ఇదే పురాతన బిందు సరోవరం !

Sharing is Caring...

బిందు సరోవరం … పంచ సరోవరాల్లో ఇది అయిదవది. ఈ సరోవరం చాలాపురాతనమైనది. గుజరాత్ ‌లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్‌ – డిల్లీ జాతీయ రహదారిలో ఈ సరోవరం ఉన్నది. ఈ సిద్ధపూర్ నే మాతృ గయ అని కూడా అంటారు. ఇక్కడ గంగా సరస్వతి నదుల సంగమ ప్రదేశం వుంది.  సిద్ద్ పుర్ పవిత్రమైన స్థలమని శ్రీ స్థల్ అని భావిస్తారు. పురాణాలలో కూడా ఈ ప్రదేశం గురించి  ప్రస్తావన ఉందంటారు. పురాణాల ప్రకారం దధీచి మహర్షి తన అస్తికలను ఇంద్రుడికి సమర్పించిన ప్రదేశమని అంటారు. పాండవులు ఈ ప్రదేశాన్ని సందర్శించారని చెబుతారు. భగవంతుడు ప్రత్యక్షమైనపుడు ఋషి  దేవహుతి కనుల వెంట జారిన ఆనందాశ్రవులతో   బిందు సరోవరం ఏర్పడిందని అంటారు.అలాగే కపిలుడు బోధించిన గీత వల్ల ఆనందంతో రాలిన బిందువులే బిందు సరోవరం అని అంటారు.

ప్రస్తుతం ఇక్కడి నీరు అపరిశుభ్రం గా వుంది.  ఈ ఆలయాల కి పక్కనే అదే ప్రాంగణం లో గుప్త సరోవర్ అనే సరస్సు ఉంది. విశాలమైన ఆ తటాకం లో నీరు ఆకుపచ్చగా ఉంటుంది. అక్కడే వున్న అశ్వద్ద వృక్షం క్రింద   శ్రాద్ధ కర్మలు చేయిస్తుంటారు. దీన్నే ముక్తి ధామ్ అని కూడా పిలుస్తుంటారు.  సిద్దపూర్ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలలో ఎవరు మరణించినా ఇక్కడికి వచ్చి వారికి అగ్ని సంస్కారాలు నిర్వహిస్తారు. ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. అస్తికలను సరస్వతి నదిలో కలుపుతారు.

ప్రతి ఏటా వేలాదిమంది యాత్రికులు ఇక్కడికొచ్చి తమ మాతృ మూర్తులకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఈ స్థలం ప్రత్యేకత లో ఇదొకటి అని చెప్పుకోవచ్చు. ఉజ్జయిని, కాశీ, ప్రయాగ లలో కూడా ఇలాంటి ముక్తి ధామ్ ఉంది.  సిద్ధ పుర్ అహ్మదాబాద్ కి 114 కి.మీ, దూరం లో వుంది.  రవాణా సదుపాయాలు బాగానే ఉన్నాయి.  బిందు సరోవరానికి చుట్టూ  కపిల, దేవహుతి, కర్దమ మహర్షి, శివ, పార్వతి, గణపతిల  ఆలయాలు వున్నాయి. అలాగే  సత్యనారాయణ మందిరం, శ్రీకృష్ణ ఆలయం, బాలాజీ మందిరం, ఇంకా ఎన్నో  చిన్న ఆలయాలు వున్నాయి.

సిద్ధపూర్‌ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల కోసం ధర్మశాలలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణమే కాబట్టి, అటు వెళ్ళినవారు బిందుసరోవరాన్ని దర్శించుకుని రావచ్చు. ముఖ్యంగా మాతృ,పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకున్నవారు ఈ పంచసరోవర యాత్రలను చేస్తుంటారు.

——– Theja 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!