సకల కళా వల్లభన్ ఈ స్వాతి తిరునాళ్!!

Sharing is Caring...

Ravi Vanarasi ………

స్వాతి తిరునాళ్ రామ వర్మ సంస్కరణల పరంపరను పరిశీలిస్తే, ఆయన కేవలం ఒక కళాకారుడు మాత్రమే కాదని, ఆయన ఒక అత్యంత దక్షత కలిగిన, ప్రగతిశీల పరిపాలకుడని స్పష్టమవుతుంది. 
స్వాతి తిరునాళ్ రామ వర్మ జీవితంలో అత్యంత ప్రధానమైన, శాశ్వతమైన భాగం ఆయన సంగీత వారసత్వం.

ఆయనను ‘గర్భ శ్రీమంతుడు’ (బాల్యం నుంచే సంగీతంతో అనుబంధం ఉన్న వ్యక్తి) అని పిలవడంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన కేవలం సంగీతాన్ని ఆస్వాదించడమే కాక, దానిని కొత్త శిఖరాలకు చేర్చిన మహోన్నత సృష్టికర్త.

ఆయన రచనలు కేవలం పరిమాణంలోనే కాక, వైవిధ్యంలోనూ అద్భుతమైనవి. ఆయన దాదాపు 400కు పైగా రచనలు చేసినట్టు అంచనా. ఈ రచనలు కేవలం కర్ణాటక సంగీతానికే పరిమితం కాకుండా, హిందూస్తానీ సంగీతంలో కూడా విస్తృతమై ఉన్నాయి.ఆయన రచనలలో అధిక భాగం సంస్కృతంలోనే ఉన్నాయి.

‘పద్మనాభ’ అనే తన ఆరాధ్య దైవం ముద్రను ఆయన రచనలలో ఉపయోగించారు. సంస్కృతంలో ఆయన రాసిన కీర్తనలు, వర్ణాలు, చరణాలు శబ్దాలంకారంతో, ప్రౌఢ భాషతో, లోతైన భక్తి భావంతో నిండి ఉంటాయి. ఉదాహరణకు, ‘భావయామి రఘురామం’ (శుద్ధ ధన్యాసి రాగం, ఆదితాళం) అనేది రామాయణాన్ని సంక్షిప్తీకరించి, అత్యంత రసవత్తరంగా వర్ణించిన కృతి. ఈ కృతి కేవలం సంగీత రచన మాత్రమే కాదు, అది కావ్య సౌందర్యం నిండిన ఒక చిన్న గ్రంథం.

మాతృభాషలో ఆయన రాసిన ‘పదాలు’ (శృంగార రస ప్రధానమైనవి) తిరువాంకూరు ఆలయాలలో నృత్య ప్రదర్శనలకు (మోహినియాట్టం) ప్రామాణికంగా నిలిచాయి. ఇతర దక్షిణ భారత భాషల్లో కూడా ఆయన కృతులు రచించడం, ఆయనకు ప్రాంతీయ సంస్కృతులపై ఉన్న అపారమైన గౌరవాన్ని, పట్టును తెలియజేస్తుంది. కర్ణాటక సంగీతంలో తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యతను ఆయన గుర్తించి, ఆ భాషలో కూడా రచనలు చేశారు.

స్వాతి తిరునాళ్ సంగీత రచనలు కేవలం కీర్తనలకే పరిమితం కాలేదు. ఆయన వివిధ సంగీత రూపాలలో తన ప్రజ్ఞను ప్రదర్శించారు..ముఖ్యంగా ‘నవగ్రహ కీర్తనలు’ (తొమ్మిది గ్రహాలపై తొమ్మిది కృతులు)  ‘నవరాత్రి కీర్తనలు’ (దేవీ నవరాత్రులపై తొమ్మిది కృతులు) ఆయన ప్రముఖ రచనలు.

ఈ నవగ్రహ కృతులలో, ఒక్కో గ్రహాన్ని ఒక రాగం, ఒక తాళంలో అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఉదాహరణకు, ‘దివాకరతనుజం’ (శనిగ్రహంపై) రాసిన కృతి ఆయన గణితపరమైన, సంగీతపరమైన మేధస్సును స్పష్టం చేస్తుంది.

వర్ణాలు…ఇవి రాగం, తాళం, లయ  సంక్లిష్టతలను ప్రదర్శించే ప్రధాన సంగీత రూపాలు. ఆయన వర్ణాలు నృత్య, గాత్ర ప్రదర్శనలకు అనుకూలంగా ఉండేవి.పదాలు, జావళీలు…ఇవి ముఖ్యంగా శృంగార రసాన్ని, నాయక-నాయిక భావాన్ని దేవతలకు అన్వయిస్తూ వర్ణించేవి. ఇవి నృత్య ప్రదర్శనలకు అద్భుతమైన కంటెంట్‌ను అందించాయి.
తిల్లనాలు…
లయ ప్రధానమైన ఈ రచనలు, కర్ణాటక సంగీతంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి.దక్షిణాది రాజు అయినప్పటికీ, ఆయన హిందూస్తానీ సంగీతంలో ‘ఖయాల్’, ‘తుమ్రీ’, ‘ధ్రువపద్’ వంటి రూపాలలో రచనలు చేశారు.

