తర్జని కథల పోటీలో ఎంపికైన థ్రిల్లర్ స్టోరీ !

Sharing is Caring...

రఘుకి చిన్నప్పటినుండి చీకటన్నా, దెయ్యమన్నా చాలా భయం. ఇలాంటి వ్యక్తి దెయ్యం ఉందని నలభై ఏళ్ళు మూసేసిన  ఓ  రైల్వేస్టేషన్లో ఒంటరిగా ఓ రాత్రంతా ఉంటే ఎలా ఉంటుంది. అతని చిన్నతనంలో ఇంటినుండి బయటికెళ్ళకుండా తన తల్లీ దెయ్యం కథలు చెప్పి భయపెట్టేది. కానీ పెద్దయ్యాకా కలకత్తాలో ఉద్యోగం వచ్చినా ఆ దెయ్యం భయం మాత్రం మనసులోంచి పోలేదు. అందుకే ఎక్కడున్నా రాత్రి కాకముందే ఇంటికి చేరుకొంటాడు. పైగా రాత్రిపూట తన పడగ్గదిలో లైట్లు వేసుకొనే పడుకొంటాడు. అలాంటి భయస్తుడికి ఓ భయంకరమైన దుస్థితి ఎదురయ్యింది.

అనుకోకుండా ఓ రోజు కలకత్తా నుండి బోకరో స్టీల్ సిటీలో ఉన్న తన స్నేహితున్ని కలవడానికి బయలుదేరాడు. అక్కడికెళ్లడానికి  రఘు బస్సుకి బదులుగా రైల్లో ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు రైలు ఏడు గంటలు ఆలస్యమయ్యింది. ఆ రైలు ఖచ్చితంగా బేగున్ కోదర్ అనే రైల్వేస్టేషన్ మీదుగానే వెళ్తుంది. ఆ రైల్వేస్టేషన్ పట్టాల మీదుగా లచన్ కుమారి అనే దెయ్యం తెల్ల చీర కట్టుకొని తిరుగుతుందని దాదాపు నలభై ఏళ్ళు ఆ స్టేషన్ని మూసి వేశారు. కానీ ఆ గ్రామస్తుల కోరిక మేరకు మళ్ళీ దానిని తెరిచారు. ఆ స్టేషన్ మీదుగా సాయంత్రం ఐదున్నరకే చివరి రైలు వెళ్ళాల్సింది. కానీ ఆ రోజు రఘు ఎక్కిన ఆ చివరి రైలు అక్కడికి చేరేసరికి రాత్రి పన్నెండయ్యింది.

పాటలు వింటూ తన బోగీలో తాను తప్పా ఇంకెవరు లేరన్న విషయాన్ని రఘు గమనించనే లేదు. ఎందుకో తెలియదు కానీ ఆ స్టేషనుకి కొద్ది దూరంలో రైలు ఆగింది. రైల్వే నిబంధనల ప్రకారం ఆ స్టేషన్లో రైలు ఆగకూడదు. కానీ ఆ రోజు ఎందుకాగిందో తెలియట్లేదు. రఘు భయపడ్తూనే బయటికీ తొంగిచూశాడు. ” బేగున్ కోదర్ ” అనే బోర్డు కనిపించగానే అతనికి గుండాగినట్లైంది. ఆ బోగిలో అటు ఇటుగా ఎవరైనా ఉన్నారేమోనని తొంగి  చూశాడు. ఎవరు కనిపించలేదు కానీ ఆ బోగీలో ఓ చివరనా తెల్లటి చీర కొంగు కనిపించేసరికి రఘుకి ప్రాణాలు పైపైనే పోయినట్లుగా అనిపించింది.

ఎవరైనా అక్కడున్నారేమోనని వెంటనే కేకేసి చూశాడు. కానీ ఉలుకు పలుకు లేకపోయేసరికి గుండె ధబేలుమంది. ఖచ్చితంగా అది దెయ్యమేనని రఘుకి అర్థమయ్యింది. ఆ బోగీలోనుండి పారిపోదామని చూశాడు కానీ మరోవైపు తలుపు లేదు. తలుపులున్న వైపు నుండి పారిపోదామంటే అటువైపు తెల్ల చీర కొంగు కనిపిస్తోంది. అంతలోనే ఆ బోగీలో ఉన్న లైట్లు కూడా మినుకు మినుకుమంటూ కొట్టుకోసాగాయి. ఎవరో తన వైపు వస్తున్నట్లుగా  అడుగుల శబ్దం వినిపించింది. కానీ మనిషి జాడ  కనిపించకపోయేసరికి ఇంకా భయంపెరిగింది. అంతలోనే ఒక్కసారిగా ఆ బోగిలో ఉన్న లైట్లన్నీ ఆరిపోయాయి.

దాంతో రఘుకి వణుకు మొదలయ్యింది. తను  ఆ బోగీలోనుంచి బయటపడడానికి మార్గమే లేకుండా పోయింది. ఎవరో బెంగాలీ భాషలో పాట పాడుతున్నట్లుగా అనిపించింది. కిటికీ సందుల్లోనుంచి బయటికి తొంగి చూశాడు. ఎటు చూసినా చిమ్మచీకటి తప్ప వెలుగే లేదు. అంతలోనే ఆ పాట ఆగిపోయింది.

