Bharadwaja Rangavajhala……………………………………………..
కాంబినేషన్ అనేది హీరో హీరోయిన్లకే కాదు సంగీత దర్శకులు రచయితల మధ్య కూడా కుదరాలి. అపుడే రసరమ్య గీతాలు పుట్టుకొస్తాయి. రాజన్ నాగేంద్ర…యాభై దశకంలో తెలుగు సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగీత దర్శక ద్వయం. వీరి తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే, రోజంతా కచేరీలతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు.ఆయన అప్పట్లో మూకీ సినిమాలకు సంగీతాన్ని అందించేవారు.
కర్ణాటక మైసూరు శివరాం పేట నుంచి వచ్చిన ఈ అన్నదమ్ములతో ఎక్కువ సినిమాలకు పనిచేసిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, జంధ్యాల.అంతకుముందే వారు విఠలాచార్య గారి సినిమాలతో సహా కొన్ని తెలుగు చిత్రాలకు పన్జేశారు. కానీ ఈ ఇద్దరి సినిమాల్లోనూ ముఖ్యంగా వేటూరి కాంబినేషన్ లో వచ్చిన పాటలూ గొప్పగా ఉంటాయి.
నవగ్రహ పూజా మహిమలో ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురో లాంటి పాటలున్నప్పటికీ .. ఈ ఇద్దరు దర్శకుల చిత్రాలకూ అధికంగా పాటలు రాసింది వేటూరి సుందరరామమూర్తి. వీళ్లు లేకపోయుంటే … పండగంటి వెన్నెలలన్నీ దండగ చేసుకోకూడదని మనకెలా తెలిసేది?
సింగీతం శ్రీనివాసరావు అంటే కమల్ హసన్ కు స్పెషల్ ఇంట్రస్టు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రం ‘సొమ్మొకడిది సోకొకడిది’.ఈ చిత్రానికి రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. ‘రాధమ్మ మనసు రాగాలు తెలుసు…అది తీపికోపాల వయసు’ అంటూ వేటూరి కలం పోయే గడుసు వయ్యారాలను అందంగా తమ స్వరంలోకి పొదిగారు రాజన్ నాగేంద్రలు.
సింగీతం కాంబినేషన్ లోనే వచ్చిన మరో మూవీ ‘పంతులమ్మ’. నవతా కృష్ణంరాజు తీసిన రెండో సినిమా ఇది. ఇందులో రాజన్ నాగేంద్ర వేటూరి త్రయం. ప్రతి పాటా ఆణిముత్యమే. ‘పండగంటి వెన్నెలంతా దండగైపోతోంది చందరయ్యా’…’మానసవీణా మధుగీతం’…ఇలా ఏ పాటనూ కాదనలేని రేంజ్ లో ఉంటాయి. ముగ్గురూ కల్సి తెలుగు ప్రేక్షకులకు చేసిన సంగీతపు విందు ‘పంతులమ్మ’.
నవతా బ్యానర్ లోనే పర్వతనేని సాంబశివరావు డైరక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ ‘ఇంటింటి రామాయణం’.
ఆ చిత్రానికీ రాజన్ నాగేంద్రలనే సంగీత దర్శకులుగా తీసుకున్నారు నవతా కృష్ణంరాజు.వేటూరి వారితో తన అభిరుచికి తగ్గ పద్దతిలో ఓ ఆహ్లాదకరమైన డ్యూయట్ రాయించుకున్నారు. ‘మల్లెలు పూచే…వెన్నెల కాచే’ అంటూ సాగుతుందా గీతం.
జంధ్యాల సినిమాలకు సహజంగానే వేటూరి రాసేవారు. వేటూరి కాకుండా జ్యోతిర్మయి గారు రాసిన చిత్రం ‘మూడుముళ్లు’. అందులో ‘లేత చలి గాలులో’ గీతం వేసవిలో విన్నా…చలేస్తుంది…అంతగా ప్రభావితం చేసే ట్యూనది.నవతా బ్యానర్ లో ‘ఇంటింటి రామాయణం’ చిత్రానికి జంధ్యాల కేవలం డైలాగు రైటర్. ఆ తర్వాత తీసిన ‘నాలుగు స్థంభాలాట’కు డైరక్టరు. ఇద్దరి అభిరుచుల మేరకు రాజన్ నాగేంద్రలనే ప్రిఫర్ చేశారు.
