ఈ ‘మాంఝీ’ మామూలోడు కాదు !

Sharing is Caring...

రమణ కొంటికర్ల…………..    ‘Manjhi The Mountain Man’ movie 

बहुत बड़ा है तू बहुत अकड़ है तेरे में देख कैसे उखाड़ते हैं तेरा अकड़.. అంటూ కొండనే బెదిరించే డైలాగ్స్ తో మొదలై… వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్నట్టుగా సాగుతుంది దశరథ్ మాంఝీ బయోగ్రఫికల్ స్టోరీ. जब तक तोड़ेंगे नहीं.. तब तक छोड़ेंगे नहीं.. అన్న అణువణువూ పట్టుదల ఆ సినిమాకు ఊపిరైతే… దానికి ఆయువుపట్టు ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయిన నవాజ్ సిద్ధిఖీ. అందుకే విమర్శకుల ప్రశంసలకు నోచుకున్న చిత్రమది. 

ఎప్పుడో 2015లోనే వచ్చిన చిత్రం…  కొండలను కొట్టగల్గే శక్తుండీ… కోడిగుడ్డు పగులగొట్టి జబ్బలు చర్చుకునేవారెందరినో చూసే రోజుల్లో… ఓ కొండనే తవ్వేసి రోడ్డేసిన మౌంటెన్ మ్యాన్ దశరథ్ మాంఝీ. మరి గాయన గురించి తెలిసిన జనానికి.. గిప్పుడీ గీ రివ్యూ ఎందుకనిపిస్తుండవచ్చుగాక..?!!

ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలోనూ… ఈస్ట్ మన్ కలర్ చిత్రాల కాలంలోనో.. పల్లె జీవితాలనొడిసిపట్టిన ప్రముఖ దర్శకులు ఆఫ్ బీట్ సినిమాలు చూస్తున్నప్పుడు కథ, కథనం అన్నీ నచ్చినా… అరె ఈ ప్రింటింకింత బాగుంటే మంచిగుండనుపిస్తుంటుంది. అగో ఆ లోటు లేకుండా మౌంటెన్ మ్యాన్ సినిమాను హై డెఫినెషిన్ లో… రాజీవ్ జైన్ మూడో కన్నుతో సెల్యూలాయిడ్ కెక్కించి ఔరా అనిపించిన కృతకృత్యుడు కేతన్ మెహతా.  సందేష్ శాండిల్యా మ్యూజిక్ మరో అదనపు ఆకర్షణ.

మనం నాటకాల్లో ఏకపాత్రాభినయాలు చూస్తుంటాం. కానీ మాంఝీలో ఏ పాత్రకాపాత్రే ఏకపాత్రాభినయం ప్రదర్శిస్తుంటే.. అబ్బా తెరకెక్కించడంలో ఎంత సజీవత ఉట్టిపడిందని ఆశ్చర్యపరుస్తుంది మాంఝీ. ముఖ్యంగా ఇద్దరి ద్విపాత్రాభినయంపైనే సినిమా మొత్తం నడుస్తుంటుంది.

నవాజ్ సిద్ధిఖీ… ఈ కాలంలో ఇండియన్ సెల్యూలాయిడ్ కు దొరికిన బహు కొద్దిమంది అద్భుతమైన ఆర్టిస్టుల్లో ఆయనొకరని ఈ సినిమా చూశాక కన్ ఫర్మ్ చేయని పచ్చి విమర్శకులు కూడా ఉండరేమో బహుశా!  అదిగో అంతే అద్భుతంగా నటించింది హీరోయిన్ పాత్రలో… అదే దశరథ్ మాంఝీ భార్య పాత్రలో రాధికా ఆప్టే.

దశరథ్ మాంజీ పుట్టినిల్లైన బీహార్ లోని గయా జిల్లాలో గెహ్లార్ ఓ మారుమూల పల్లె. విద్య, వైద్యం, మంచినీరు ఇలా ఏ కనీస ప్రాథమిక సౌకర్యం కూడా లేని తన ఊరి నుంచి వజీర్ గంజ్ అనే పట్టణానికి చుట్టూ తిరిగి వెళ్లాలంటే 55 కిలోమీటర్ల దూరం. కానీ పర్వతాన్ని తొలగించి కేవలం 110 మీటర్ల రోడ్డును నిర్మిస్తే ఏకంగా ఆ దూరం కేవలం 15 కిలోమీటర్లే అవుతుంది.

