పాదయాత్రలు ఎవరికి ప్లస్ అవుతాయో ?

Sharing is Caring...

పాదయాత్రల సీజన్ మళ్ళీ మొదలు కానుంది. ఈ సారి తెలంగాణ నేతలు పాదయాత్రలకు సంకల్పించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 9 నుంచి 55 రోజుల పాటు సుమారు 750 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. హైదరాబాద్ లో మొదలయ్యే ఈ పాదయాత్ర నాగర్ కర్నూల్,నిజామాబాద్, కరీంనగర్,సంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ పాదయాత్ర ద్వారా ప్రజాసమస్యలను క్షేత్ర స్థాయిలో బండి సంజయ్ తెలుసుకుంటారు. 

బండి సంజయ్  పాద యాత్ర చేయడం ఇదే ప్రధమం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో అధికారాన్ని చేజిక్కించుకుంటామనే ధీమా తో ఉన్న బండి సంజయ్ కి ఈ యాత్ర ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.  ప్రజలకు దగ్గర కావడానికి… బీజేపీ లక్ష్యాలను ప్రజలకు వివరించడానికి ఈ పాదయాత్ర ఉపకరించవచ్చు. కేంద్ర నాయకత్వం సైతం తెలంగాణ పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సంజయ్ కూడా దూకుడు గా ఉన్నారు. 

ఇక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన  రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. రేవంత్ కూడా దూకుడు గానే ఉన్నారు. పార్టీ ని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ భావిస్తున్నారు. నేతలందరినీ కలుపుకు పోవాలని ప్రయత్నిస్తున్నారు. అందరి దగ్గరికి వెళ్లి వ్యక్తిగతంగా కలుస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ సమావేశాలు ముగిసిన పిదప  పక్కాగా ప్లాన్ చేసుకుని పాదయాత్ర చేపట్టే యోచనలో ఉన్నారు.మొన్నటి ఫిబ్రవరి లో రేవంత్ రెడ్డి రైతు సమస్యలపై దీక్ష చేపట్టి తన నియోజక వర్గ పరిధిలో మినీ పాదయాత్ర చేశారు. ఈ యాత్రకు స్పందన బాగానే ఉంది. త్వరలో పాదయాత్ర చేయడమైతే ఖాయం కానీ అది ఎంత దూరం .. ఏయే జిల్లాలు అనేది ఖరారు కావాల్సి ఉంది.  ఆ యాత్ర ఆయనకు ఎంతవరకు ఉపయోగ పడుతుందో కాలమే నిర్ణయించాలి. 

ఇక తెలంగాణ లో సొంత పార్టీ పెట్టిన వైఎస్ తనయురాలు షర్మిల కూడా పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. వైఎస్ 2003 లో చేవెళ్ల నుంచి పాదయాత్ర చేశారు. ఆ యాత్ర వైఎస్ కి కలసి వచ్చింది. 2004 ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు.  ఈ క్రమంలోనే  కొన్ని కార్యక్రమాలను వైఎస్ చేవెళ్ల నుంచే ప్రారంభించారు. షర్మిల కూడా తన పాదయాత్రను తండ్రి తరహాలో చేవెళ్ల నుంచే మొదలు పెట్టనున్నారని  సమాచారం. ఎప్పటినుంచి ? ఎంత దూరం అనేది తేలాల్సి ఉన్నది. షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు.

2012 అక్టోబర్ 18 న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించి 2013 జులై 29 వరకు షర్మిల 230 రోజుల పాటు 3వేల112 కిలోమీటర్ల మేరకు నడిచారు. షర్మిల సోదరుడు వైఎస్ జగన్ కూడా 2019 ఎన్నికలకు ముందు  341 రోజులు పాదయాత్ర చేసారు. ఈ యాత్ర ద్వారా ఆయన 3648 కిలో మీటర్లు నడిచారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు.  వైఎస్ కుటుంబంలోనే ముగ్గురు పాదయాత్ర చేయడం కూడా ఒక రికార్డు. 

కాగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా 2013 లో పాదయాత్ర చేశారు. ఆయన 2340 కిలోమీటర్లు నడిచారు. ఆ వెంటనే వచ్చిన 2014 ఎన్నికల్లో సీఎం అయ్యారు. కాగా 2016-17  మధ్యకాలంలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కూడా తెలంగాణలో సుమారు  4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.ఆయనకు రాజకీయంగా పాదయాత్ర కలసి రాలేదు.  

మొత్తం మీద పాదయాత్ర వలన ప్రజలకు దగ్గర కావచ్చు. వారి సమస్యలు తెలుసుకోవచ్చు. ప్రజలతో మమేకం కావచ్చు. అంతిమంగా అధికారంలోకి రావాలంటే  పాదయాత్ర ఒక్కటే సరిపోదు. ప్రజల మనసులను గెలుచుకోవాలి. ఎన్నికల్లో సత్తా చాటుకోవాలి. 

—————KNM   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!