గొంతు నుంచి ఇపుడు అప స్వరాలు వినిపిస్తున్నాయి. అది ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నది.ఈ దేశపు మ్యాప్ లోని ఓ “కీలక భాగాన్ని” పరాయిది అని చూపుతూ ఓ మ్యాప్ ను నిన్న గాక మొన్న ట్వీట్ చేసింది.ఎపుడో 75 ఏళ్ళు క్రితం సరిహద్దులు నిర్ణయమైపోయాయి. వాటిలో కొన్ని వివాదాలున్నాయి. అవి పొరుగు దేశాలతో ఇండియా పరిష్కరించుకోవలసిన విషయం.
ఈ వివాదంలో జోక్యం చేసుకునే అధికారం ఈ పిట్టకు ఎక్కడిది? ఎవరిచ్చారు.? ఈ దేశమే కాదు, ఏ దేశ సరిహద్దులను ప్రశ్నించే అధికారం ఈ సంస్థతో పాటు ఎవరికీ లేదు. ఇపుడు ఇండియా బ్రిటీష్ వలస దేశం కాదు. ఇదొక సర్వ స్వతంత్ర దేశం. ఈ దేశపు అంతర్గత విషయాల్లో, పొరుగు దేశాలతో ఉన్న వివాదాల్లో జోక్యం చేసుకోమని ఎవరూ కోరలేదు. జోక్యం చేసుకునే అధికారం దీనికి లేదు. ఏదైనా వివాదం ఉంటే,గింటే దాన్ని ద్వైపాక్షికంగానో, వీలు కాకుంటే ఐక్య రాజ్య సమితిలోనో,మరో అంతర్జాతీయ వేదికలోనో పరిష్కరించుకుంటుంది.
ఈ పిట్ట జోక్యం అక్కర్లేదు ? మరో గద్ద,రాబందు(అమెరికా) జోక్యమూ అనవసరం. మరే దేశం జోక్యాన్ని కూడా అనుమతించనవసరం లేదు. ఈ దేశ ఐటీ చట్టం అలాంటి అనుమతిని ఏమీ ఇవ్వడం లేదు కూడా. ఇలాంటి పనిని ఈ పిట్ట గతంలో కూడా చేసింది.ఇది ఖచ్చితంగా ఆక్షేపించవలసిన సంగతి.ఇక్కడ వ్యాపారానికి మాత్రమే పరిమితమైతే మంచిది. అంతకు మించి మరో అంగుళం ముందుకు జరిగినా సహించనవసరం లేదు. అలాంటి అవకాశాన్ని ఈ పిట్టలు,గద్దలతో సహా మరెవ్వరికీ ఇవ్వకూడదు.
ఈ సాకుతో ప్రజల వ్యక్తీకరణ స్వేచ్ఛ ను హరించే యత్నాలు కూడా ప్రభుత్వం చేయకూడదు.ప్రజల వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఈ పిట్ట ను అదుపు చేయవలసి ఉన్నది.ఇలాంటి ధిక్కార స్వరాలు మళ్ళీ వినిపించకుండా దిగ్గజ పిట్టకి గట్టి పాఠాలు చెప్పాలి.