కొన్ని విషయాలు, వివిధ సమాచారాన్ని క్రోడీకరిస్తే మళ్ళీ ట్రంప్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అవగతమౌతోంది.
1) గత వంద సంవత్సరాల్లో (1920-2020) అమెరికన్ ప్రెసిడెంట్లను గమనిస్తే కేవలం ముగ్గురు మాత్రమే తమ రెండో దఫా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హెర్బర్ట్ హూవర్ (1929-33)… ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ చేతిలో, జిమ్మీ కార్టర్ (1977-81)… రోనాల్డ్ రీగన్ చేతిలో, జార్జ్ డబ్ల్యూ బుష్- సీనియర్ (1989-93)… బిల్ క్లింటన్ చేతిలో పరాజయం పొందారు. వీరు ముగ్గురూ గాక గెరాల్డ్ ఫోర్డ్ (1974-77) కూడా జిమ్మీ కార్టర్ చేతిలో ఓడిపోయినా ఫోర్డ్ ఎలక్టోరియల్ కాలేజ్ ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడు కాదు కాబట్టి ఈ లిస్టులో మినహాయింపు. రిచర్డ్ నిక్సన్ (1969-74) వాటర్ గేట్ కుంభకోణంలో తన పదవికి రాజీనామా చేసాక అప్పటి వైస్ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్ ఆటోమాటిక్ గా ప్రెసిడెంట్ అయ్యాడు.
పైన చెప్పుకున్న మూడు సందర్భాలలో అప్పటి ప్రెసిడెంట్లను ఓడించిన రూజ్వెల్ట్, రీగన్, క్లింటన్ లు ముగ్గురూ ఒకరకంగా రాక్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న లార్జర్ దేన్ లైఫ్ పొలిటీషియన్లు. వారి స్థాయిలో ప్రస్తుతం ట్రంప్ ను ఎదుర్కొంటున్న జో బైడెన్ లో ఎటువంటి చరిష్మా లేదు.
2) ప్రస్తుతం ఒపీనియన్ పోల్స్ ఏవీ ఓటర్ల నాడిని పసిగట్టడంలో పెద్దగా సఫలీకృతం కాలేదు. ముఖ్యంగా ట్రంప్ విషయంలో చాలా పోల్స్ తప్పటడుగు వేశాయి. కారణం షై ఓటర్స్. ఎక్కువ మంది ట్రంప్ కి ఓటేయాలని భావించేవారు బహిరంగంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చలేని పరిస్థితి. ఈ విషయం 2016లో తేటతెల్లం అయిందని మీకందరికీ తెలిసిన విషయమే. ఈ విషయమై 2016లో సరైన అంచనా వేసిన ట్రఫాల్గర్ గ్రూప్ అనే సంస్థ విశ్లేషణను గమనించగలరు.
3) జో బైడెన్ మంచూరియన్ క్యాండిడేట్ అన్న అపవాదులో కొంత నిజం లేకపోలేదు. చైనా రక్షణ సంస్థలతో బైడెన్ కి ఉన్న సంబంధాలు అతనికి ప్రధాన ప్రతిబంధకం కానున్నాయి. చైనా సామ్రాజ్యవాద కాంక్షను, కష్టాల్లో ఉన్న దేశాలను అప్పుల ఊబిలోకి దింపుతున్న చైనా అనైతిక రాజకీయాలను అమెరికన్ ప్రజానీకం నిశితంగా గమనిస్తోంది. ఆసియా – ఫసిఫిక్ దేశాల్లోనే కాకుండా ఆఫ్రికా, యూరప్, దక్షిణ అమెరికా దేశాల్లో సైతం పెరుగుతున్న చైనా ప్రాబల్యం భవిష్యత్తులో అమెరికాకు పెను సవాలే అని సర్వత్రా భావిస్తోంది. దీనికి కరోనా మహమ్మారి అదనం.
4) అమెరికా ఎన్నికల్లో కొంతవరకూ ప్రభావశీలమైన భారతీయ ఓటర్లు 2016 ఎన్నికల్లో 12% మంది మాత్రమే ట్రంప్ ని సమర్థించగా ప్రస్తుతం ఆ సంఖ్య 25 నుండి 30% వరకూ ఉండొచ్చని అంచనా. జపనీస్, కొరియన్లు, ఇజ్రాయెలీలు, సౌదీ అరేబియన్లలో కూడా ట్రంప్ అనుకూలత విపరీతంగా పెరిగిందని విశ్లేషణలు చెప్తున్నాయి. అంతేగాక అంతర్గతమైన విషయం ఏమంటే… చైనీయులు తమ దేశ ప్రభుత్వ అండదండలతో భారతీయ వ్యాపారులపై పెంచుతున్న ఆర్థిక ఒత్తిడి. భారతీయులు తెలివిగలవారే, కష్టించి పనిచేసేవారే… కానీ మీ సుపీరియర్ రిప్రజెంటేషన్ ఇక చాలు, మీరు మాకు లొంగి ఉండాల్సిందే అన్న చైనీయుల ధోరణి తమ భవిష్యత్ అస్థిత్వానికే ప్రమాదమని భారతీయులు నిశ్చితాభిప్రాయానికి రావడం గమనించదగ్గది.
5) అంతర్జాతీయ రాజకీయాల్లో ట్రంప్ దౌత్యపరంగా విఫలమౌతాడనుకొన్న భావనలు పటాపంచలు అయ్యాయి. దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెనుభారమౌతున్న డెడ్ వెయిట్ అల్లైస్ (నిరుపయోగ మిత్రులు) ని ట్రంప్ సమర్థవంతంగా నిరోధించగలిగాడు. ఉదాహరణకు, టర్కీ, పాకిస్థాన్. సిరియాలో అల్ ఖైదా ఉగ్రవాదులకు ఊతమిస్తోన్న టర్కీని నాటో సభ్యదేశమైనప్పటికీ తమ F35 సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్టు నుండి తొలగించాడు. పాకిస్థాన్ ను FATF (ఉగ్రవాద సంబంధ ఆర్థిక నేరాల నిరోధక మండలి) గ్రే లిస్ట్ లో చేర్చే విధంగా చేశాడు. [బహుశా త్వరలో బ్లాక్ లిస్టులో కూడా చేర్చే అవకాశం ఉంది. కారణం ఈ వారంలోనే తమ పార్లమెంట్ లో పుల్వామా దాడిని మేమే చేశామని, దానికి గర్వపడుతున్నామని పాకిస్థాన్ గొప్పలు చెప్పుకోవడమే]
6) ఈ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపుతుందనుకొంటున్న బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం వల్ల ట్రంప్ కే అనుకూలం కావొచ్చు. మీరు గమనిస్తే ఈ ఉద్యమం ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లోనే సాగింది. ఈ ఉద్యమం వల్ల జరిగిన దమనకాండలో అత్యధికంగా నష్టపోయింది నల్లవారు, హిస్పానిక్స్, ఇతర ఆసియా దేశాల వారే. అలాగే ఈ అల్లర్లు, లూటీల వెనుక ఎవరున్నారో, ఎవరు లబ్ది పొందుతున్నారో తెలుసుకోలేనంత మూర్ఖులు కారు.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ట్రంప్ గెలవడమే అందరికీ, అన్నింటికీ మంచిదని నా అభిప్రాయం.