“జెండాపై కపిరాజు.. ముందు కవితక్క కారుశ్రేణియుంగూర్చి”

Sharing is Caring...

రమణ కొంటికర్ల …………………………………………

జెండాపై కపిరాజు..ముందు సితవాజి శ్రేణియుంగూర్చి..నే దండంబుగొని తోలు స్యందనముమీద

న్నారి సారించుచుం గాండీవమ్ము ధరించి.. ఫల్గునుడు మూకను జెండుచున్నప్పు డొక్కండున్

నీ మొర నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. 

అంటూ ఆ కృష్ణ పరమాత్ముడు దుర్యోధనుడితో చెబుతున్న నాటి ద్వాపరయుగపు సన్నివేశాలు ఓసారి మదిలో కదలాడినా…అరయవైతివి మనసుగలట్టి కూర్మీ కాల్చవైతివి శ్రీరాము ఘనతనైన వార్థిలందించి జగజ్జెటివైన కథను తలచినావేమో భుజబలదర్పమొకటే… అని శ్రీరాముడంటుంటే… బాహుబలశాలినైన దర్పంబుకాదు మదిని శ్రీరామనామంబు మరువలేను పతితపావనుండగు నీ బంటునగుట లక్ష్యమనుకొంటి శరణార్థి రక్షణందే.. అనంటూ ఆ భజరంగి ఇచ్చే త్రేతాయుగపు సమాధానాన్నొక్కసారి మననం చేసుకుంటే…

ఇప్పుడు కలియగంలో జరుగుతున్నది నాటి ద్వాపరయుగ కురుక్షేత్ర యుద్ధమూ కాకపోవచ్చును! అంతకుమించి త్రేతాయుగపు రామాంజనేయ రణభేరీ కాకపోవచ్చును!! కానీ… అదే నమూనా! అదే పద్ధతి!! అందుకే ఈ చర్చ!!అయోధ్య రామమందిర నిర్మాణానికి బీజేపి నేతలు చేపట్టిన విరాళాల సేకరణపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి… ఇరుపార్టీల నడుమ ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించే పరిస్థితేర్పడటం.. దుబ్బాక దెబ్బ తర్వాత… జీహెంఎసీలోనూ సీన్ రిపీటై బీజేపి అధికార టీఆర్ఎస్ కు దీటుగా పుంజుకోవడం… అందులోనూ ఓట్ల పోలరైజేషన్ సంకేతాలు స్పష్టంగా కనిపించడంతో తెలంగాణానాట రాజకీయం గుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.

పచ్చి సెక్యులర్ వాదనకు మాత్రమే కట్టుబడి ఉండే అధికార టీఆర్ఎస్ నేతలు తామూ హిందువులమేనని నిరూపించుకోవాల్సిన ఓ శీలపరీక్షే ఎదురయ్యేలా చేయడంలో బీజేపి ఎవ్వరవునన్నా, కాదన్నా కొంత సఫలీకృతమైంది. ఈక్రమంలో చాలామంది అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఎన్నో యాగాలు చేస్తున్న సీఎం కేసీఆరే సిసలైన హిందువంటూ కనిపించిన వేదికలన్నింటిపైనా చెప్పుకోవల్సి వస్తోంది. కొండగట్టులో దేవాదాయశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ విషయాన్ని మరోసారి మీడియా ముందు మాట్లాడుకురావడం అందుకు తాజా ఉదాహరణ.

ఇదిలా ఉంటే.. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలంటారు. ఇదిగో ఈ పాయింట్ నే పట్టుకుని ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో… ఇప్పుడు తెలంగాణానాట పుంజుకుంటున్న కమలానికి కత్తెర వేయాలని చూస్తున్నట్టుగా మాత్రం కొన్ని పరిణామాలను చూస్తే అనుకోకుండా ఉండలేం. అందులో భాగమే సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవిత కొండగట్టు పర్యటన అన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంటోంది. ప్రతిపక్షాలు కూడా అలాంటి తరహా అస్త్రాలనే మీడియా సమావేశాలు పెట్టి మరీ వదులుతున్నాయి. 2014లో తెలంగాణా ఏర్పాటు తర్వాత గద్దెనెక్కిన అధికార టీఆర్ఎస్ కు ఇంతకాలం పట్టని కొండగట్టు ఇప్పుడు గుర్తురావడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నిస్తన్నాయి. అది సరేసరి.. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలూ, ప్రతివిమర్శలూ సర్వసాధారణమే!