కానీ ఏ ప్రభుత్వమూ పట్టించుకోదు. ఊళ్లో వైద్యమందక చనిపోయేవారు… విద్యకు నోచుకోక నిరక్ష్యరాస్యులుగా మిగిలిపోతున్నవారు ఇలా ప్రాథమికమైన అంశాలెన్నో మాంఝీని కదిలిస్తాయి. తన భార్య అదే పర్వతం పైనుంచి పడి… సమయానికి సరైన వైద్యమందక చనిపోయిన ఘటన మాంఝీలో ఇంకా కసిని రగిలిస్తుంది. నేతలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఏమీ లాభముండదు.

అక్కడి ప్రభుత్వాలు, నాయకుల దృష్టిలో.. గెహ్లార్ కు రోడ్డు సౌకర్యం ఓ ఎన్నికల హామీ మాత్రమే. అదిగో అప్పుడు మాంఝీ అనే ఒక వ్యక్తే.. ప్రభుత్వాలు చేయలేని పనిని ఓ శక్తై ఎలా చేశాడన్నది ఈ ప్రపంచం విన్న, అక్షరాల్లో చదివిన నిజమైతే… ఆ నిజాన్ని అంతే అద్భుతంగా కళ్లకు కట్టిన సెల్యూలాయిడ్ రూపం కేతన్ మెహతా మాంఝీ.

దేశంలోనే అతి నిమ్న కులాల్లో ఒకటైన భూయ్యా అనే సామాజికవర్గంలో బాండెడ్ లేబర్ కుటుంబంలో పుట్టి… బాల్యవివాహమైుపోయి… తాగుబోతు తండ్రి తాను తీర్చని అప్పుకు కొడుకుని బాండెడ్ లేబర్ ను చేసే క్రమంలో పారిపోయే మాంఝీ… ఆ తర్వాత ధన్ బాద్ లో కోల్ మైన్స్ లో పని కుదిరి కాస్తోకూస్తో సంపాదించుకుని ఊరికి రావడం.. తన డ్రెస్సింగ్ స్టైల్… హావభావాలు ఇలా అన్ని కోణాల్లోనూ నవాజ్ సిద్ధిఖీ నటన సో ఇంప్రెసివ్.

అప్పటికే అంటరానితనం నిషేధమని ప్రభుత్వం ప్రకటించడం… ఊరికి రాగానే దురంహకారంతో ఊరిని శాసిస్తున్నవారిని చూసి వారిలోనూ ప్రభుత్వం ప్రకటించిన మార్పు వచ్చిందనుకుని దగ్గరకు వెళ్లి వారి కుశల సమాచారాన్ని తెలుసుకోవడం… మాంఝీ డ్రెస్సింగ్, స్టైల్ వంటివి చూసి పట్టణం మనిషని తెలుసుకుని దొర, ఆయన కొడుకు దగ్గరకు తీస్తారు. 

ఆ తర్వాత తానెవరో తెలిసాక థూ నీ బతుకంటూ అదే దురహంకారాన్ని చూపడం ఇలా… ఒకవైపు అణగారిన వర్గాల బతుకు చిత్రాన్ని… ఇంకోవైపు అగ్రకుల ఆధిపత్యాన్నిఒడిసిపట్టే ప్రయత్నంలో సాగింది కేతన్ మెహతా స్క్రీన్ ప్లే.

ఫగునియా పాత్రలో రాధికా ఆప్టే యాక్టింగ్ కూడా అదుర్స్. తాను బాల్యవివాహం చేసుకున్న ఫగుణియా ఇంతందంగా తయారైందా అని బాల్యంలో వెళ్లిపోయిన మాంఝీ.. తిరిగి తన ఊరుకొచ్చాక… ఆమె తల్లిదండ్రులనెదిరించి మళ్లీ కాపురం పెట్టడం… తాను వేయాలనుకున్న రోడ్డుకు ఆమె అణువణువునా స్ఫూర్తినివ్వడం… రోడ్డు వేసే క్రమంలో అగ్రకులాల ఆధిపత్య ధోరణుల్లో…ఎదుర్కొనే సవాళ్లు ఇలా నడుస్తుంది సినిమా అంతా!

