వెయ్యేళ్ళ చరిత్రకు సాక్ష్యం ఈ జింజీ కోట !!

Sharing is Caring...

Siva Racharla ……………………….    Historical landmarks

అరుణాచలం అందరికి తెలుసు.. శంకరాపరణిని నది తెలుసా? జింజీ తెలుసా?అరుణాచలం నుంచి పాండిచ్చేరి వెళ్లే హైవే లో రోడ్  \పక్కనే నిలువెత్తున మూడు గిరులు ఆనందగిరి (రాజగిరి), క్రిష్ణగిరి, చంద్రయాన్ గిరి/దుర్గ్ వెయ్యేళ్ళ చరిత్రకు సాక్ష్యంగా నిలిచి కనిపిస్తాయి. ఆగి చూస్తే ఇంత దుర్బేధ్యమైన కోట ఇక్కడ ఉందా అనిపిస్తుంది.

శ్రీకృష్ణ దేవరాయలు చక్రవర్తి అయిన తరువాత 1509లో  వైయప్ప నాయక్, తుబాకి కృష్ణప్ప నాయక్, విజయరాఘవ నాయక్ ,వెంకటప్ప నాయక్ నేతృత్వంలో ఒక పెద్ద సైన్యాన్ని దక్షిణాదికి పంపి ప్రస్తుత తమిళనాడు మొత్తాన్ని ఆక్రమించారు. చోళ (తంజావూర్ )పాండ్య (మధురై) రాజ్యాలను విజయవంతంగా అధీనంలోకి తీసుకున్న తరువాత, కృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని మధురై, తంజావూరు, జింజీ అని మూడు నాయంకరాలుగా (గవర్నరేట్‌)  విభజించారు.

కృష్ణప్ప నాయక్‌ను జింజీ నాయకర్ గా నియమించారు. తమిళ్లో సెంజీ ,మరాఠాలో చెంజీ తెలుగులో జింజీ అని పిలిచే జింజీ ఉత్తరాన పాలార్ నది నుండి దక్షిణాన కొలెరూన్/ కొల్లిడం నది వరకు విస్తరించి ఉన్న భూభాగాన్ని పాలించిన నాయక పాలకుల శ్రేణికి  బలమైన కోటగా మారింది. ఈ నాయికర్స్ కాలక్రమేణా వారు గొప్ప అధికారాన్ని సంపాదించారు , స్వతంత్ర నాయకులుగా పాలించడం ప్రారంభించారు.

వెల్లూర్ ఊరి మధ్యలో ప్రవహించేది పాలార్ నదే. వెల్లూర్ కోట కన్నా జింజీ కోట కనీసం నాలుగు వందల ఏళ్ళ పురాతనమైనది. జింజీ కోటకు పునాదులు వేసింది “కోన్” అనే యాదవ వంశస్థులు. 1190లో ఆనంద్ కోన్ జింజీలో ఆనందగిరి మీద చిన్న దుర్గాన్ని నిర్మించారు. ఆయన వారసుడు కృష్ణ కోన్ 1240లో క్రిష్ణగిరి మీద కోటను నిర్మించాడు. ఆ తరువాత కోనేరి కోన్, గోవింద కోన్ మరి కొన్ని దుర్గాలను నిర్మించారు.

జింజీ కోట శంకరాపరణిని నది సమీపంలో ఉంది. ఈ నదిని వరాహనది లేదా జింజీ  నది అని కూడా అంటారు. ఈ పరివాహకం అత్యంత సారవంతమయినదేమి కాదు. ఆర్ధిక వనరులు కూడా తక్కువే అందుకే కోన్ వంశం ఆధీనంలో ఉన్నత కాలం జింజీ కోట చిన్న దుర్గంగా మిగిలిపోయింది. విజయనగర సామ్రాజ్యం, నాయకర్ల పాలన మొదలైన తరువాతనే జింజీ వైభవం పెరిగింది

16వ శతాబ్దంలో తుబాకి కృష్ణప్ప నాయక్  జింజీ నాయక్ ల వంశాన్ని స్థాపించాడని నమ్ముతారు. ఈయన పాలనలో కళ్యాణ మహల్ ని, అనేక ధాన్యాగారాలను నిర్మించి, కొండ కోటల చుట్టూ ఉన్న గోడను కూడా పటిష్టం చేశాడు. కృష్ణప్ప నాయక పాలనలో, ప్రసిద్ధ జెస్యూట్ బోధకుడు ఫాదర్ పిమెంటా జింజీ ని సందర్శించాడు,  ఆయన రచనలు జింజీ చరిత్రకు గట్టి ఆధారాలు.

