తెలంగాణ లోని మహబూబ్‌నగర్ జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దమారుర్ ప్రాంతంలో ఇలాంటివే కొన్ని సమాధులు బయటపడ్డాయి. వీటికి సిస్తు సమాధులని పరిశోధకులు పేరు పెట్టారు. పెద్దమారుర్ గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్లకు పైగా కృష్ణానదిలో ఈ సమాధులు సుమారు 60కి పైగా ఉన్నాయి.
ఇవి రెండు ప్రాంతాల్లో రెండు శ్మశాన వాటికలుగా కనిపిస్తాయి. ఒకటి పాతరాతి యుగానికి, రెండోది శాతవాహనుల పాలన కాలానికి చెందినవిగా పురావస్తు శాఖ వారు తేల్చారు. ఇవి సొరంగాలుగా.. గదుల వారీగా లోపల కాల్వ వంటి గోతులతో ఎత్తయిన ప్రాంతాలపై నిర్మించారు.ఇలాంటి సమాధులన్ని ఎక్కువగా కొండలు, గుట్టలున్న ప్రాంతాల్లోనే బయటపడ్డాయి.
రాయల సీమలో వీటిని పాండవ గుళ్ళు అంటారట. అక్కడ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమాధులతో పాటు కొన్ని చోట్ల అప్పట్లో గిరిజనులు వాడిన వంటపాత్రలు .. రాతి పనిముట్లు .. రోళ్ళు తదితర వస్తువులు కూడా బయట పడ్డాయి. ఈ సమాధుల్లో నిధి నిక్షేపాలు ఉన్నాయని భావించి వాటిని ద్వంసం చేసిన ఉదాహరణలున్నాయి.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నాలుగు సమాధుల తవ్వకం జరిగినపుడు రెండు సమాధుల నుంచి 3500 సంవత్సరాల నాడు ఆదిమానవులు వాడిన రాతి ఉలి, మట్టి కుండలు బయటపడ్డాయి. నక్షత్రాల ఆధారం గా రుతువులను గుర్తించే కప్ మాక్స్, వేట కోసం ఉపయోగించిన బాణం మొన, రాతి బండపై నక్షత్ర రాశులు, కాలాన్ని సూచించేలా చెక్కిన ఆనవాళ్లు బయటపడ్డాయి.
మరో సమాధిలో మట్టి కుండ బయటపడింది. బయటపడ్డ సమాధి ప్రపంచంలోనే అతి పెద్దదని పురావస్తు శాఖ అధికారులు ప్రకటించారు.తెలంగాణ లోని డోర్నకల్లు, బేగ౦పేట, మౌలాలీ, మధిర, చి౦తకాని, వరంగల్ జిల్లా మల్లూరు కొండల తదితర ప్రాంతాల్లో ఈ తరహా సమాధులు కనిపించాయి.
అలాగే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస సమీపంలోని దన్ననపేట వద్ద లోహ యుగం నాటి మెగాలిథిక్ డాల్మెన్ బయటపడింది. (36 అడుగుల పొడవు.. 14 అడుగుల వెడల్పు.. 2 అడుగుల మందం ) రాయలసీమలో వీటిని పాండవ గుళ్లు అంటారు. అయితే ఇవి కొత్త రాతి యుగానికి చెందిన megalithic type సమాధులుగా కొందరు అభివర్ణించారు.
నాలుగు వైపులా రాతి పలకల్ని పెట్టి వాటి పైన పెద్ద రాతి పలకని కప్పుతారు.ఇవి ఆ కోవ లొనికి చెందినవే…అయితే శిధిలం కావడం మూలాన ఆకారాలు దెబ్బతిన్నాయి. మరి కొన్ని సమాధులపై ఊరిపేర్లు కూడా రాసి ఉన్నాయని …ఆ సమాచారాన్నిబట్టి అవి ఏ ప్రాంతానివో నిర్ణయించవచ్చని చెబుతున్నారు. బయటపడిన , పడుతున్న ఈ చారిత్రిక ఆనవాళ్ల గురించి ప్రభుత్వం శ్రద్ధ చూపితే కానీ చరిత్ర ఏమిటో పూర్తిగా తెలీదు.
——— KNM
PL. READ IT ALSO …………………. చరిత్ర చెబుతున్న సమాధులు (1)