ఎండాకాలంలో భానుడు భగభగ మండుతుంటే ఊళ్లో నీళ్లింకిపోయి అంతా పక్క ఊళ్ళకు వలస వెళ్లినా… తాను మాత్రం పర్వతాన్ని పగులగొట్టి రోడ్డు వేసే పనిలోనే నిమగ్నమవుతాడు మాంఝీ. ఆ క్రమంలో నీళ్లు దొరకని దుస్థితిలో… ఓ పాము కాటుకు గురైన తరుణంలో నవాజ్ సిద్ధిఖీ నటన.. వా… ఈరోజుల్లోనూ ఇంత మంచి నటులా అనిపిస్తుంది.

అయితే మాంఝీ సినిమాలోనూ మీడియాదే మళ్లీ ప్రముఖ పాత్ర. మాంఝీ చేస్తున్న కృషికి  అలోక్ ఝా అనే జర్నలిస్ట్ నుంచి సంపూర్ణ సహకారమందటం సినిమాలో ప్రధాన ఘట్టం. ఈ పొల్టీషియన్స్ ప్రభావంతో అసలు వార్తలు రాసినా రాని పరిస్థితి. తన ఆవేదనను ఝా వ్యక్తం చేయడం… అప్పుడు మరి నువ్వే ఓ పేపర్ పెట్టొచ్చుగా అని మాంఝీ ఝాతో అంటాడు. 

అదంత వీజీ కాదన్న ఝాకు… మాంఝీ “पहाड़ तोड़े से भी मुश्किल कॉम है का?” అన్న ప్రశ్నతోనే సమాధానం చెప్పడం.. ఇవన్నీ వారిమధ్య బంధాన్ని బలపర్చే సీన్లుగా చూపిస్తాడు దర్శకుడు.పట్టుదల, శ్రమ, అంకుఠిత దీక్ష ఇలాంటి ఎన్నో పర్యాయపదాలకు చిహ్నంగా నిల్చి… 22 ఏళ్లపాటు పర్వతాన్ని బద్దలు కొట్టి ఓ రోడ్డు సృష్టించిన బీహారీ దశరథ్ మాంఝీ  2007లో అసువులు బాసాడు.

బీహార్ ప్రభుత్వం 2011 వరకుగానీ  అక్కడ  ఓ మెటల్ రోడ్డు వేయలేకపోయిన దుస్థితి ఆ గ్రామానిది. బీహార్ ప్రభుత్వం అతడికి పద్మశ్రీ ఇవ్వాలని సూచించడం… ప్రభుత్వం పోస్టల్ స్టాంప్స్ పై మాంఝీ బొమ్మను ముద్రిస్తుంది.

ఇంత పెద్ద దేశంలో ఓ గ్రామం కోసం అహరహం శ్రమించిన ఓ నిమ్నకులస్థుడికి దక్కిన గౌరవంగా భావించాలో… లేక నిత్యం రాజకీయాలనే శ్వాసిస్తూ శాసిస్తూ బతికే నాయకులకు ఎలా గౌరవించుకోవాలో ఇంకా తెలియదని బాధపడాలో అర్థం కాని పరిస్థితి.

ఏదేమైనా దశరథ్ మాంఝీ బయోగ్రఫికల్ స్టోరీని భవిష్యత్తు తరాలకు  అంతే అందంగా హెచ్డీ ఫార్మాట్ లో తెరకెక్కించి అందించిన కేతన్ మెహతా దర్శకత్వ ప్రతిభ… నభూతో నభవిష్యత్ అన్నట్టుగా స్వయానా దశరథ్ మాంఝీనే సినిమాలో నటిస్తున్నాడా అన్నట్టు జీవించిన నవాజ్ సిద్ధిఖీ… అంతే పోటీనిచ్చిన ఫగునియా పాత్రలోని రాధికా ఆప్టేను ఈ సినిమా చూశాక అభినందించకుండా ఉండగలరా..?!!సినిమా యూ ట్యూబ్ లో ఉంది. చూడని వారు చూడవచ్చు

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!