ఆ సినిమా కూడా మ్యూజికల్ గా చాలా పెద్ద విజయం సాధించింది. ‘చినుకులా రాలి’…లాంటి వేటూరి మార్క్ కవిత్వం సినిమాకు కొత్తందాల్ని తెచ్చింది. పర్వతనేని సాంబశివరావు డైరక్ట్ చేసిన కృష్ణ సినిమా అల్లరి బావకూ రాజన్ నాగేంద్రలే స్వరకర్తలు. ఆ సినిమాకు వేటూరి సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్.
‘మధువనిలో రాధికవో’ అంటూ సాగే ఓ ఆహ్లాదకరమైన డ్యూయట్ ఈ కాంబినేషన్ లో వచ్చినదే.’పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది’…అంటూ సాగే ఓ అందమైన యుగళగీతం ‘పులి బెబ్బులి’ సినిమాలో వినిపిస్తుంది. కె.ఎస్.ఆర్ దాస్ లాంటి ఫక్తు కమర్షియల్ డైరక్టర్ సినిమాలో ఈ తరహా గీతాన్ని ఎక్స్ పెక్ట్ చేయడం కష్టమే. కృష్ణంరాజు, చిరంజీవి నటించిన మల్టీ స్టారర్ మూవీ అయినా .. ‘పులి బెబ్బులి’లో పాటలన్నీ రాజన్ నాగేంద్రల స్టైల్ లోనే నడవడం విశేషం.
రాజన్ నాగేంద్ర వేటూరి ఉండడం వల్లే ‘నాగమల్లి’ సినిమా బిజినెస్ అయి విడుదలైంది.. లేకపోతే అంతే అనేశారు దర్శకుడు దేవదాస్ కనకాల నాతోనే … అంతటి ప్రభావవంతమైన కాంబినేషన్ వీళ్లది …జంధ్యాల కెరీర్ లో ఎక్కువగా ఇద్దరు సంగీత దర్శకులతో పనిచేయడానికి ఇష్టపడేవారు. ఒకరు రమేష్ నాయుడు తప్పితే రాజన్ నాగేంద్ర.
‘రెండు జళ్ల సీత’కు రమేష్ నాయుడు సంగీతం అందిస్తే…’రెండు రెళ్లు ఆరు’కు రాజన్ నాగేంద్రలు మ్యూజిక్ కంపోజ్ చేశారు. అందులో వేటూరి మార్క్ చిలిపి గీతం ఒకటి మెరుస్తుంది. ‘చిరుగాలి దరఖాస్తు లేకుంటె కరిమబ్బు…మెరుపంత నవ్వునా…చినుకైన రాల్చునా’ అంటూ నడుస్తుందీ పాట నడక. చిలిపి కవిత్వమే కాదు…అందంగా జీవన వేదాంతాన్ని కూడా చెప్పగలగడం వేటూరి స్పెషాల్టీ.
ఇలాంటి సందర్భం వంశీ ‘మంచు పల్లకీ’లో వచ్చింది. ఆ చిత్రానికి రాజన్ నాగేంద్రలనే సంగీత దర్శకులుగా నియమించుకున్నాడు వంశీ. హీరోయిన్ నవ్వుతూ కనిపిస్తుందిగానీ…ఆ నవ్వులను కబళిస్తూ…ఆమె ఆరోగ్యం శిధిలమైపోతూ ఉంటుంది.అందుకే మంచు పల్లకీ అని టైటిల్ పెట్టుకున్నారు.
దేహాన్ని మేఘంతో పోలుస్తూ…’కురిసినా….మెరిసినా…కరుగునే జీవనం’ అంటాడు.ఈ పాటకోసం సొంత ట్యూను కడతాను అన్నప్పటికీ తమిళ మాతృకలో శంకర్ గణేశ్ లు స్వరపరచిన గజల్ బేస్ట్ ట్యూనునే తీసుకోమని నిర్మాతలు బలవంతం పెట్టేసరికి దాంతోనే కొనసాగారు రాజన్ నాగేంద్రలు.
చినుకులా రాలి … నదులుగా సాగి వరదలైపోయిన సంగీత సాహిత్య సమాగమం వేటూరి రాజన్ నాగేంద్ర. ఈ త్రయం మనకందించిన అపురూప గీతాలు అనేకం. మీ కోసం జీవితమంతా వేచాను సంధ్యలలో … అని ముగ్గురి గురించీ పాడుకోవడం తప్ప మనం ఏం చేయగలం …ఆ ముగ్గురిలో నాగేంద్రగారు 2000 నవంబర్లో వెళ్లిపోయారు. వేటూరి 2010 లో కన్నుమూసారు. చివరిగా రాజన్ గారు 2020 అక్టోబర్ లో కనిపించని మరోలోకానికి వెళ్లిపోయారు.