1565 లో విజయనగర సామ్రాజ్యం,  బహమనీ సుల్తానేట్  మధ్య జరిగిన తల్లికోట యుద్ధంలో ఓటమి విజయనగర సామ్రాజ్యం  పతనానికి దారితీసింది. 1614-17లో జరిగిన అంతర్యుద్ధంలో నాయకర్ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవటంతో  సామ్రాజ్యందాదాపు పతనం అయ్యింది.  17వ శతాబ్దం మధ్యలో బీజాపురి సుల్తానేట్ దండయాత్ర ద్వారా జింజీని తమ ఆధీనంలోకి తీసుకొని ఖిలేదార్‌గా సయ్యద్ నాసిర్ ఖాన్‌  నియమించి జింజీ పేరును బాద్‌షహాబాద్‌గా మార్చారు. 

పునాది వేసింది ఎవరు కోట కట్టింది ఎవరు ? పాలించింది ఎవరు ? వీటి సమాధానమే చరిత్ర.. బీజాపూర్ తరువాత శివాజీ ఆధీనంలోకి జింజీ వెళ్ళింది. శివాజీ మరణం తరువాత ఆయన కొడుకు రాజారామ్, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దాడిని తట్టుకోలేక మరాఠాను వదిలి జింజీ చేరాడు.మొఘల్ సైన్యం 1698లో జింజీని కూడా స్వాధీనం చేసుకుంది , నుస్రత్‌గర్ అని పేరు మార్చింది. 1700లో ఔరంగజేబు తన తరపున కోటను పాలించడానికి స్వరూప్ సింగ్ అనే బుందేలా రాజ్‌పుత్ నియమించాడు.

1714లో స్వరూప్ సింగ్ మరణించిన తర్వాత, ఆర్కాట్ నవాబ్, సదాతుల్లా ఖాన్  స్వరూప్ సింగ్ తనకు చాలా డబ్బు బాకీ ఉన్నాడని అతని మీద దాడి చేసి గెలిచాడు. 1707లో ఔరంగజేబు మరణానంతరం, కర్ణాటక నవాబుగా దౌద్ ఖాన్  సింహాసనాన్ని అధిష్టించాడు ఆయన  జింజీని మళ్ళీ తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

జింజీ కోట యొక్క చారిత్రాత్మక ..  సైనిక ప్రాముఖ్యత:  సముద్ర తీరానికి 50 మైళ్ళ సమీపంలో ఉండటం ..యూరోపియన్ వాణిజ్య శక్తుల పెరుగుతున్న వాణిజ్య స్థావరాలకు సమీపంలో ఉండటం … జింజీ కోట strategical విలువను మరింత పెంచింది.1750 CEలో, నవాబుల నుండి ఫ్రెంచి వారు కోటను స్వాధీనం చేసుకున్నారు. కోటకు మరమత్తులు చేసి బలంగా తయారుచేశారు. 

1761లో ఫ్రెంచ్ ప్రధాన స్థావరం పాండిచ్చేరిని ఆంగ్లేయుల గెలవటంతో, జింజీ  కూడా ఆంగ్లేయుల పాలనలోకి వచ్చింది. 1780-99 CE నుండి జింజీ  టిప్పు సుల్తాన్ ఆధీనంలోకి వచ్చింది. అయితే, 1799లో టిప్పు సుల్తాన్ మరణించిన నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం తరువాత  జింజీని ఆంగ్లేయులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దీని తరువాత యుద్ధాలు సమసిపోవటం,  సైన్య నిర్వహణ భారం కావటం…   అంత పెద్ద సైన్యం అవసరం ఇక్కడ లేకపోవటంతో జింజీ కోట నిర్లక్ష్యానికి గురైంది.

ఇన్ని వంశాలు … ఇన్ని యుద్ధాలు… ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న కోట మరొకటి కనిపించదు.అరుణాచల గిరి ప్రదక్షణలో పుణ్యం వచ్చినా రాకున్నా అక్కడికి 50 కిమీ దూరంలో ఉన్న జింజీ కోటను చూస్తే చరిత్ర తెలుస్తుంది, పిల్లలు ఐదు అంతస్తుల కళ్యాణ్ మహల్, కోట అవశేషాలున్న రాజగిరి కొండను ఎక్కటం సులభమే. జింజీ లాంటి చారిత్రక కోటలను చూస్తే తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!