ఇది మరో సెప్టెంబర్ 11 కథ . . చిలీ లో నరమేధం ! (1)

Sharing is Caring...

Taadi Prakash………………………….. 

1973 సెప్టెంబర్ 11న చిలీలో అలెండీ ప్రభుత్వాన్ని కూల్చి వేసిన తర్వాత జరిగిన హత్యాకాండ గురించి గతంలో నేనొక వ్యాసం రాశాను. దర్శకుడు కోస్టాగౌరస్ తీసిన మిస్సింగ్ సినిమా అందులో ప్రధానాంశం. మా అన్నయ్య ఆర్టిస్ట్ మోహ‌న్ చిలీ గురించి వ్యాసం రాస్తానని చెప్పి ఎప్పటికీ రాయలేదని నేను అన్నాను.

అయితే బాలగోపాల్, వసంతలక్ష్మి మానవహక్కుల వేదిక బులెటిన్ చాలాకాలంతెచ్చారు. ఇప్పటికీ ఆ బులెటిన్ వస్తూనే ఉంది. 2001నవంబర్ లో వచ్చిన బులెటిన్ లో చిలీపై మోహ‌న్ రాసిన వ్యాసం ఉంది. వసంత లక్ష్మి గారు ఈమధ్యనే నాకు ఆవ్యాసం పంపించారు. ఆ బులెటిన్ కి ఆమే ఎడిటర్. Thank you so much. 

2001 నవంబర్ 11న మోహన్ ఈవ్యాసం రాశాడు. చాలా ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి….
*** *** ***
ఇరవయ్యెనిమిదేళ్ళ క్రితం సెప్టెంబర్ 11 రాత్రి. టెలిప్రింటర్ గొడవ చేస్తోంది. ఫ్లాష్ … ఫ్లాష్ .. శాంటియాగో : అధ్యక్ష భవనం లామోనెడాపై బాంబు దాడి. వివరాల కోసం ఎదురుచూడండి .. అంటూ వార్త మొదలయింది. టెలిప్రింటర్ మీద కాయితాలు చింపి మా పత్రిక నైట్ షిఫ్ట్ ఇంచార్జి పూర్ణచంద్రరావు గారికిచ్చాను. “అనుకున్నంతా అయిందే” అన్నాడాయన. చిలీ మీద ఇలాంటి దాడి షాక్ ఏమీ కాదు. ఏడాదికి పైగానే అమెరికా ఈ ప్రయత్నాల్లో బిజీగా వుంది. మల్టీ నేషనల్ కార్పొరేషన్ ఐటీటీ, సీఐఏ ఈ దాడికి తెగ ఏర్పాట్లు చేశాయి.

మళ్ళీ వార్తలు : చిలీ సైన్యంలో ఒక భాగం తిరగబడింది. దాని విమానాలు అధ్యక్ష భవనం మీద బాంబులు కురిపిస్తున్నాయి. లామోనెడా కప్పు కొన్నిచోట్ల ధ్వంసమయింది. భవనం బయట సాయుధ శకటాల నుంచి మైకుల్లో హెచ్చరికలు. అధ్యక్షుడు సాల్వెడార్ అలెండినీ, ఆయన వెంట వున్న మంత్రులు, సహాయకులనూ లొంగిపొమ్మని జనరల్ పీనోచెట్ సైన్యం పదేపదే ప్రకటిస్తోంది. ప్రాణాలతో వదిలేస్తాం, బతికిపొండని చెపుతోంది. రాజధాని శాంటియాగోలో కర్ఫ్యూ. వీధుల నిండా ట్యాంకులు, సైనికుల గస్తీ. వూరంతా అరెస్టులు.

వార్తలన్నీ గుదిగుచ్చి రాస్తుంటే చాలా బెంగగా వుంది. లాటిన్ అమెరికాలో ఒంటరి క్యూబాకి తోడుగా వెలిగిన ఆశ కళ్లముందే ఆరిపోతోంది. విశాలాంధ్ర మార్నింగ్ ఎడిషన్ ప్రింటింగ్ కి ఇవ్వడానికింకా రెండు గంటల టైముంది. ప్రతి ఐదు నిమిషాలకీ టెలిప్రింటర్ రూమ్ లో దూరి ఏపీ/ ఏఎఫ్పీ/ యూటీఐ వార్తల్ని ఆత్రంగా చదువుతున్నాం.

మరింత న్యూస్ : అధ్యక్ష భవనం లోపల అలెండీతో సహా అందరూ మెషిన్ గన్ లతో ఆకాశంలోకి సైనిక విమానాల మీద ఎదురు కాల్పులు జరుపుతున్నారు. లొంగిపోయేది లేదనేది స్పష్టం. పైనుంచి బాంబులు కురుస్తూనే వున్నాయి. చాలాకాలం తర్వాత తెలిసింది, ఆ భవంతిలో పట్టుమని పాతికమంది కూడా లేరని. అందరూ గని కార్మికుల్లాగా హెల్మెట్లు పెట్టుకొని తెల్లారేవరకూ, మందుగుండు అంతా అయిపోయేవరకూ కాల్పులు జరుపుతూనే ఉన్నారని.

అంతలోనే ఓ ప్రకటన : దేశ ప్రజలనుద్దేశించి అధ్యక్షుడు అలెండీ ప్రసంగిస్తారని. ఆయన తలకు హెల్మెట్ పెట్టుకొని, చేత్తో మెషీన్ గన్ పట్టుకుని ప్రసంగించారు.మధ్యమధ్యలో కాల్పులు జరపటానికి కిటికీ దగ్గరకెళ్ళినపుడు ప్రసంగం ఆగేది. కాల్పుల చప్పుడు. మళ్ళీ అలెండీ గొంతు. ప్రాణాలు పోయేవరకూ పోరాడతామనీ, ప్రజలంతా పోరాడాలనీ సందేశం. అప్పటి అలెండీనీ, ఆయన సహాయకులనూ ఓ జర్నలిస్ట్ కెమెరా క్లిక్ మనిపించింది. ఫొటో జర్నలిజంలో ఆ ఏడాది అంతర్జాతీయ అవార్డు గెలుచుకుంది అది.