దీనికి కారణం, ఉత్తరాది సంగీతకారులను, ముఖ్యంగా ఢిల్లీ, లక్నో ప్రాంతాల నుండి విద్వాంసులను ఆహ్వానించడం. ఆయన ఆస్థానం ఉత్తర, దక్షిణ భారతీయ సంగీతాల మేళవింపునకు ఒక అపూర్వమైన వేదికగా నిలిచింది.

స్వాతి తిరునాళ్ సంగీతానికి, సాహిత్యానికి ఆయన ఆస్థానంలోని పండితులు, విద్వాంసులు అదనపు బలాన్ని ఇచ్చారు. తంజావూరు సోదరులు…ముఖ్యంగా వడివేలు,ఇరయిమ్మన్ తంపి ,షడ్కాల గోవింద మారార్ వంటి కళాకారులతో ఆస్థానం ఒక సంగీత విశ్వవిద్యాలయంలా పనిచేసింది. 

అక్కడ విద్వాంసులు తమ కళలను మెరుగుపరచుకోవడానికి, కొత్త రాగాలను సృష్టించడానికి, సంగీత రూపాలను ప్రామాణీకరించడానికి ప్రోత్సాహం లభించింది.ఆయన విద్వత్ సభ (దర్బార్) భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రసిద్ధి చెందింది.

ఈ సభ కేవలం సంగీతానికి మాత్రమే కాదు, వివిధ శాస్త్రాలకు, సాహిత్యానికి, కళలకు కూడా ఒక కేంద్రంగా ఉండేది.ఆయనకు కేవలం కళల పట్ల మాత్రమే కాదు, ఆధునిక శాస్త్రాల పట్ల కూడా అపారమైన ఆసక్తి ఉండేది. ఆయన  సభలో కవులు, వేదాంతవేత్తలు, ఆయుర్వేద వైద్యులు, జ్యోతిష్యులు ఉండేవారు. వారిలో కొందరు ఆయన రచనలకు వ్యాఖ్యానాలు రాయడంలో సహాయపడ్డారు.

ఆయన స్వయంగా ‘ఉత్సవ ప్రబంధం’, ‘ముహూర్త గ్రంథం’ (జ్యోతిష్యంపై) వంటి రచనలను రచించారు. ఇది ఆయన వివిధ శాస్త్రాలలోకి ఎంత లోతుగా వెళ్ళారో తెలియజేస్తుంది. స్వాతి తిరునాళ్ దర్బారు ఒక విధంగా, జ్ఞానానికి, కళలకు ఒక స్వర్గధామం. ఆయన రాజుగా ఉన్నంతకాలం, కళాకారులకు  పండితులకు రాజ్యంలో అత్యున్నత గౌరవం, స్థానం లభించాయి.

రాజుగా, పండితుడిగా, సంగీతకారుడిగా అద్భుతమైన జీవితాన్ని గడిపిన స్వాతి తిరునాళ్  వ్యక్తిగత జీవితం కొంత విషాదభరితమైనది. ఆయన వివాహాలు, వారసత్వ సమస్యలు ఆయన చివరి రోజులలో కొంత మానసిక వేదనను కలిగించాయి.స్వాతి తిరునాళ్ ప్రధానంగా రెండు వివాహాలు చేసుకున్నారు. 
నారాయణి పిళ్లై తంగాచ్చి…
ఈమెతో ఆయనకు లోతైన అనుబంధం ఉండేది. ఆమెకు ప్రత్యేకంగా ‘అమ్మాచ్చి’ అనే రాజరిక హోదా ఇచ్చారు. వారి వివాహ జీవితం కొంత సంతోషంగా సాగినప్పటికీ, స్వాతి తిరునాళ్కు వారసుడిగా ఎవరూ లేకపోవడం రాజరిక కుటుంబంలో ఒక పెద్ద సమస్యగా మారింది. తిరువాంకూరు వారసత్వ చట్టం (మరుమక్కత్తాయం) ప్రకారం, ఆయన మేనల్లుడు లేదా మేనకోడలు సింహాసనాన్ని అధిరోహించాలి.

తిరువట్టార్ అమ్మ వీడు జానకి పిళ్లై…ఆయన రెండవ భార్య.వారసత్వ సమస్యలు ..  బ్రిటీష్ రెసిడెంట్ జోక్యం ఆయన చివరి రోజులలో తీవ్రమైన మానసిక వేదనకు కారణమయ్యాయి. ఆయన కళలపై ఎంత నిమగ్నమై ఉన్నా, రాజరిక ఒత్తిడులు, అంతర్గత కలహాలు,  అశాంతి ఆయనను వెంటాడాయి.

మహారాజా స్వాతి తిరునాళ్ కేవలం 33 సంవత్సరాల చిన్న వయస్సులోనే, క్రీ.శ. 1846వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన కన్నుమూశారు. ఈ అకాల మరణం తిరువాంకూరుకు, భారతీయ సంగీతానికి ఒక తీరని లోటు. ఆయన మరణానికి సంబంధించిన కచ్చితమైన కారణాలు చరిత్రలో పూర్తిగా స్పష్టంగాలేవు. 

తీవ్రమైన మానసిక ఒత్తిడి, పాలనా వ్యవహారాల భారంతో పాటు, బ్రిటీష్ రెసిడెంట్ నిరంతర జోక్యం, దాని వల్ల ఏర్పడిన నిస్సత్తువ ఆయన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని  చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
ఆయన మరణం తరువాత, ఆయన సోదరుడు, ఉత్తరం తిరునాళ్ మార్తాండ వర్మ, మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించారు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!