బహుళ బ్యాంక్ ఖాతాలతో ఇబ్బందులు తప్పవా ?

Sharing is Caring...

Multiple accounts ………………………………….

ఒకటి,రెండు కి మించి బ్యాంక్ అకౌంట్లు ఉంటే కొన్ని సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చాలామంది ఒకటి కంటే ఎక్కువగానే బ్యాంక్ అకౌంట్లు నిర్వహిస్తున్నారు. కొంతమంది ఉద్యోగాలు మారినప్పుడల్లా  కొత్త కంపెనీ బ్యాంక్ ఖాతా నిర్వహించే బ్యాంక్ లోనే అకౌంట్ తెరవమని మేనేజర్స్ ఒత్తిడి తెస్తుంటారు.

తప్పని సరి పరిస్థితుల్లో అకౌంట్ తెరుస్తారు. అక్కడనుంచి మారినపుడు మరో చోట అకౌంట్ తెరుస్తారు. కానీ పాత ఉద్యోగం తాలూకూ ఖాతాలను క్లోజ్ చేయరు. కొంతమంది బ్యాంక్ ఖాతా అంటే నగదును దాచుకోవడం, అవసరం ఉన్నప్పుడు నగదు విత్ డ్రా చేసుకోవడం కోసం వాడతారు.  మరి కొందరు ఫిక్స్డ్ డిపాజిట్లు ద్వారా వచ్చే వడ్డీ కోసం ఉపయోగిస్తుంటారు. కొంతమంది క్రెడిట్ కార్డుల కోసమే బహుళ ఖాతాలు నిర్వహిస్తుంటారు. 

టెక్నాలజీ పెరిగే కొద్దీ బ్యాంకింగ్ సంస్థలు తమ సేవల పరిధిని పెంచుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సేవలకు ఛార్జీలు కూడా విధిస్తున్నాయి. అత్యధికంగా లావాదేవీలు నిర్వహించేవారికి ఈ చార్జీలు ఒక్కోసారి భారం కావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక బ్యాంక్ అకౌంట్ ను నిర్వహించడం సులభం పైగా ఆదాయపు పన్ను రిటర్న్ ను ఫైల్ చేస్తున్నప్పుడు, బ్యాంకింగ్ వివరాలు ఒకే బ్యాంకు ఖాతాలో అందుబాటులో ఉంటే ఫైలింగ్ పని సులభం అవుతుంది.

అయితే తప్పని సరిగా రెండు మూడు బ్యాంక్ ఖాతాలు ఉపయోగించాల్సి వస్తే.. బ్యాంక్ సేవలు, ఛార్జీలు తెలుసుకునే కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు.ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో సరైన మినిమం బ్యాలెన్స్ నిర్వహించడం ఒక్కో సారి కుదరకపోవచ్చు. అటువంటి సందర్భాలలో దాని ప్రభావం మీ సిబిల్  రేటింగ్ పై పడుతుంది. 

బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతీ ఒక్క కస్టమర్ కూడా బ్యాంకులు విధించే ఎస్ఎంఎస్ అలర్ట్ సర్వీస్ ఛార్జ్, డెబిట్ కార్డ్ మొదలైన వివిధ సేవా ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాలి. ఖాతాలో బాలన్స్ ఉంటే ఆటోమాటిక్ గా డెబిట్ అవుతుంటాయి. అలాగే ఎక్కువ కాలం అకౌంట్ వాడకపోతే వివిధ ఛార్జీలు పడతాయి. కాబట్టి మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే.

బ్యాంక్ సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలంటే మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం తప్పనిసరి. మీకు ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే, మీ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసి ఉండాలి. ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు కస్టమర్ల ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే  బాది పడేస్తున్నాయి.

అలాంటిది వేర్వేరు బ్యాంకుల్లో కనీస మొత్తంలో నగదుని నిల్వను నిర్వహించాలంటే సామాన్యుడికి ఇది భారమే తప్ప ఉపయోగకరం కాదని నిపుణులు అంటున్నారు. ఎన్ని ఖాతాలు మనం ఉపయోగిస్తుంటే బ్యాంకులు విధించే ఛార్జీలు కూడా అదే స్థాయిలో ఉంటాయనే విషయాన్ని గమనించాలని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే రెండు కంటే ఎక్కువ ఖాతాలు ఉండటం భారమే అవుతుందని చెప్పుకోవాలి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!