మొన్న న్యూయార్కులో భవనాలు పేలినపుడు ప్రెసిడెంట్ బుష్ అడ్రెస్ దొరక్కుండా గల్లంతై విమానాల్లో దాక్కున్నాడు. అలాగని రాసిన జర్నలిస్టుని ఉద్యోగం నుంచి పీకేశారు. ఎంత తేడా! రాత్రి రెండు కావస్తోంది. వార్తలన్నీ పేర్చి పేజీలు పెట్టాం. టెలిప్రింటర్ వదిలి రాత్రి ఇంటికెళ్లాలంటే ప్రాణం కొట్టుకుంటోంది. జరగబోయే ఘోరం తెలిసిపోతోంది. చిలీలో వెల్లువలా వచ్చిన సోషలిస్టు, కమ్యూనిస్టుల పాపులర్ ఫ్రంట్ ఉద్యమం వేనకువేల మంది కార్యకర్తల్నీ, సానుభూతిపరుల్నీ వీధుల్లోకి తెచ్చింది. వీళ్లంతా ఇప్పుడు సైన్యం తుపాకుల ముందు నిస్సహాయంగా మిగిలిపోతారు. ఈ ఉద్యమం చిలీలో రినైజాన్స్ తీసుకొచ్చింది.

నవలలు, కథలు, కవితలు, వీధి నాటకాల సాంస్కృతిక దళాలు, కొత్త సినిమాలు, మరీ ముఖ్యంగా కొత్త గాయకులూ, పాటలూ పుట్టాయి. వీటిని రాసిన, పాడిన వందలాది మంది ఆర్టిస్టులంతా తుపాకీ గొట్టాల ఎదురుగా వుంటారు. ఏమవుతుందో!మర్నాడు పత్రికల మొదటి పేజీల్లో చిలీ వార్తలిచ్చారు. కానీ అమెరికన్ న్యూస్ ఏజెన్సీలు వడపోసినవే. అలెండీ చేసిన మార్క్సిస్ట్ ఎక్స్పరిమెంట్ ఫెయిలయిందని ఎక్కువమంది ఎడిటోరియల్స్ రాశారు. ఇంకా కోల్డ్ వార్ లెక్కల్లో రష్యా ఎంత దెబ్బతిందో బేరీజులు వేశారు.

న్యూయార్కు టైమ్స్ గానీ, టైమ్ మ్యాగజైన్ గానీ, ఇక్కడ మన పత్రికలు గానీ “ఇది మానవాళి పై దాడి” అని అనలేదు. “ఇది నాగరికత పై దాడి” అనలేదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని సైనిక నియంత కూల్చడం దారుణమని గానీ, తప్పనిగానీ రాయలేదు. అలెండీ పాపానికి అతనే పోయాడన్నట్టు వెర్రిమొర్రి కామెంట్లు. ఆరోజు ఆంధ్రప్రదేశ్ లో మన అసెంబ్లీ గానీ, ఢిల్లీ లో పార్లమెంట్ గానీ ఈ ఘోరాన్ని ఖండిస్తూ తీర్మానాలు చేయలేదు. “ద టవర్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బట్ నాట్ ది స్పిరిట్” అని తాటికాయల కంటే పెద్ద అక్షరాలతో బేగంపేట ఫ్లై ఓవర్ మీద హోర్డింగ్లు రాలేదు.

శాంటియాగోలో మంత్రుల్నీ, ప్రభుత్వ అధికారుల్నీ, వీధుల్లో ప్రజల్నీ పిట్టల్లా కాల్చిచంపుతున్న టెర్రరిస్టుల్ని తక్షణమే, లేక తర్వాతైనా శిక్షించాలని ప్రెసిడెంట్ నిక్సన్ నోటిమాటగానైనా అనలేదు. ఇప్పుడు “కొయలిషన్ ఎగైనెస్ట్ టెర్రరిజం” లో చేరిన ఒక్క దేశం కూడా ఆనాడు పల్లెత్తుమాట అనలేదు. పైగా నెత్తురోడుతున్న చిలీ వీధుల్ని చూసి సోషలిస్ట్, కమ్యూనిస్ట్ పీడ విరగడైందని బాహాటంగా ఆనందం ప్రకటించారు. ఒక్కోరోజు గడుస్తున్నకొద్దీ వార్తలు మరింత ఘోరంగా ఉన్నాయి.

శాంటియాగోలో జైళ్లు చాలక నేషనల్ ఫుట్ బాల్ స్టేడియంను జనంతో నింపేసింది మిలిటరీ. ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులు, యూనివర్సిటీ స్టూడెంట్స్, రచయితలు, గాయకులు, ఆర్టిస్టులు, ఏమీకాని అమాయక ప్రజలతో స్టేడియం నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుగా మారింది. అక్కడి క్రూరత్వం, హింస, హత్యల గురించి ఈ ఇరవయ్యెనిమిదేళ్ళుగా వచ్చిన న్యూస్ స్టోరీలు, అనుభవాలు, జ్ఞాపకాలు, నవలలు, సినిమాలూ కోకొల్లలు. 

Read it also ————- ఇది మరో సెప్టెంబర్ 11 కథ . . చిలీ లో నరమేధం ! (2)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!