మళ్ళీ కాసేపటికి కాలి గజ్జల శబ్దం, గాజుల అలికిడితో పాటు మల్లెపూల వాసన కూడా రాసాగింది. దాంతో రఘు భయంతో వణికిపోతూ సీటు కింద దాక్కొండిపోయాడు. ఎంతసేపు ఎదురుచూసినా అక్కడికి ఎవరు రావట్లేదు కానీ ఆ కొంగు అక్కడినుండి కదలడం లేదు, శబ్దాలు ఆగడం లేదు. కాసేపటికి రఘు తనలోని భయాన్ని తట్టుకోలేకా సీటు కింది నుంచి “ఏయ్ లచన్ కుమారి!, ఇంకా ఎంతమందిని చంపుతావు. నన్ను మాత్రం చంపకు నీకు దండం పెడతాను. నీకు నేను నచ్చకపోతే మరోసారి ఇటువైపు రాను” అని ఏడుస్తున్నాడు. అయినా రఘు ఏడుపుకు బదులు రాలేదు.

అంతలోనే దూరంగా కుక్కలు ఏడవటం మొదలు పెట్టాయి. కుక్కలు దెయ్యాన్ని చూసినప్పుడే అలా ఏడుస్తూ అరుస్తాయని చిన్నప్పుడు తన తల్లి చెప్పిన కథలు గుర్తుకొచ్చాయి. దాదాపు నలభై ఏళ్ళ క్రితం లచన్ కుమారి దెయ్యంగా మారి బేగున్ కోదర్ స్టేషన్ మాస్టరుతో సహా అతని కుటుంబాన్ని కూడా  చంపేసిందనే వార్తలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో భయాన్ని కలిగిస్తుంటాయి.

ఆ సంఘటన తర్వాత ఎంతోమంది ఆ స్టేషన్ పరిధిలో శవాలై తేలారు. అర్ధరాత్రి పూట తెల్ల చీర కట్టుకొని రైల్వే పట్టాల మీద నడుస్తూ లచన్ కుమారి చాలామందికి కనబడిందని కథలు కథలుగా చెప్పుకుంటారు. రఘు అలాంటి కథల్ని పేపర్లో చాలాసార్లు చదివాడు. కానీ నిజ జీవితంలో అదే స్టేషన్లో ఒంటరిగా చిక్కుకుపోతానని ఊహించి లేదు. కాసేపటికి కుక్కలన్నీ వచ్చి రఘు ఉన్న భోగి చుట్టూ అరుస్తున్నాయి. దాంతో రఘుకి ఏం చేయాలో అర్థం కాలేదు.

ఆ కుక్కలు అలా అరుస్తుంటే దయ్యానికి కోపమొచ్చి తన పీక కొరికేస్తుందేమోనని భయపడి పోయాడు. అప్పటివరకు దెయ్యాన్ని తిట్టినవాడు ఆ కుక్కల్ని తిట్టడం మొదలు పెట్టాడు. తనను అలాంటి విపత్కర పరిస్థితుల్లో వదిలేసిన రైల్వే సిబ్బందిని కూడా తిట్టుకున్నాడు. క్షణక్షణానికి తన గుండె వేగం పెరుగుతుండగా రఘు ఏడుస్తూ కేకలేస్తున్నాడు. అతని కేకల మధ్య ఆ రాత్రి కరిగిపోయి తెల్లారిపోయింది.

ఉదయం రైల్వే సిబ్బంది వచ్చి రఘుని చూసి ఆశ్చర్యపోయి,”రాత్రంతా ఓ దెయ్యం ఇదే బోగీలో అరుస్తుంటే నీవిక్కడేం చేస్తున్నావ్. రైల్ ఇంజిన్ లో సమస్య ఉందని అందరు ప్రయాణికుల్ని ఇంతకు ముందు స్టేషన్లోనే దిగిపోమ్మని చెప్పాం కదా, మరి నీవు దిగలేదా? ” అని అడిగారు. దాంతో కంగుతిన్న రఘు తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆ దెయ్యం ఇక్కడే ఉందని ఆ చీర కొంగున్న చోటికి తీసుకెళ్ళి అవాక్కయ్యాడు. ఎందుకంటే అక్కడెవరో తెల్లటి చున్నీని వదిలేసి వెళ్ళిపోయినట్లున్నారు. దాన్ని చూసి రఘు దెయ్యమనుకొని భయపడిపోయాడు. రఘు తన అవివేకాన్ని తొందరపాటును గుర్తించి మౌనంగా ఉండిపోయాడు.

“సర్!, ఈ రైలుని మేం రాత్రే తీసుకెళ్లాలని చూశాం. కానీ ఈ భోగిలో ఓ దెయ్యం ఏడుస్తూ కేకలేస్తూ రకరకాల భాషల్లో మాట్లాడేసరికి మేం భయపడి ఈ రైలుని తీసుకెళ్ల లేదు. ఈ చున్నీ కూడా ఆ దెయ్యానిది  అయ్యుంటుంది. ఈ బోగిలో ఇక ఏ ప్రయాణికులు ఎక్కరు. ఈ స్టేషన్ ను మళ్లీ ఎన్ని సంవత్సరాలు మూతపడేస్తారో తెలియదు” అని వెళ్లిపోయారు. రఘు తన మనసులో అనవసరంగా భ్రమపడి  లేని దెయ్యాన్ని, శబ్దాల్ని ఊహించుకొని భయపడిపోయానని ఇక ఆ విషయాన్ని బయటకు చెబితే అందరు నవ్వుకుంటారని తలవంచుకుని అక్కడి నుంచి కదిలాడు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!