ఏడుకొండలవాడి దర్శనం కోసం గంటలకొద్దీ క్యూల్లో నిలబడి ఎదురుచూసే వారు ఏమతం వారైనా సరే ఏదేశం వారైనా సరే తిరుమలగుడిలోనికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి, పొర్లుదండాలు పెట్టుకోవడానికి, గుండు గీసి తల నీలాలు ఇచ్చుకోవడానికి ఏ ఆటంకం లేదు. ఉండకూడదు. ఏ డిక్లరేషన్ తోనూ పని లేదు. కాని హైందవేతరులు, ముస్లింలు, క్రైస్తవులు లేదా ఇంకెవరైనా సరే వివిఐపి ల హోదాలో, ఆలయ మర్యాదలతో స్వాగత గౌరవాలతో రావాలనుకుంటే మాత్రం శ్రీనివాసునిపైన విశ్వాసం ఉందని ప్రకటించాల్సి ఉంటుందని టిటిడి నియమాలు నిర్దేశిస్తున్నాయి. హిందువులే అయితే డిక్లరేఫన్ అవసరం లేదు.
టిటిడి అధ్యక్షుడు వై వి సుబ్బారెడ్డిగారు హటాత్తుగా ఈ డిక్లరేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చి డిక్లరేషన్ అవసరం లేదని ప్రకటన చేసినట్టు మీడియాలో వచ్చింది. ఆ వెంటనే తాను ఆ విధంగా అనలేదని ఒక వివరణ ఇచ్చారు. సోనియాగాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి డిక్లరేషన్ ఇవ్వలేదు కనుక ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల దర్శనం చేసుకునే ముందు డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదని తాను అన్నానని ఆయన చెప్పారు. ఈ విధంగా చెబుతూనే సుబ్బారెడ్డిగారు మరో మాట కూడా చెప్పారు. రోజూ ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది బాలాజీ మీద నమ్మకంతో తిరుమల కు 80 వేల మంది వస్తుంటారనీ, పండుగలు ఉత్సవాలలో సందర్శకుల సంఖ్య లక్ష దాటుతుందని, యాత్రికులలో అనేకమంది అన్యమతస్థులు కూడా ఉండవచ్చుననీ, వారినందరినీ డిక్లరేషన్ అడగడం సాధ్యంకాదనీ అన్నారు. ఇది చాలా సరైన అంశం. అంతదూరం వచ్చి సొంత ఖర్చులతో ప్రయాణించి క్యూలలో నిలబడే వారు ప్రత్యేకంగా శ్రీనివాసుని నమ్ముతామని ప్రకటన చేయాల్సిన పని లేదు. కాని టిటిడి ఖర్చుతో, వారి ప్రొటోకాల్ ప్రకారం, స్వాగత సత్కారాలు అందుకోవాలనుకునే హైందవేతర ప్రముఖులు కనీసం ఒక డిక్లరేషన్ పత్రం మీదనో లేక పుస్తకంలోనో సంతకం చేయవలసి ఉంటుందని నియమాలు చెబుతున్నాయి. రూల్ 136 ప్రకారం కేవలం హిందువులకు మాత్రమే దర్శన అర్హత ఉంది.కాని రూల్ 137 దానికి మినహాయింపు ఇచ్చింది. ఇతర మతస్తులు తమకు శ్రీనివాసుని పై విశ్వాసం ఉందని ప్రకటించాలి.
ప్రభుత్వ హోదాలో వచ్చే వారు సామాన్య భక్తులవలె తమంత తాము రాబోరు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలలభాగంగా వస్తారు. వచ్చాం కదా అని దర్శనానికి రావడంలో వేంకటేశుని చూడాలన్న ఆసక్తి భక్తి, కొండకు సొంత ఖర్చులతో వచ్చి, విఐపి హోదా లేకుండా, క్యూలో దీర్ఘకాలం పాటు ఎదురుచూసే వ్యక్తి ప్రత్యేకంగా నమ్మకం గురించి ప్రకటన చేయాల్సిన పని లేదు. అది స్పష్టం. ఈ నియమాలు ఉన్నా అవి అమలు కావడం లేదని, కనుక అమలు చేయవలసిన అవసరం లేదనడం మాత్రం న్యాయం కాదు. 2014లో ఇచ్చిన మోమో ప్రకారం దేవస్థానం ఉద్యోగులే స్వయంగా అన్యమతస్థులను డిక్లరేషన్ ఇవ్వాలని సూచించవలసి ఉంటుంది. అయితే ఎన్నో సందర్భాలలోపెద్ద పెద్ద రాజకీయ నాయకులు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వచ్చినపుడు అధికారులు వారి డిక్లరేషన్లు కోరడం లేదని, కనుక తాను ఈమాట అన్నానని సుబ్బారెడ్డి గారు చెప్పారు.
ఇది చాలా అన్యాయం. రెండు రూల్స్ ఒక ప్రభుత్వ మొమో ఉన్నా దాన్ని పాటించడం లేదు కనుక పాటించనవసరం లేదని అంటే అర్థం ఏమిటి?