ఈమధ్యే కాశీ వెళ్లొచ్చిన కవిత… సరిగ్గా పది, పన్నెండు రోజుల క్రితం కొండగట్టులో పర్యటించారు. అంజన్న దర్శనమనంతరం మాట్లాడిన ఆమె.. కాశీ వంటి క్షేత్రంలో కూడా కొండగట్టు అంజన్న సన్నిధి గురించి వారు అడిగారని.. ఇక్కడ అఖండ హనుమాన్ నామ సంకీర్తన చేయించాలని సూచించినట్టుగా కూడా ఆమె చెప్పుకొచ్చారు. సరిగ్గా పది, పన్నెండురోజులాలా గడిచాయో, లేదో మళ్లీ కవిత కొండగట్టు బాట పట్టారు. సుమారు నలభై ఏళ్ల కిందినుంచి కేవలం ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైన శ్రీరామకోటి స్థూప నిర్మాణం గురించి ఆలయ అర్చకులు దృష్టికి తీసుకురాగా… ఆమె రెండో పర్యటనకే అందుకు కావల్సిన 90 లక్షల నిధులను మంజూరు చేయించి మరీ స్థూప నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. అంతేనా… ఆమె ఈమధ్య చేసిన మొదటి పర్యటనలో చెప్పినట్టుగా అఖండ హనుమాన్ నామ సంకీర్తన కార్యక్రమాన్ని మార్చి 17 నుంచి పెద్దఎత్తున చేపట్టి.. టీవీసెట్లలో లైవ్ ఇప్పించనున్నట్టు.. తద్వారా ప్రతీ ఇంట్లోనూ హనుమాన్ ఛాలీసా పారాయణం జరిగేలా చూసేట్టు ఆమె చెప్పుకొచ్చారు.

అయితే ఇంతకాలం పెద్దగా పట్టించుకోని కొండగట్టుపై కవితకెందుకింత ఫోకస్ కుదిరింది…? ఇప్పుడిదే నిబిడాశ్చర్యంతో కూడిన ప్రశ్న?!!కొండలు, గుట్టల నడుమ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరుగా ఓ క్యాన్వాస్ పై అద్భుతమైన చిత్రకారుడు వేసిన పెయింటింగ్ లా కనిపించే కొండగట్టుకు వచ్చే భక్తుల సంఖ్యనుబట్టి చూస్తే కవిత చేస్తున్నది నూటికి నూరుపాళ్లూ ఆహ్వనించదగ్గదే. అయితే ఇప్పుడున్నపళంగా కవిత ఆంజన్న జపం స్మరించడంతో… జెండాపై కపిరాజును పెట్టుకుని… మరో రామాంజనేయ యుద్ధానికి తెరతీసిందా అన్న చర్చ ఉపందుకుంది. రామనామంతో ముందుకెళ్తున్న బీజేపిని… హనుమనామంతో ముందరి కాళ్లకు బంధం వేసే రాజకీయ కార్యక్రమమని ఎందుకు భావించకూడదన్న చర్చా జరుగుతోంది.

కేసీఆర్ నుంచి జగన్ మోహన్ రెడ్డి వరకూ… ప్రధాని మోడీ నుంచి రాహూల్ గాంధీ వరకూ… మమతా బెనర్జీ నుంచి కరడుగట్టిన లెఫ్టిస్ట్ గా సుపరిచితులైన సీపీఐ నారాయణ వరకూ స్వాములు, సన్యాసులను కలుస్తున్న రోజుల్లో… ఎక్కడ పోగొట్టుకుంటున్నామో వెతుక్కుని… పోలరైజవుతున్న ఓట్లను ఒడిసిపట్టడంలో భాగమే ఈ రాజకీయ ఎత్తులకు పైఎత్తులగా కూడా విశ్లేషణలు ఉపందుకుంటున్న తరుణమిది.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!