ఇదే కొత్త పార్లమెంట్ భవనం నమూనా..2022 కి సిద్ధం!

Sharing is Caring...

నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ఇవాళ పునాది పడబోతోంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. టాటా ప్రాజెక్ట్స్ సంస్థ నిర్మించే ఈ నూతన భవనానికి రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 93 ఏళ్ళనాటి ప్రస్తుత పార్లమెంటు భవనానికి బదులుగా ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఈ నూతన భవనంలో పార్లమెంటు ఉభయ సభల సమావేశాలను నిర్వహిస్తారు.
శంకు స్థాపన కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు భౌతికంగా కానీ, వర్చువల్ పద్ధతిలో కానీ హాజరవుతారు. కొత్త  పార్లమెంటు భవనం నిర్మాణం 2022నాటికి పూర్తవుతుందని అంచనా. కాగా కొత్త భవన నిర్మాణ వ్యవహారం కోర్టులో ఉంది. కేవలం భూమిపూజ మాత్రమే నిర్వహించాలని, నిర్మాణం లేదా కూల్చివేత పనులు చేపట్టవద్దని కోర్టు కేంద్రానికి సూచించింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022తో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఇక ఈ భవనానికి ఆరు ప్రవేశ మార్గాలు ఉంటాయి. 1. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి 2. లోక్‌సభ సభాపతి, రాజ్యసభ చైర్‌పర్సన్, ఎంపీలు 3. సాధారణ ప్రవేశ మార్గం, 4. ఎంపీల కోసం మరొక ప్రవేశ మార్గం, 5,6. పబ్లిక్ ఎంట్రన్స్‌లు ఉంటాయి. నాలుగు అంతస్థులతోఈ భవనాన్ని నిర్మిస్తారు. లోయర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, మొదటి, రెండో అంతస్థులు ఉంటాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తారు. ఇక లోక్‌సభ ఛాంబర్‌లో 888 సీట్లు ఉంటాయి. అవసరమైన పక్షంలో రెండు సభలను కలిపి నిర్వహించుకోవచ్చు. 

రాజ్యసభ చాంబర్లో 384 సీట్లు ఉంటాయి.   భూకంపాలు , ఇతర ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఈ నూతన భవనం రూపొందుతుంది.  ఇందులో  120 కార్యాలయాలు ఉంటాయి. కమిటీ సమావేశ మందిరాలు, పార్లమెంటరీ వ్యవహారాల ప్రధాన కార్యాలయాలు, లోక్‌సభ సచివాలయం, రాజ్యసభ సచివాలయం, ప్రధాన మంత్రి కార్యాలయం, కొందరు ఎంపీల కార్యాలయాలు, సిబ్బంది, భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తారు. ఆధునిక హంగులన్నీ ఉండేలా నిర్మాణం జరుగుతుంది. దేశీయ వాస్తు రీతుల్లో ఈ భవనాన్ని నిర్మిస్తారు. నిర్మాణంలో పాలుపంచుకుంటారు. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని కూలగొట్టకుండా పురావస్తు సంపదగా ఉంచుతారు.

ప్రస్తుత పార్లమెంటు భవనం బ్రిటిష్ హయాంలో  నిర్మించారు.  ఎడ్విన్ లుట్యెన్స్, హెర్బర్ట్ బేకర్ లు ఈ భవనం డిజైన్ తయారు చేశారు. వారి సారథ్యంలోనే భవన నిర్మాణం జరిగింది. ఈ భవనానికి 1921, ఫిబ్రవరి 12న పునాది రాయి వేశారు. ఆ తర్వాత భవనం పూర్తి కావడానికి 6 ఏళ్లు పట్టింది. అప్పట్లో  83 లక్షలు ఖర్చయిందట. 1927 జనవరి 18న భవనాన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. 

కాగా 2001 డిసెంబర్ 13 న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు పార్లమెంటు పై దాడి చేసారు. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారు.  భద్రతా దళాలు  సమర్ధవంతంగా ఎదుర్కొని దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్నీ హతమార్చారు. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది ఒక తోటమాలి  మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు  నాటి నుంచి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. 

————– Theja 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!