సుబ్బారెడ్డిగారు తమ ప్రకటనలో ఇంకా ఇలా రాశారు. వై ఎస్ జగన్మోహన రెడ్డిగారు పాదయాత్ర ప్రారంభించినపుడు, స్వామిని దర్శించి వెళ్లారని, యాత్ర తరువాత కాలినడకన తిరుమల కొండలు నడిచి ఎక్కి దర్శనం చేసుకుని ముగించారని, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ దర్శనం చేసుకున్నారని వివరించారు టిటిడి అధ్యక్షులు. ఇవన్నీ సాక్ష్యాలు చాలవా ఆయనకు నమ్మకం ఉందనడానికి అన్నారు. కనుక ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదని సుబ్బారెడ్డి గారు వాదిస్తున్నారు. సెప్టెంబర్ 23న బ్రహ్మోత్సాల సందర్భంగా గరుడ వాహన సేవరోజున స్వామి వారికీ ప్రభుత్వం పక్షాన పట్టువస్త్రాలు ఇవ్వడానికి వస్తారని కూడా చెప్పారు. ఎలా ఉన్నా రోజూ ప్రతివారినీ గుర్తించి, ప్రకటన చేయించడం సాధ్యం కాదని, కనుక దీనిపైన అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని వారు కోరారు.
డిక్లరేషన్ అవసరం లేదని తాను అనలేదని ఖండిస్తూ ఆ అవసరమే లేదని సుబ్బారెడ్డిగారు అనడం అంటే ఇదివరకు ప్రకటననే పునరుద్ఘాటిస్తున్నట్టే కదా. రాష్ట్రపతి కాకముందు గొప్పసైంటిస్టుగా ఉన్న రోజుల్లో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం తిరుమలకు వచ్చి, తాను పై డిక్లరేషన్ సంతకం చేసి లోనికి వెళ్లారు. ఆ తరువాత ఒకసారి ఉమ్మడి ఎపి ప్రధాన న్యాయమూర్తి హోదాలో వచ్చిన నిసార్ అహ్మద్ కక్రూ తిరుమలకు వచ్చి లోనికి వెళ్లే దశలో తిరుమత శ్రీనివాసునిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ పై సంతకం చేయాలని కోరారు. తాను విగ్రహారాధనను నమ్మనపుడు శ్రీనివాసుని పై విశ్వాసం ఉందని ఏ విధంగా కాగితపు ప్రకటనపై సంతకం చేస్తాను?అని ప్రశ్నించి, దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయారని తెలిసింది. తప్పుడు ప్రకటన చేయడానికి ఇష్టపడకుండా దర్శనం వదులుకుని వెళ్లిపోవడం తాను నమ్మినదానికి కట్టుబడడమే. ఇదివరకు సోనియాగాంధీ వచ్చినపుడు తాను హిందువుల ఇంటి కోడలినని, కనుక ప్రత్యేకంగా సంతకం చేయనవసరం లేదని భావించారని, ఇందిరాగాంధీ వచ్చినపుడు ఎవరూ ఆమెకు ఈ విషయం చెప్పలేదనీ తెలిసింది.
నియమాల ప్రకారం ఈ షరతుగురించి అన్యమతస్తులకు తెలియజేయాల్సిన అవసరం బాధ్యత అధికారులపైన ఉంది. వచ్చిన వారు కూడా అబ్దుల్ కలాం ఆజాద్ వలె విశ్వాసం ఉందని చెప్పడమో లేక విశ్వాసం లేదని కక్రూ వలె దర్శనం చేసుకోకుండా వెళ్లిపోడమోచేయవలసి ఉంటుంది.
తిరుమలలో ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఉన్న వై వి సుబ్బారెడ్డిగారు ముందుగా తాము హిందువేనా, టిటిడి చట్టాలు నియమాలను నమ్ముతారా, శ్రీనివాస స్వామిని నమ్ముతారాలేదా ప్రకటన చేయవలసి అవసరం వచ్చింది. అన్యమతస్తులు ఎవరైనా తిరుమల వస్తే విశ్వాస ప్రకటన చేయాలని కోరే బాధ్యత వారిపైన ఉందని నియమాలు చెబుతున్నాయి. నియమలు అందరికీ సమానంగా వర్తింపజేయాల్సిన అవసరం ఉంది. స్వామిపై విశ్వాసం ఉంటే అబ్దుల్ కలాం వలె సంతకం చేయాలి విశ్వాసం లేకపోతే సంతకం చేయకుండా తిరుమల వదిలి వెళ్లిపోవలసి ఉంటుంది. తిరుమల చట్టాలను నియమాలను పాటించే ధర్మం ధర్మకర్తలది. ఒక్కరూపాయి మొదలు లక్షల కోట్ల ఆస్తులు ఇచ్చే ప్రజలకు టిటిడి జవాబుదారుగా ఉండాలి. ఈ డిక్లరేషన్ పై పారదర్శకంగా వ్యవహరించాలి. టిటిడిని సమాచార హక్కు చట్టం కిందకు తేవాలి.
——— మాడభూషి శ్రీధర్
నా అభిప్రాయం : గాలి, నీరు… యీ ప్రకృతి ని డిక్లరేషన్ లేకుండానే అనుభవిస్తున్నాం ! నమ్మే దైవాన్ని దర్శించి, ఆ అనుభూతిఅనుభవించడానికి, వేరే డిక్లరేషన్ ఎందుకో నాకు అర్థం కాలేదు !